ఏలూరు: బాధితులను పరామర్శిస్తున్న సీఎం జగన్
ABN , First Publish Date - 2020-12-07T16:42:00+05:30 IST
ఏలూరు నగరాన్ని అంతుపట్టని వ్యాధి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

పశ్చిమగోదావరి జిల్లా: ఏలూరు నగరాన్ని అంతుపట్టని వ్యాధి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మూడు రోజుల వ్యవధిలోనే 300 మందికి పైగా ఆస్పత్రిపాలయ్యారు. కొద్దిపాటి వాంతులు, మూర్ఛ, నోటి వెంట నురగతో గడిచిన 24 గంటలుగా రోగులు వరదలా వచ్చి చేరుతూనే ఉన్నారు. దీంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం ఉదయం ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని అస్వస్థతకు గురైన బాధితులను పరామర్శించారు.
వింత వ్యాధితో బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో అధికారులతో సీఎం జగన్ సమీక్ష జరుపుతున్నారు. వ్యాధి కారణాలు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు. మరోవైపు మంగళగిరి ఎయిమ్స్ వైద్యుల బృందం ఏలూరులో పర్యటిస్తోంది. వ్యాధి నిర్థారణకు 8 మంది సభ్యుల బృందం వచ్చింది. రోగుల నుంచి రక్త నమూనాలు సేకరించింది. అయితే బాధితుల్లో ఎక్కువ మంది ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవారేనని, వారికి ఎలాంటి ఇన్ఫెక్షన్ లేదని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. రక్త నమూనాలు సేకరించి ఢిల్లీ ఎయిమ్స్‌కు పంపించామని, రిపోర్టుల ఆధారంగా వ్యాధిని నిర్థారిస్తామని ఎయిమ్స్ వైద్యులు పేర్కొన్నారు.