నిధులపై పక్కా ప్రణాళిక

ABN , First Publish Date - 2020-07-10T08:43:01+05:30 IST

రాష్ట్రంలో ‘నాడు-నేడు’ సహా ప్రాధాన్య ప్రాజెక్టులకు అవసరమైన రూ.1,57,802 కోట్ల నిధుల సమీకరణకు కార్యాచరణను సిద్ధం చేయాలని అధికారులను

నిధులపై పక్కా ప్రణాళిక

  • నాడు-నేడు సహా ప్రాజెక్టుల పూర్తికి రూ. 1,57,802 కోట్లు సేకరించాలి: సీఎం జగన్‌

అమరావతి, జూలై 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ‘నాడు-నేడు’ సహా ప్రాధాన్య ప్రాజెక్టులకు అవసరమైన రూ.1,57,802 కోట్ల నిధుల సమీకరణకు కార్యాచరణను సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. ‘నాడు-నేడు’ కింద  ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న ప్రాజెక్టులు, కార్యక్రమాలకు సంబంధించి, ఎట్టి పరిస్థితుల్లోనూ నిధులకు ఆటంకం కలిగేందుకు వీల్లేదని అధికారులకు స్పష్టం చేశారు. దీనిని ‘అత్యంత ప్రాధాన్యం’ గల కార్యక్రమంగా ఆయన అభివర్ణించారు. రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలకు నిధుల సమీకరణ తీరుతెన్నులపై గురువారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.  విద్యారంగం, సాగునీటి ప్రాజెక్టులు, వాటర్‌గ్రిడ్‌,  మౌలిక సదుపాయాలకల్పన ప్రాజెక్టులకు నిధుల అనుసంధానంపై ప్రధానంగా శాఖాధిపతులతో సమీక్షించారు.


‘‘విద్యా రంగంలో ‘నాడు-నేడు’ పనులపై మనం కన్నకలలు నిజం కావాలి. ఏడాదిన్నరలోగా అనుకున్న  పనులన్నీ పూర్తికావాలి. అలాగే అస్పత్రుల్లోనూ, మెడికల్‌ కాలేజీ ల్లోనూ ‘నాడు-నేడు’, కొత్త వాటి నిర్మాణం అతి ముఖ్యం. అక్టోబరు 1న రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టు పనులు ప్రారంభించాలి. స్టేట్‌వాటర్‌ సెక్యూరిటీ డెవల్‌పమెంట్‌లోభాగంగా పోలవరం నుంచి అదనంగా జలాలను తరలించాలి. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పల్నాడులో కరువు నివారణ, తాగు నీటి వసతి కల్పన, కృష్ణా-కొల్లేరు ప్రాంతం ఉప్పునీటిమయం కాకుండా చేపట్టాల్సిన నివారణచర్యలు ముందుకు సాగాలి’’ అని సీఎం జగన్‌ ఆదేశించారు. ప్రస్తుతం కొనసాగుతున్న, కొత్తగా చేపట్టనున్న సాగునీటి ప్రాజెక్టులకోసం దాదాపు రూ.98,000 కోట్లు అవసరమని ముఖ్యమంత్రికి జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌, ఈఎన్‌సీ నారాయణరెడ్డి వివరించారు. వీటిలో రూ.72,000 కోట్లు  కొత్తప్రాజెక్టుల కోసం వ్యయం చేయాల్సిఉంటుందన్నారు.


రాయలసీమ కరువు నివారణ కోసం ఉద్దేశించిన పనులకోసం ఖర్చు చేసే నిధుల కోసం ఆర్థిక సంస్థలు, బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతున్నామని, త్వరలోనే ఫైనాన్షియల్‌ క్లోజర్‌ పూర్తవుతుందని అధికారులు వివరించారు. ఈ పనులు అక్టోబరు ఒకటోతేదీ నుంచి ప్రారంభం కావాలని జగన్‌ ఆదేశించారు. మొదటి విడత ‘నాడు-నేడు’ పనులు ఆగస్టు 15కల్లా ఇచ్చేందుకు ప్రణాళికలు వేసుకోవాలన్నారు. పాఠశాలలు సహా హాస్టళ్లూ, జూనియర్‌, డిగ్రీకాలేజీల్లోనూ రెండు, మూడోవిడత ‘నాడు-నేడు’ కోసం రూ.7,700 కోట్లు ఖర్చు అవుతాయని అంచనాలు వేశామని అధికారులు వివరించారు. ఈ నిధుల విషయంలో ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని, వచ్చే ఏడాదిన్నరలో అన్ని స్కూళ్లలోనూ ‘నాడు-నేడు’ కార్యక్రమాలు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నామని సీఎం తెలిపారు. కొత్తగా 16 మెడికల్‌ కాలేజీలు, ఒక సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి, కేన్సర్‌ ఆస్పత్రి, మానసిక చికిత్సాలయం కోసం రూ.6,657 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశామని అధికారులు వివరించారు. పంచాయతీరాజ్‌ విభాగంలో కొనసాగుతున్న రోడ్ల నిర్మాణ పనులపైనా జగన్‌ సమీక్షించారు.


అక్టోబరులో గ్రిడ్‌ పనులు..

వాటర్‌గ్రిడ్‌ పనులపై సీఎం సమీక్షించారు. తొలిదశలో శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం, ఉభయ గోదావరి జిల్లాలు, గుంటూరులోని పల్నాడు, ప్రకాశంలోని కనిగిరి, చిత్తూరుజిల్లా పశ్చిమ ప్రాంతం, కడపజిల్లాల్లో వాటర్‌గ్రిడ్‌ కోసం రూ.19,088 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. ఈ నిధుల సమీకరణపై టైఅప్‌ జరిగిందని, వీటితో పాటు కర్నూలుజిల్లా పశ్చిమ ప్రాంతంలోని ఏడు నియోజకవర్గాలతోపాటు డోన్‌ నియోజకవర్గంలోనూ ఈ ప్రాజెక్టును చేపట్టాలని సీఎం ఆదేశించారు. డీపీఆర్‌లు సిద్ధం చేసి టెండర్లను పిలవాలన్నారు. 

Updated Date - 2020-07-10T08:43:01+05:30 IST