వైసీపీ నేతలు కండకావరంతో వ్యవహరిస్తున్నారు: చంద్రబాబు

ABN , First Publish Date - 2020-03-14T00:13:44+05:30 IST

వైసీపీ నేతలు కండకావరంతో వ్యవహరిస్తున్నారని టీడీపీ అధినేత ధ్వజమెత్తారు. మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల చివరి రోజు కూడా.. వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు.

వైసీపీ నేతలు కండకావరంతో వ్యవహరిస్తున్నారు: చంద్రబాబు

అమరావతి: వైసీపీ నేతలు కండకావరంతో వ్యవహరిస్తున్నారని టీడీపీ అధినేత ధ్వజమెత్తారు. మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల చివరి రోజు కూడా.. వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. ప్రత్యర్థుల ఇళ్లలో వైసీపీ నేతలు మద్యం పెడుతున్నారని, ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా వేధించాలని చూస్తున్నారని మండిపడ్డారు. మద్యం పెడుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్‌ అయ్యాయని తెలిపారు. ఎవరో చెప్పినట్లు ఎక్సైజ్‌ పోలీసులు నేరుగా వాటర్‌ ట్యాంక్‌ వద్దకు ఎలా వెళ్లారు? అని చంద్రబాబు ప్రశ్నించారు. వైసీపీ వాళ్లకు భయపడి సీసీకెమెరాలు పెట్టుకునే పరిస్థితి వచ్చిందని, ఆలపాటి రాజాను పోలీస్‌స్టేషన్‌లో ఉంచారని చంద్రబాబు తెలిపారు. 


టీడీపీ నేతల ఇళ్లలో మద్యం సీసాలు పెట్టి ఎన్నికల్లో పోటీ చేయకుండా చేస్తున్నారని, తెలంగాణ నుంచి లిక్కర్‌ తెప్పించుకుని వైసీపీ నేతలు పంపిణీ చేస్తున్నారని బాబు ఆరోపించారు. రాజకీయం కోసం ఎంతటి అరాచకానికైనా తెగిస్తారని, ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని ఆయన దుయ్యబట్టారు. నామినేషన్‌ వేసేందుకు వెళ్లిన దళిత మహిళను కొట్టారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు మీరిచ్చే గౌరవం ఇదేనా అని చంద్రబాబు నిలదీశారు. రేపు గోడ దూకి వెళ్లి మనుషుల్ని చంపుతారని, మానభంగాలు చేస్తారని బాబు ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు ఆంబోతుల్లా వ్యవహరిస్తున్నారని, ఎన్నికలు నిర్వహించే తీరు ఇదేనా? అని మరోసారి ప్రశ్నించారు. ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పదవుల కోసం రాష్ట్రాన్ని తగులబెడతారా? అని చంద్రబాబు ప్రశ్నించారు.

Updated Date - 2020-03-14T00:13:44+05:30 IST