‘చేయూత’కు బ్రాండింగ్
ABN , First Publish Date - 2020-10-08T07:31:19+05:30 IST
వైఎ్‌సఆర్ చేయూత పథకానికి బ్రాండింగ్ తీసుకురావాలని సీఎం జగన్ అన్నారు. బుధవారం ఆయన చేయూత, ఆసరా పథకాలపై సమీక్ష నిర్వహించారు. మహిళలకు....

అవినీతికి తావుండకూడదు: సీఎం జగన్
అమరావతి, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): వైఎ్‌సఆర్ చేయూత పథకానికి బ్రాండింగ్ తీసుకురావాలని సీఎం జగన్ అన్నారు. బుధవారం ఆయన చేయూత, ఆసరా పథకాలపై సమీక్ష నిర్వహించారు. మహిళలకు ఉపాధి కల్పనపై పెద్ద కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని, ఎక్కడా లోపాలు లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. కిరాణా షాపుల నిర్వాహకులకు సమస్య వచ్చినా, ఎవరైనా లంచం అడిగినా వెంటనే ఫోన్ చేసేందుకు వారికి ఒక నంబరు ఇవ్వాలని చెప్పారు. దాన్ని దుకాణాల వద్ద ప్రదర్శించాలన్నారు. వ్యవస్థలో ఎక్కడా అవినీతికి తావులేకుండా చూడాలని, లేకపోతే విశ్వాసం కోల్పోతామన్నారు. చేయూత పథకంలో లబ్ధిదారులకు ఇచ్చే ఆవులు, గేదెల కొనుగోలులో నిపుణుల అభిప్రాయం తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం తరఫున పశువైద్యుడి ద్వారా వాటి నాణ్యతపై వారికి భరోసా కల్పించాలన్నారు. ఆర్బీకేల ద్వారా పశుగ్రాసం కూడా పంపిణీ చేయాలని, పశువుల సేకరణ, దాణా, మందుల పంపిణీ ప్రక్రియలో అమూల్ సంస్థ కూడా పాలుపంచుకోవాలని సీఎం పేర్కొన్నారు. ఈ సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, ప్రత్యేక ప్రధానకార్యదర్శి పూనం మాలకొండయ్య, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.