గత్యంతరం లేకనే ‘సీమ’కు శ్రీకారం

ABN , First Publish Date - 2020-10-07T10:05:42+05:30 IST

కృష్ణా నదిపై తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులన్నిటికీ శ్రీశైలం జలాశయంలో 800 అడుగుల ఎత్తు నుంచే నీటిని

గత్యంతరం లేకనే ‘సీమ’కు శ్రీకారం

శ్రీశైలంలో 800 అడుగుల నుంచే తెలంగాణ తోడేస్తోంది

మేం మాత్రం 854 అడుగుల నుంచి తీసుకోవాలంటోంది

సీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు

600 టీఎంసీలు అవసరం

శ్రీశైలం మరమ్మతుకు 900 కోట్లు కావాలి

జలశక్తి శాఖే ఆర్థిక తోడ్పాటివ్వాలి

షెకావత్‌కు సీఎం జగన్‌ లేఖ


అమరావతి, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): కృష్ణా నదిపై తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులన్నిటికీ శ్రీశైలం జలాశయంలో 800 అడుగుల ఎత్తు నుంచే నీటిని తోడేస్తోందని సీఎం జగన్మోహన్‌రెడ్డి ఆరోపించారు. శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్కేంద్రం కోసం 796 అడుగుల ఎత్తు నుంచే నీటిని లాగేస్తోందని.. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో సమన్యాయం కోసం 800 అడుగుల ఎత్తులోనే పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ నుంచి నీటిని మళ్లించేలా రాయలసీమ దుర్భిక్ష నివారణ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామని తెలిపారు. మంగళవారం ఢిల్లీలో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం సందర్భంగా కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌కు ఆయన 12 పేజీల లేఖ రాశారు. గోదావరి, కృష్ణా నదీ జలాల విషయంలో రాష్ట్రానికి ఎదురవుతున్న ఇబ్బందులను అందులో వివరించారు. ‘ఒకవైపు శ్రీశైలంలో 800 అడుగుల ఎత్తు నుంచే నీటిని తోడేస్తూ.. ఆంధ్రప్రదేశ్‌ మాత్రం 881 అడుగులపైబడి ఎత్తు నుంచే నీటిని తోడుకోవాలని.. పోతిరెడ్డిపాడు నుంచి 854 అడుగుల ఎత్తులోనే నీటిని వాడుకోవాలనే హక్కూ, అధికారమూ తెలంగాణకు లేవు.


రాయలసీమలో దుర్భిక్ష ప్రాంతాలైన అనంతపురం, చిత్తూరు, కర్నూలు, కడపతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు 100 టీఎంసీల చొప్పున 600 టీఎంసీలు అవసరం. కానీ ఒక్కో జిల్లాకు 50 టీఎంసీలు కూడా అందడం లేదు.  తెలంగాణలోని మహబూబ్‌నగర్‌లో 142 టీఎంసీలు, నల్లగొండకు 104 టీఎంసీలు అందుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో పారిశ్రామిక అవసరాలూ తీరుతున్నాయి. రాయలసీమ ప్రాంతానికి తాగు, సాగు నీటి అవసరాలు తీరడం లేదు. రాష్ట్ర విభజన జరిగాక పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును 90 టీఎంసీల సామర్థ్యంతో రోజుకు 1.5 టీంఎంసీల చొప్పున శ్రీశైలంలో 800 అడుగుల ఎత్తు నుంచే తెలంగాణ తోడేస్తోంది. కల్వకుర్తిని 25 నుంచి 40 టీఎంసీలకు విస్తరించి శ్రీశైలంలో 800 అడుగుల ఎత్తు నుంచే తోడేస్తోంది. ఎస్‌ఎల్‌బీసీని 30 నుంచి 40 టీఎంసీలకు విస్తరించి రోజుకు 0.5 టీఎంసీల చొప్పున శ్రీశైలంలో 825 అడుగుల నుంచే తీసుకెళ్తోంది. మొత్తానికి రోజుకు 3 టీఎంసీల చొప్పున శ్రీశైలం నుంచి 200 టీఎంసీలను తెలంగాణ తోడేస్తోంది.


అంతేకాకుండా విద్యుత్‌ అవసరాల కోసం ఎవరి అనుమతులూ లేకుండానే శ్రీశైలంలో 796 అడుగుల ఎత్తు నుంచే రోజుకు 3 టీఎంసీలు వాడేస్తోంది. ఇప్పటికే నాగార్జున సాగర్‌పై పూర్తి ఆధిపత్యాన్ని తెలంగాణ ప్రదర్శిస్తోంది. ఫలితంగా సాగర్‌పై ఆధారపడ్డ రైతాంగానికి సకాలం సాగు నీరు, గ్రామాలకు మంచినీరు లభించడం లేదు. రాష్ట్ర విభజన తర్వాత కృష్ణా జలాలపై నియంత్రణ చేయాల్సిన బోర్డు తన అధికారాన్ని వినియోగించడం లేదు. గోదావరి నదిపై కాళేశ్వరం సహా పలు ప్రాజెక్టులను నిర్మిస్తూ కృష్ణా నదిలోకి పంపుతున్న తెలంగాణ.. పోలవరం ప్రాజెక్టు నుంచి ప్రకాశం బ్యారేజీ ద్వారా జలాలను వినియోగిస్తున్నందుకు 45 టీఎంసీల వాటాను కోరడంలో న్యాయమెంత ఉంది’ అని జగన్‌ నిలదీశారు. శ్రీశైలం జలాశయం మరమ్మతుల కోసం రూ.900 కోట్లు వ్యయమవుతుందని పాండ్యా కమిటీ నివేదిక ఇచ్చిందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో అంత మొత్తాన్ని భరించేందుకు సిద్ధంగా లేమని.. కేంద్ర జలశక్తి శాఖ ఆర్థికంగా తోడ్పాటు అందించాలని కోరారు. తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులన్నీ కొత్తవే అయినందున వాటి డీపీఆర్‌లను కోరాలని షెకావత్‌కు విజ్ఞప్తి చేశారు. నాగార్జున సాగర్‌, శ్రీశైలం వంటి ఉమ్మడి ప్రాజెక్టులను కేంద్రం తన అధీనంలోకి తీసుకోవాలని కోరారు.

Read more