5 పంచ్‌ పడింది!

ABN , First Publish Date - 2020-03-24T08:37:20+05:30 IST

తప్పు అని తెలిసీ ముందుకెళ్లడం, ఆ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుపట్టినా మొండిగా సుప్రీంకోర్టుకు వెళ్లడం... అక్కడ మొట్టికాయలు తినడం! హైకోర్టులోనూ వరుసగా

5 పంచ్‌ పడింది!

ఇవీ ‘పంచ్‌’లు

ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ పతాకంలోని రంగులు వేయడం కుదరదని హైకోర్టు ఇప్పటికే చెప్పింది. దీనిని సవాలు చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కూడా కొట్టివేసింది. 


రాజధాని కోసం రైతుల నుంచి సమీకరించిన భూమిలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడాన్ని హైకోర్టు నిలువరించింది.  ఇది చట్ట విరుద్ధమని, సర్కారుకు అధికారం లేదని స్పష్టం చేసింది.


విశాఖపట్నంలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం ఆరువేల ఎకరాలు సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో అమలును హైకోర్టు నిలిపివేసింది. రైతులకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే భూములు తీసుకుంటున్నారన్న వాదనలతో ఏకీభవించింది.


పాతిక లక్షల మందికి పంపిణీ చేసే ఇళ్ల స్థలాలను ఐదేళ్ల తర్వాత విక్రయించుకునే వీలు కల్పించే ‘కన్వేయన్స్‌ డీడ్‌’లపై ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు సస్పెండ్‌ చేసింది. ఇల్లు కట్టుకుంటామనే షరతు లేకుండా స్థలాలు ఇవ్వడమేమిటని ప్రశ్నించింది. 


ఐదో పంచ్‌ ... రాజకీయంగా తగిలిన ఎదురుదెబ్బ. శాసన మండలి రద్దు సంగతి కనీస ప్రస్తావనకు రాకుండానే పార్లమెంటు సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి.


‘నా రాజ్యం... నా ఇష్టం’ అని యథేచ్ఛగా నిర్ణయాలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. సోమవారం ఒక్కరోజే  ‘పాంచ్‌-పంచ్‌’లు పడ్డాయి. ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు, రాజధాని భూములు, ఇళ్ల స్థలాల కోసం విశాఖలో భారీగా అసైన్డ్‌ భూముల సేకరణ, పేదలకు ఇచ్చే స్థలాల పట్టాల తీరులో మార్పు నిర్ణయాలను సుప్రీంకోర్టు, హైకోర్టులు నిలిపి వేశాయి. ఇక... పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడటంతో... మెరుపు వేగంతో శాసన మండలిని రద్దు చేయాలన్న ఆకాంక్ష కూడా నెరవేరలేదు.


ఒకేరోజు ఐదు ఎదురు దెబ్బలు

దూకుడుగా సీఎం జగన్‌ నిర్ణయాలు

తందాన అంటూ అధికారుల జీవోలు

తిప్పలకు ఇదే కారణమని విశ్లేషణ

వైసీపీ రంగులపై సుప్రీం అక్షింతలు

రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాలు

కుదరదని హైకోర్టు స్పష్టీకరణ

శాసనమండలి రద్దు ఆశలు గల్లంతు

పార్లమెంటు నిరవధిక వాయిదా


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

తప్పు అని తెలిసీ ముందుకెళ్లడం, ఆ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుపట్టినా మొండిగా సుప్రీంకోర్టుకు వెళ్లడం... అక్కడ మొట్టికాయలు తినడం! హైకోర్టులోనూ వరుసగా ఎదురు దెబ్బలు! సోమవారం ఏకంగా నాలుగు అంశాలపై న్యాయస్థానాలు తప్పుపట్టడంపై తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఎదురుదెబ్బల్లో ముఖ్యమంత్రికి సన్నిహితంగా పనిచేసే సీనియర్‌ అధికారులకూ బాధ్యత ఉన్నట్లే! ‘నేను చెప్పింది జరగాల్సిందే’ అని సీఎం జగన్‌ పేర్కొంటుండగా... ‘మీ మాటే శాసనం’ అంటూ అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా, ముందూ వెనుకా చూడకుండా ఆదేశాలు ఇచ్చేస్తున్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి తనకున్న భావోద్వేగాలు, రాజకీయ అవసరాలు, సొంత ఆలోచనల మేరకు ప్రకటనలు చేయడం సహజం. కానీ... వాటిపై ఉత్తర్వులిచ్చి అమల్లోకి తీసుకొచ్చే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సింది అధికారులే. కీలక స్థానాల్లో ఉన్న కొందరు అధికారులు... తాన అంటే తందానా అన్నట్లుగా తయారుకావడంవల్లే ఈ దుస్థితి వచ్చిందనే అభిప్రాయం నెలకొంది. ఉదాహరణకు... గ్రామ, వార్డు సచివాలయాలకు అచ్చంగా వైసీపీ జెండాలోని రంగులను వేయాలని జగన్‌ నిర్ణయించగానే, సంబంధిత అధికారులు ఎంచక్కా ‘నమూనా’ చిత్రంతో కూడిన జీవో జారీ చేసేశారు. ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు పులమడం నిబంధనలకు విరుద్ధమని, ఎవరు కోర్టుకు వెళ్లినా ఎదురుదెబ్బ తప్పదని తెలిసినా పట్టించుకోలేదు. హైకోర్టు గట్టిగా అక్షింతలు వేసిన తర్వాతైనా తప్పుదిద్దుకోకుండా... సుప్రీంకోర్టుకు వెళ్లారు. చివరికి, అక్కడా ఎదురుదెబ్బ తగిలింది. దీంతో... అధికారులు జగన్‌కు సలహాలు ఇచ్చేందుకు సాహసించడం లేదా? ఒకవేళ, చెప్పినా ఆయన పట్టించుకోవడంలేదా? అనే చర్చ జరుగుతోంది.


పొరుగున ఇలా... 

‘‘తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గంభీరమైన ప్రకటనలు చేస్తుంటారు. సంచలన నిర్ణయాలూ వెలువరిస్తుంటారు. అయితే, వాటిని అమల్లోకి తీసుకొచ్చేటప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సంబంధిత విభాగాల కార్యదర్శులు పరిశీలించి నిబంధనల ప్రకారమే ఉత్తర్వులిస్తున్నారు. అందువల్ల, ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బలు తగలడంలేదు’’ అని ఒక అధికారి విశ్లేషించారు. సీఎం ప్రకటనలపై లిఖిత పూర్వక ఉత్తర్వులివ్వాల్సింది ప్రధాన కార్యదర్శి, సంబంధిత కార్యదర్శులే. భవిష్యత్తులో ఏదైనా తేడా వస్తే బాధ్యత వహించాల్సింది వీరే. ‘‘ఆ బాధ్యతతో అధికారులు తమ పని తాము చేయాలి. అప్పటికీ సీఎం వినకుంటే... నోట్‌ఫైల్‌ మీదతమ అభిప్రాయం రాయాలి.లేకుంటే చిక్కులు, కోర్టుల్లో చీవాట్లు తప్పవు’’అని ఓఅధికారి వెల్లడించారు.


మండలి రద్దుకోసం....

తెలుగు మీడియం రద్దు, ఎస్సీ-ఎస్టీలకు వేర్వేరు కమిషన్లు, ఆ తర్వాత... మూడు రాజధానుల బిల్లు! ఇలా తమ నిర్ణయాలను అడ్డుకుంటోందంటూ... శాసన మండలినే రద్దు చేయాలని సర్కారు భావించింది. హుటాహుటిన అసెంబ్లీలో తీర్మానం చేసి... కేంద్రానికి పంపించారు. వీలైనంత త్వరగా దీనిపై పార్లమెంటు ఆమోద ముద్ర పొంది... మండలిని అటకెక్కించాలనుకున్నారు. కానీ... పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లో దీనిపై కనీస ప్రస్తావన కూడా రాలేదు. కరోనా విజృంభణ నేపథ్యంలో సోమవారం లోక్‌సభ నిరవధిక వాయిదా పడింది. మళ్లీ... వర్షాకాల సమావేశాల్లో ఏం జరుగుతుందో చెప్పలేం. వెరసి... మండలిని అటకెక్కించాలన్న సీఎం జగన్‌ పట్టుదల ఇప్పట్లో నెరవేరేలా కనిపించడంలేదు.

Read more