ఎన్నికల వాయిదాపై సీఎం జగన్ తీవ్ర అసంతృప్తి!

ABN , First Publish Date - 2020-03-15T18:24:19+05:30 IST

6 వారాల తర్వాత పరిస్థితిని సమీక్షించి షెడ్యూల్‌ను విడుదల చేస్తామని..

ఎన్నికల వాయిదాపై సీఎం జగన్ తీవ్ర అసంతృప్తి!

అమరావతి : కరోనా ఎఫెక్ట్‌తో త్వరలో ఏపీలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ ప్రకటించారు. 6 వారాల పాటు ఈ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు సీఈసీ ప్రకటించడం జరిగింది. 6 వారాల తర్వాత పరిస్థితిని సమీక్షించి షెడ్యూల్‌ను విడుదల చేస్తామని ఆయన తెలిపారు. అయితే.. ఇప్పటి వరకూ ఏకగ్రీవమైన స్థానాల్లో ఎన్నికలు ఉండవని స్పష్టం చేశారు.


జగన్ తీవ్ర అసంతృప్తి!

ఎన్నికల వాయిదాపై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల వాయిదా విషయమై చర్చించడానికి కాసేపట్లో గవర్నర్‌ హరిచందన్‌ను జగన్‌ కలవనున్నారు. ఈ భేటీలో భాగంగా అధికారులపై చర్యలపట్ల గవర్నర్‌కు సీఎం వివరించనున్నారని తెలుస్తోంది. కరోనా ప్రభావంతో ఎన్నికలు వాయిదా వేశారని చెప్పడాన్ని ప్రభుత్వం విశ్వసించట్లేదని సమాచారం!. జరిగిన సంఘటనలపై గవర్నర్‌కు జగన్ నిశితంగా వివరించనున్నారని తెలుస్తోంది. అయితే.. ఎన్నికలు వాయిదాపడితే మాత్రం 14వ ఆర్థికసంఘం నుంచి నిధులు రావని ప్రభుత్వం చెబుతోంది.


అంతకుముందు కరోనా విషయమై మంత్రి ఆళ్ల నాని, వైద్యాధికారులు, ఉన్నతాధికారులతో జగన్ సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమీక్ష అనంతరం నేరుగా గవర్నర్ కార్యాలయానికి జగన్ చేరుకున్నారని తెలుస్తోంది. మరి భేటీలో ఈ విషయాలపైనే చర్చిస్తారా..? లేకుంటే కరోనా విషయంపై చర్చిస్తారా..? అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా ఎన్నికల వాయిదాపై పలు పార్టీల నేతలు తమదైన శైలిలో మీడియా ముందుకు వచ్చి స్పందిస్తున్నారు.

Updated Date - 2020-03-15T18:24:19+05:30 IST