సీఎం వర్సెస్ ఎస్ఈసీ.. వాయిదాపై వార్‌

ABN , First Publish Date - 2020-03-16T09:07:20+05:30 IST

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌పై బాగా కోపమొచ్చింది. అది... ఒక ముఖ్యమైన సమావేశం నుంచి మధ్యలోనే వెళ్లిపోయేంత కోపం! ఆగమేఘాలపైన గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేసేంత కోపం! పదవి చేపట్టి పది నెలలైనా

సీఎం వర్సెస్ ఎస్ఈసీ.. వాయిదాపై వార్‌

  • స్థానిక సమరం ఆపడంపై సీఎం జగన్‌ ఫైర్‌
  • ఎన్నికల వాయిదా, కలెక్టర్లు, ఎస్పీల బదిలీపై 
  • కస్సుమన్న ముఖ్యమంత్రి
  • ఎస్‌ఈసీ రమేశ్‌ది బాబు కులమని ధ్వజం
  • కరోనాకు పారాసిటమల్‌ చాలని ప్రకటన
  • వారంలో కొంపలు మునిగిపోవని గుస్సా
  • అధికారుల బదిలీ అధికారం ఎవరిదంటూ నిలదీత
  • ఎస్‌ఈసీపై గవర్నర్‌కు ఫిర్యాదు
  • సీఎంగా తొలిసారి మీడియా ముందుకు
  • ప్రశ్నలకు తావివ్వకుండా ముగింపు


ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు  రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌పై బాగా  కోపమొచ్చింది. అది... ఒక ముఖ్యమైన సమావేశం నుంచి మధ్యలోనే వెళ్లిపోయేంత కోపం! ఆగమేఘాలపైన గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేసేంత కోపం! పదవి చేపట్టి పది నెలలైనా ఒక్కసారి కూడా తెలుగు మీడియాతో మాట్లాడని ఆయన... అప్పటికప్పుడు విలేకరుల సమావేశం పెట్టి ఆక్రోశం వెళ్లగక్కేంత కోపం! 


ఈ కోపం ఎందుకంటే... 

శనివారం సాయంత్రం దాకా ‘ఉందా... లేదా’ అని విపక్షం విమర్శలు ఎదుర్కొన్న రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) ఉన్నట్టుండి కొరడా ఝళిపించింది.  అధికారపక్షం దౌర్జన్యాలు, బెదిరింపులు, ఉపసంహరణ గడువు ముగిశాక కూడా విత్‌డ్రాలు జరిగినా కిమ్మనని ఎస్‌ఈసీకి హఠాత్తుగా తన ‘విచక్షణాధికారం’ గుర్తుకొచ్చింది. చైనాని వణికించి, ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్‌ ఇప్పుడు భారత్‌నూ భయపెడుతున్న నేపథ్యంలో స్థానిక ఎన్నికల ప్రక్రియను ఆరు వారాలు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ ఆదివారం ఉదయం ప్రకటించారు. ఈ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరమేమిటో వివరించారు. అంతే... ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు విపరీతమైన కోపమొచ్చింది. విపక్షాల ఫిర్యాదులపై కిమ్మనడం లేదని, అధికార పార్టీకి  సహకరిస్తున్నారని విమర్శలు ఎదుర్కొంటున్న ఎస్‌ఈసీ కులమేమిటో.... జగన్‌కు ‘వాయిదా’ వెంటనే గుర్తుకొచ్చింది. స్థానిక ఎన్నికల్లో తాము ఊడ్చేస్తున్నామని, దీనిని తట్టుకోలేక చంద్రబాబు సామాజిక వర్గం కావడంవల్లే ఎస్‌ఈసీ రమేశ్‌ కుమార్‌ స్థానిక ఎన్నికలను వాయిదా వేశారన్నారు. ‘ప్రతోడూ విచక్షణాధికారాల మాటెత్తడమే’ అని మండిపడ్డారు. ‘కరోనాకు మందులేదు మొర్రో’ అని ప్రపంచ శాస్త్రవేతలు తలలు బద్దలుకొట్టుకుంటుండగా... ‘పారాసిటమాల్‌’తో పోయే కరోనాకు భయపడి స్థానిక ఎన్నికలు వాయిదా వేయడమేమిటని జగన్‌ ప్రశ్నించారు. 


పది రోజులాగితే ముగిసే ఎన్నికలను... ఎప్పుడు పోతుందో తెలియని కరోనా పేరిట ఆపేస్తారా అని నిలదీశారు. ఇక... చిత్తూరు, గుంటూరు ఎస్పీలు, కలెక్టర్లతోపాటు పలువురు పోలీసు అధికారులను తప్పించాలన్న ఎస్‌ఈసీ ఆదేశాన్నీ తప్పుబట్టారు. ‘స్థానిక ఎన్నికల్లో ఎప్పుడైనా ఇంతకంటే తక్కువ సంఘటనలు జరిగాయా?’ అనే ప్రశ్న లేవనెత్తారు. ముఖ్యమంత్రి హోదాలో అధికారికంగా నిర్వహించిన విలేకరుల సమావేశానికి... ఆహ్వానం పంపి కూడా, ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధులను అనుమతించలేదు. సీఎం అయ్యాక తొలిసారి మీడియాతో మాట్లాడిన జగన్‌... తాను చెప్పాల్సింది చెప్పి, ప్రశ్నలు అడిగేందుకు ఆస్కారం ఇవ్వకుండా వెళ్లిపోయారు. అటు విపక్ష నేత చంద్రబాబు ‘స్థానిక ఎన్నికలను వాయిదా వేయడం కాదు... రద్దు చేసి మళ్లీ  నోటిఫికేషన్‌ ఇవ్వాలి’ అని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నేతృత్వంలో ఎన్నికల నిర్వహణ ప్రజాస్వామ్యానికి మంచిది కాదని, కేంద్ర ఎన్నికల కమిషన్‌ రంగంలోకి దిగాలని కోరారు. అధికార పార్టీకి రాష్ట్ర పోలీసులు భయపడుతున్నారని...సీఆర్పీఎఫ్‌ బలగాలను దించాలని అన్నారు. కరోనాపై తేలిగ్గా మాట్లాడిన సీఎం జగన్‌ తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. రమేశ్‌ కుమార్‌ను ఎస్‌ఈసీగా సిఫారసు చేసింది తాను కాదని, గత గవర్నర్‌ నరసింహన్‌ అని స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ దౌర్జన్యాలను అడ్డుకోవాల్సిందే అని ఇతర పార్టీల నేతలూ డిమాండ్‌ చేశారు. ఏదిఏమైనా... శనివారం రాత్రిదాకా అధికార పార్టీకి ‘మంచిది’గా కనిపించిన ఎస్‌ఈసీ ఉన్నట్టుండి చేదైపోయింది. ఎస్‌ఈసీ ఆదేశాలను జగన్‌ ప్రభుత్వం అమలు చేస్తుందా? ‘నువ్వు చెబితే నేను వినేదేంటి?’ అని మొండికేస్తుందా? రాజ్యాంగ వ్యవస్థకూ, రాష్ట్ర ప్రభుత్వానికీ మధ్య ‘పంచాయితీ’ ఎంత దూరం వెళ్తుంది? ఎన్ని మలుపులు తిరుగుతుంది? వేచి చూడాల్సిందే!

Updated Date - 2020-03-16T09:07:20+05:30 IST