సీఎం నియోజకవర్గంలోనే నామినేషన్‌ వేస్తారా?

ABN , First Publish Date - 2020-03-12T10:47:47+05:30 IST

నామినేషన్ల చివరిరోజు వైసీపీ నాయకుల దాడులు, దౌర్జన్యాలతో సీఎం జగన్‌ సొంత జిల్లా కడప ఉద్రిక్తంగా మారింది. పులివెందుల

సీఎం నియోజకవర్గంలోనే నామినేషన్‌ వేస్తారా?

  • కడపలో టీడీపీ మహిళా అభ్యర్థి అడ్డగింత 

కడప, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): నామినేషన్ల చివరిరోజు వైసీపీ నాయకుల దాడులు, దౌర్జన్యాలతో సీఎం జగన్‌ సొంత జిల్లా కడప ఉద్రిక్తంగా మారింది. పులివెందుల నియోజకవర్గం తొండూరు జడ్పీటీసీ స్థానానికి ఎనగనూరుకు చెందిన కదిరి అరుణమ్మ టీడీపీ అభ్యర్థిగా నామినేషన్‌ వేసేందుకు భర్త దస్తగిరిరెడ్డితో కలిసి జడ్పీ కార్యాలయానికి వచ్చారు. సీఎం నియోజకవర్గంలోనే నామినేషన్‌ వేస్తారా..? అంటూ అక్కడున్న వైసీపీ కార్యకర్తలు  అడ్డుకున్నారు. ఆమెను పక్కకు తోసేసి దస్తగిరిరెడ్డిని ప్రధాన గేటు ద్వారం వరకు తోసుకుంటూ వెళ్లారు. భర్తను కిడ్నాప్‌ చేస్తారేమోనని అరుణమ్మ వారితో పాటు పరుగులు పెట్టింది. చివరికి వారి చేతిలోని నామినేషన్‌ పత్రాలు, పంచాయతీ నోటీసు సర్టిఫికెట్లు చింపివేసి దాడి చేశారు. పెండ్లిమర్రి మండలం మొయిల్ల కాల్వ ఎంపీటీసీ స్థానానికి టీడీపీ అభ్యర్థి షేక్‌ మున్నీ నామినేషన్‌ వేసేందుకు వస్తుండగా వైసీపీ వర్గీయులు కిడ్నాప్‌ చేసి రాత్రి పొద్దుపోయాక వదిలేశారు. దీనిపై పుత్తా నరసింహారెడ్డి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ చీఫ్‌విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న రాయచోటి నియోజకవర్గంలోని చిన్నమండెం మండలం దేవగుడిపల్లె ఎంపీటీసీ స్థానానికి టీడీపీ అభ్యర్థి నాగరత్న నామినేషన్‌ వేయడానికి రాగా వైసీపీ నాయకులు దాడి చేసి నామినేషన్‌ పత్రాలు చింపివేశారు. చివరకు ఆమె పోలీసుల రక్షణతో నామినేషన్‌ వేయాల్సి వచ్చింది. మైదుకూరు నియోజకవర్గంలోని చాపాడు మండలం అల్లాడుపల్లెలో టీడీపీ అభ్యర్థిపై వైసీపీ నాయకులు దౌర్జన్యం, దాడికి దిగడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. రైల్వేకోడూరులో నామినేషన్‌ వేసేందుకు వచ్చిన టీడీపీ అభ్యర్థులు వెంకట సుబ్బమ్మ, నాగేశ్వర్‌రావు మరో ముగ్గురిని వైసీపీ నాయకలు అడ్డుకుని బయటికి తోసేశారు. 

Updated Date - 2020-03-12T10:47:47+05:30 IST