రద్దీ ఉండొద్దు!

ABN , First Publish Date - 2020-04-15T08:39:13+05:30 IST

కరోనా వైరస్‌ విస్తరించకుండా నియంత్రించాలంటే.. రద్దీని, గుంపులు గుంపులుగా గుమిగూడడాన్ని అడ్డుకోవాలని సీఎం జగన్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు.

రద్దీ ఉండొద్దు!

లేదంటే లాక్‌డౌన్‌ ఉద్దేశం నెరవేరదు

గుంపులుగా గుమిగూడొద్దు

రేషన్‌, వెయ్యి పంపిణీపై తనిఖీలొద్దు

తర్వాత పరిశీలన చేసుకోవచ్చు

హాట్‌స్పాట్లలో హోం డెలివరీ

జిల్లా షెల్టర్‌ జోన్లలో రెసిడెంట్‌ అధికారి

క్వారంటైన్‌ కేంద్రాల్లో సకల వసతులు

మంచి బెడ్స్‌, భోజనం ఉండాలి

హైరిస్క్‌ ఉన్న వారిపైనే కరోనా ప్రభావం

కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌


అమరావతి, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ విస్తరించకుండా నియంత్రించాలంటే.. రద్దీని, గుంపులు గుంపులుగా గుమిగూడడాన్ని అడ్డుకోవాలని సీఎం జగన్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇలా రద్దీ ఉండకూడదంటే.. ప్రతి రోజూ ప్రజలకు నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచాలని చెప్పారు. రద్డీ ఉంటే లాక్‌డౌన్‌ ఉద్దేశం నెరవేరదన్నారు. మంగళవారమిక్కడ తన క్యాంపు కార్యాలయం నుంచి కరోనా కట్టడిపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.లాక్‌డౌన్‌ సందర్భంగా రేషన్‌, వెయ్యి రూపాయల పంపిణీపై తనిఖీలు చేపట్టవద్దని వారిని ఆదేశించారు. తర్వాత పరిశీలన చేసుకోవచ్చన్నారు.


ప్రభుత్వం ఇచ్చిన పరిమిత సమయంలోనే భౌతిక దూరం పాటిస్తూ.. మార్కెట్లను, రైతుబజార్లను వికేంద్రీకరిస్తూ.. ఆంక్షలను అమలు చేస్తూ రోజూ నిత్యావసరాలను సరఫరా చేయాలని పేర్కొన్నారు.ప్రజలు బయటకు రావడాన్ని తగ్గించాలని.. వారికి అన్నీ అందుబాటులో ఉంచాలన్నారు. హాట్‌ స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాల్లో హోం డెలివరీ లాంటి మార్గాలను ఎంచుకుంటే మంచిదని సూచించారు. నిత్యావసరాల ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇంకా ఏమన్నారంటే..


డిశ్చార్జి చేసేటప్పుడు ప్రొటోకాల్‌..

‘కరోనా పాజిటివ్‌ కేసులు వచ్చిన వారికి ఒకటికి రెండు సార్లు పరీక్షలు చేసి నెగిటివ్‌ వస్తేనే ఇళ్లకు పంపించాలి. పూర్తి ప్రోటోకాల్‌ పాటించాలి. క్వారంటైన్‌ కేంద్రాల్లో సదుపాయాలుంటే ప్రజలెవరూ ఇళ్లకు వెళ్తామన్న ఆలోచన చేయరు. బాత్‌రూమ్స్‌, బెడ్స్‌, మంచి భోజనం.. ఇవన్నీ అందిస్తే ఇంటికన్నా క్వారంటైన్‌ కేంద్రమే మంచిదన్న ఆలోచన వారికి వస్తుంది. జిల్లా షెల్టర్‌ జోన్లు అన్నిటిలో రెసిడెంట్‌ అధికారిని పెట్టాలి. పేషెంట్‌ కేర్‌ మేనేజ్‌మెంట్‌ చాలా ముఖ్యం. కుటుంబ సర్వేతో జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరం, బీపీ, షుగర్‌, ఉబ్బసం వంటి లక్షణాలు ఉన్నవారిని గుర్తించి వారందరికీ పరీక్షలు చేయించాలి. వైద్యాధికారి నిర్ధారించిన వారే కాకుండా అందరికీ పరీక్షలు చేయించాలి. ఒకవేశ కరోనా సోకితే.. ఈ హైరిస్క్‌ ఉన్న వారిపై ప్రభావం చూపుతుంది.


వారిని క్రిటికల్‌ కేర్‌కు తరలించి మంచి వైద్యం ఇప్పించాలి. ప్రతి ఆస్పత్రిలోనూ ఐసొలేషన్‌ సదుపాయం ఉండాలి. రేషన్‌ షాపు పరిధిలో రెండు మూడు కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. అంతేగాకుండా ప్రజలు గుమిగూడకుండా ముందే టోకెన్లు ఇస్తున్నాం. అర్హత ఉంటే కార్డు లేదనే పరిస్థితి రానివ్వొద్దు. ఏ మనిషీ పస్తు ఉండకూడదు. గతంలో ప్రకటించిన విధంగా రేషన్‌ తీసుకున్న ప్రతి ఒక్కరికీ వెయ్యి రూపాయలివ్వాలి. పాత రేషన్‌ కార్డున్నా.. బియ్యం తీసుకున్నా సరే.. వెంటనే వారి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని రూ.1000 ఇవ్వాలి. ధాన్యం కొనుగోళ్లను గ్రామ స్థాయిలోనే చేస్తున్నాం. వ్యవసాయ సహాయకులకు బాధ్యతలు అప్పగించాం. ఈ సమయంలో వ్యవసాయాన్ని కాపాడుతూ.. రైతు ఇబ్బంది పడకుండా చూడగలిగితే 60 శాతం ఆర్థిక వ్యవస్థను నిలబెట్టుకోగలుగుతాం. కరోనా విపత్తు సమయంలో రైతులను ఆదుకునేందుకు చేసిన వినూత్న ఆలోచనే వైఎ్‌సఆర్‌ జనతా బజార్లు. ఎంపెడా నిర్దేశిత రేట్లకు రొయ్యల కొనుగోలు జరిగేలా చూడాలి. రైతు భరోసా కేంద్రాలను బుధవారంనాటికి సిద్ధం చేయాలి.’


పొజిషన్‌లో ఉన్న భూమిని తీసుకోండి..

‘ఇళ్ల పట్టాల కోసం తీసుకున్న ప్రతి ఎకరాను వారి అనుమతితోనే.. పూర్తి డబ్బు చెల్లించాకే తీసుకున్నామని చెప్పడానికి గర్వపడుతున్నాను. పొజిషన్‌లో ఉన్న భూమిని వెంటనే తీసుకోవడంపై అధికారులు దృష్టిపెట్టాలి. పట్టాల పంపిణీకి అవసరమైన లేఅవుట్లు సిద్ధం చేయాలి. 2018-19కు సంబంధించి రూ.1,800 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించాం. 2019-20కి సంబంఽధించి మూడు త్రైమాసికాలకు రీయింబర్స్‌ చేశాం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల తల్లుల ఖాతాలకే జమచేస్తాం.’

Updated Date - 2020-04-15T08:39:13+05:30 IST