కరోనా కేసులు నిరాకరిస్తే ఆస్పత్రుల అనుమతి రద్దు

ABN , First Publish Date - 2020-07-15T09:29:18+05:30 IST

కొవిడ్‌-19 కేసులను నిరాకరిస్తే ఆస్పత్రుల అనుమతులు రద్దు చేసేందుకు వెనుకాడవద్దని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ...

కరోనా కేసులు నిరాకరిస్తే ఆస్పత్రుల అనుమతి రద్దు

మృతుల అంత్యక్రియలకు రూ.15,000

పరీక్షలకు శాశ్వత కేంద్రాలు.. కట్టడి ప్రాంతాల్లో ప్రత్యేకంగా..

క్వారంటైన్ల వద్ద కాల్‌సెంటర్‌ నంబర్లు.. సీఎం జగన్‌ ఆదేశాలు


అమరావతి, జూలై 14 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌-19 కేసులను నిరాకరిస్తే ఆస్పత్రుల అనుమతులు రద్దు చేసేందుకు వెనుకాడవద్దని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కరోనాతో మృతిచెందిన వ్యక్తి అంత్యక్రియల కోసం కుటుంబసభ్యులకు రూ.15000 అందజేయాలని సూచించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంగళవారం కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ చర్యలపై సీఎం జగన్‌ సమీక్షను నిర్వహించారు. డిప్యూటీ సీఎం ఆళ్ల కృష్ణకాళీ శ్రీనివాస్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. కొవిడ్‌-19 వైద్య సహాయ కార్యక్రమాల విషయంలో చాలా అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు. రోగుల పట్ల వివక్ష చూసే ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. కొవిడ్‌ వ్యాప్తి నివారణలో భాగంగా భవిష్యత్‌ అవసరాల కోసం వైద్య సిబ్బందిని సన్నద్ధం చేయాలని సూచించారు. కనీసం 17000 మంది వైద్యులు, 12000 మంది నర్సుల సేవలు పొందేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని అధికారులు సీఎంకు వివరించారు. కరోనాతో మృతి చెందినవారి అంత్యక్రియల కోసం రూ.15000 వారి కుటుంబ సభ్యులకు అందజేసేలా వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని సీఎం అధికారులకు సూచించారు.

క్వారంటైన్‌ సెంటర్లలో ముఖ్యంగా పారిశుఽధ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. రోగులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. క్వారంటైన్‌ సెంటర్ల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు ఆయా కేంద్రాల వద్ద కాల్‌ సెంటర్‌ నంబర్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. భవిస్యత్తును అంచనా వేసి క్వారంటైన్‌ సెంటర్లలో మరిన్ని సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. కరోనా పరీక్షల నిర్వహణకు శాశ్వత కేంద్రాలు ఉండాలని సూచించారు. వాటి వివరాలు ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. కట్టడి ప్రాంతాల్లో కాంటాక్ట్‌ ట్రేసింగ్‌కు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని, వాటిలో కరోనా పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. టెస్టుల్లో నెగిటివ్‌ వచ్చినా సరే.. ఎక్స్‌రేలో ఏదైనా తేడాగా అనిపిస్తే పాజిటివ్‌గా పరిగణించి వైద్యం అందించాలన్నారు. కరోనా పాజిటివ్‌గా తేలినప్పటికీ ఆస్పత్రులకు ఆలస్యంగా తీసుకురావడం వల్ల మరణాలు సంభవిస్తున్నాయని.. వాటిని నివారించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

Updated Date - 2020-07-15T09:29:18+05:30 IST