టీడీపీ ఎమ్మెల్యేపై అసెంబ్లీలో సీఎం జగన్ సీరియస్..

ABN , First Publish Date - 2020-12-03T18:14:00+05:30 IST

టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడిపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు

టీడీపీ ఎమ్మెల్యేపై అసెంబ్లీలో సీఎం జగన్ సీరియస్..

అమరావతి : టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడిపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు. గురువారం నాడు అసెంబ్లీలో సంక్షేమ పథకాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీకి చెందిన సభ్యుల ప్రశ్నలకు సంబంధిత మంత్రులు నిశితంగా సమాధానాలిచ్చారు. ఈ క్రమంలో రామానాయుడు వైసీపీ అధికారంలోకి వచ్చాక రూ.3000 పెన్షన్ ఇస్తామన్నారు..? అసలేమైంది అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆయన మాటలను వైసీపీ సభ్యులు, మంత్రులు తప్పుబట్టారు. అంతేకాదు.. ఆయనపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు కూడా ఇచ్చారు. రామానాయుడు వ్యాఖ్యలపై సీఎం జగన్ మాట్లాడుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఆయనకు మాట్లాడే అవకాశం ఇవ్వొద్దు..

టీడీపీ ఎమ్మెల్యేకు సభలో మాట్లాడే అర్హత లేదు. టీడీపీ సభ్యులు ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల నుంచి వచ్చిన వినతుల మేరకే వైఎస్ఆర్ చేయూత పథకం తెచ్చాం. టీడీపీ నేతలు ఉద్ధేశ్యపూర్వకంగా సభను తప్పుదారి పట్టిస్తున్నారు.  రామానాయుడు డ్రామా నాయుడుగా మారారు. సభలో రోజూ అబద్ధాలు మాట్లాడుతున్నారు. రామానాయుడికి సభలో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వొద్దు. రాజకీయ లబ్ధి కోసమే దురుద్దేశంతో అబద్ధాలు చెబుతున్నారు. అసత్యాలు చెప్పేవారిని సభలో బ్యాన్ చేయాలి. మా మేనిఫెస్టో రెండు పేజీలే ఉంటుంది. 2018 సెప్టెంబర్‌-03న చెప్పిన మాటనే మేనిఫెస్టోలో పెట్టాం. వచ్చే జూలై-08న పింఛన్ రూ. 2,250 నుంచి 2,500కు పెంచుతాం. పథకాల విషయంలో టీడీపీ సభ్యులు అవాస్తవాలు మాట్లాడుతున్నారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగానే పథకాలు అమలు చేస్తున్నాం అని అసెంబ్లీలో జగన్ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు.


ఈ ప్రివిలేజ్ మోషన్‌పై స్పీకర్ తమ్మినేని సీతారం స్పందించారు. సీఎం జగన్ ప్రతిపాదించిన ప్రివిలేజ్ మోషన్‌ను కమిటీకి రిఫర్ చేస్తున్నట్లు తెలిపారు. సభలో నిజానిజాలు మాట్లాడాలని సభాపతి ఈ సందర్భంగా సూచించారు. మొదటి రోజు అసెంబ్లీలో మొదలైన రగడ నాలుగో రోజూ కంటిన్యూ అవుతోంది. ఇప్పుడు కూడా తాజా ఘటనపై టీడీపీ సభ్యులు సభలోనే నిరసన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2020-12-03T18:14:00+05:30 IST