రచ్చకెక్కుతున్న వైసీపీ నేతల మధ్య విభేదాలు

ABN , First Publish Date - 2020-11-15T17:01:18+05:30 IST

వైసీపీలో అంతర్గత విభేదాలు రచ్చకెక్కుతున్నాయి.

రచ్చకెక్కుతున్న వైసీపీ నేతల మధ్య విభేదాలు

అనంతపురం: వైసీపీలో అంతర్గత విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. పార్టీలో ఉంటున్న నేతలకు.. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతల మధ్య పొసగడంలేదు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, రామసుబ్బారెడ్డి వర్గాలు పరస్పరం దాడులకు దిగడం.. ఈ ఘటనలో రామసుబ్బారెడ్డి అనుచరుడు ప్రాణాలు కోల్పోవడం కలకలంరేపింది. అయితే ఇతర పార్టీ నేతలే కాదు.. సొంతపార్టీ నేతలపై వైసీపీ స్థానిక నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ వెంట నడిచిన నాయకులపై దాడులు జరుగుతున్నాయని అనంతపురం జిల్లా వైసీపీ నేత నాగభూషణం రెడ్డి అన్నారు. అంతే కాదు మంత్రి శంకర్ నారాయణపై ఆగ్రహం వ్యక్తం చేశారు.   


మంత్రి శంకర్ నారాయణ స్థానిక నేతలను పట్టించుకోకుండా కొందరికే ప్రాధాన్యం ఇస్తున్నారని నాగభూషణం రెడ్డి మండిపడ్డారు. తమ ఆర్థిక మూలాలను దెబ్బతీసే విధంగా అధికారులను ఉసిగొల్పుతున్నారని ఆయన భగ్గుమన్నారు. తమపై ప్రత్యమ్నాయ దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. గోరంట్ల మండలం, తమ్మినాయనపల్లిలో ఉన్న ఐదెకరాల భూమిని మంత్రి వివాదాస్పదం చేస్తున్నారని నాగభూషణం రెడ్డి అన్నారు. అది పట్టా భూమికాదని,  ప్రభుత్వ భూమి అని చెబుతూ ఆ భూమిలో నాటిన మొక్కలను రెవెన్యూ అధికారులతో పీకించారని ఆరోపించారు. మంత్రి తమపై దాడులు చేయించడం తగదని అన్నారు. అయితే రెవెన్యూ అధికారులు తాహసీల్దార్ ఆదేశాల మేరకే మొక్కలను తొలగిస్తున్నట్లు చెబుతున్నారు.

Updated Date - 2020-11-15T17:01:18+05:30 IST