ఇసుకపై సీఎం మాటలు నీటి మూటలు

ABN , First Publish Date - 2020-12-05T09:04:33+05:30 IST

‘‘గ్రామ సచివాలయాల్లో బుక్‌ చేసుకుంటే ఉచితంగా ఇసుకను ఇస్తామన్న సీఎం జగన్‌ ప్రకటనలు నీటి మూటలుగా మారాయి.

ఇసుకపై సీఎం మాటలు నీటి మూటలు

ఆయన చెప్పినట్టు ఎక్కడా దొరకట్లేదు

కొత్త పాలసీతో కాంట్రాక్టర్లకు కాసుల పంట

రోలుగుంట మండల వైసీపీ నేతల ఆందోళన


రోలుగుంట(విశాఖ), డిసెంబరు 4: ‘‘గ్రామ సచివాలయాల్లో బుక్‌ చేసుకుంటే ఉచితంగా ఇసుకను ఇస్తామన్న సీఎం జగన్‌ ప్రకటనలు నీటి మూటలుగా మారాయి. ఎక్కడా ఆచరణకు నోచుకోవడం లేదు. స్థానికంగా వరహా నది నుంచి ఉచితంగా సరఫరా చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా క్షేత్రస్థాయిలో అమలుకావడం లేదు. నూతన ఇసుక పాలసీ.. కాంట్రాక్టర్లు, అధికారులకు కాసుల పంటగా మారింది’’ అని విశాఖ జిల్లా రోలుగుంట మండల వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ఇసుక విధానం వల్ల నిర్మాణ రంగం పూర్తిగా నాశనమైందని, భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయం ఎదుట భవన నిర్మాణ కార్మికులతో కలిసి వీరు నూతన ఇసుక విధానంపై నిరసన తెలిపారు. అనంతరం, జడ్పీటీసీ వైసీపీ అభ్యర్థిని పోతల లక్ష్మిరమణమ్మ భర్త శ్రీనివాసరావు, రోలుగుంట ఎంపీటీసీ వైసీపీ అభ్యర్థి మడ్డు తాతబాబు, జేనాయుడుపాలెం ఎంపీటీసీ అభ్యర్థి కిల్లాడ నరసింగరావులు విలేకరులతో మాట్లాడుతూ.. నిర్మాణదారులకు ఇసుక కొనుగోలు తలకుమించిన భారంగా మారిందన్నారు. టన్నుకు రూ.1000 నుంచి రూ.2000 వరకు రవాణా చార్జీల కింద చెల్లించాల్సిన పరిస్థితి నెలకొందని తెలిపారు. దీంతో పనులు నిలిచిపోయి.. భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. వారి ఆకలిబాధలు చూసి తట్టుకోలేకే ప్రభుత్వంపై పోరాటానికి దిగినట్టు ప్రకటించారు. ట్రాక్టర్‌ ఇసుక కోసం ప్రజలు నానా తంటాలు పడుతున్నారని తెలిపారు. 

Updated Date - 2020-12-05T09:04:33+05:30 IST