తాడోపేడో తేల్చుకోవాలి

ABN , First Publish Date - 2020-03-08T09:26:50+05:30 IST

స్థానిక ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకోవాలని, వైసీపీ అహంకారం దిగేలా ప్రజలు ఝలక్‌ ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర బాబు పిలుపునిచ్చారు.

తాడోపేడో తేల్చుకోవాలి

వైసీపీ అహంకారం దిగేలా ఝలక్‌ ఇవ్వాలి

5 కోట్ల మందీ ముందుకు రండి.. అండగా ఉంటాం

బీసీల ద్రోహి జగన్‌.. 16,500 మందికి నష్టం

34ు కాదు.. ఆఖరికి ఆ 24 శాతమూ ఇవ్వలేదు

నెల్లూరులో 10.49 శాతమే... జిల్లాల్లోనూ అంతే

ఇంత హడావుడి నోటిఫికేషన్‌ ఎన్నడూ చూడలేదు

టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్‌లో చంద్రబాబు 

పార్టీ ఆఫీసులో కంట్రోల్‌ రూము, టోల్‌ఫ్రీ నంబర్‌


అమరావతి, మార్చి 7(ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకోవాలని, వైసీపీ అహంకారం దిగేలా ప్రజలు ఝలక్‌ ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర బాబు పిలుపునిచ్చారు. వైసీపీ అరాచకాలకు అడ్డుకట్ట వేయాలంటే ఈ ఎన్నికల్లో ఓటే ఆయుధమని అన్నారు. ఇది ప్రజాపోరాటమని, ఐదు కోట్ల మందీ ముందుకు రావాలని సూచించారు. తాము అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఎన్నికలకు సన్నద్ధతపై శనివారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఆ రోజు ఒక్క చాన్స్‌ అంటే ఓటేశారు. ఏం జరిగిందో ప్రజలు చూశారు. వైసీపీకి పట్టరాని గర్వం వచ్చింది. ఇప్పుడు ఏం చూసి ఓటెయ్యాలి? 10నెలల పాలనలో అభివృద్ధి కోసం ఒక్క రూపాయీ ఖర్చుచేయలేదు. ఇసుక ధర నాలుగురెట్లు పెంచి కార్మికుల పొట్టకొట్టారు. ఏం చేసినా అడ్డుకునేవారు లేరన్న దోరణితో వెళ్తున్నారు. ఈ స్థానిక ఎన్నికల్లో ఓటుతో దానికి చెక్‌ చెప్పాలి’ అని ప్రజలకు సూచించారు. ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీ చేస్తే మూడేళ్ల జైలు, ఎన్నికల్లో పోటీచేయకుండా అనర్హత విధించే నిబంధనలు తేవడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష అభ్యర్థులను ఇబ్బందిపెట్టేందుకే ఇలాంటివి చేస్తున్నారని, వీటిని చూస్తూ ఊరుకోబోమని, తాడో పేడో తేల్చుకుంటామన్నారు. తాము కూడా పార్టీ కేంద్ర కార్యాలయంలో ఒక కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను ప్రారంభిస్తున్నామంటూ దాని నంబరు 7995014525 అని ప్రకటించారు. అన్ని రకాలుగా అండగా ఉంటామన్నారు. అన్ని స్థానాల్లోనూ టీడీపీ తరఫున పోటీచేయాలని, ఎక్కడన్నా అభ్యర్థులను బెదిరిస్తే ప్రత్యామ్నాయం చూసుకుని ముందుకెళ్లాలి తప్ప అధైర్యపడొద్దని స్థానిక నేతలకు మార్గనిర్దేశనం చేశారు. 


సుప్రీంకు వెళ్లలేదేమీ?

జగన్‌ బీసీల ద్రోహి అని, వారికి రిజర్వేషన్లు తగ్గించడం వల్ల 16,500 మంది బీసీలకు పదవులు రాకుండా చేశారని చంద్రబాబు విమర్శించారు. బీసీల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు ఎందుకెళ్లలేదని ప్రశ్నించారు. బీసీలకు ఇప్పటి వరకూ ఉన్న 34శాతం కూడా ఇవ్వడం లేదని, చివరకు 24శాతమే అన్నారన్నారు. అయితే ఆమాత్రం కూడా ఇవ్వడం లేదని, నెల్లూరు జిల్లాలో ఎంపీటీసీల్లో కేవలం 10.49శాతం మాత్రమే బీసీ రిజర్వేషన్లు ఇచ్చారన్నారు. ఆ జిల్లాలో 16మండలాల్లో ఒక్క ఎంపీటీసీ కూడా బీసీకి రిజర్వు చేయలేదన్నారు. ఈ జిల్లాలో 46ఎంపీపీల్లో కేవలం ఆరుమాత్రమే బీసీలకు వస్తున్నాయని, రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉందన్నారు. ఎన్నికలకు ఇంతటి అయోమయ షెడ్యూలు ఎప్పుడూ చూడలేదని చంద్రబాబు అన్నారు. కుప్పం నియోజకవర్గంలో రామకుప్పం రిజర్వేషన్‌ను తొలుత ఎస్టీ అన్నారని, ఆ తర్వాత అన్‌రిజర్వుడు అన్నారని పేర్కొన్నారు. కనీసం బ్యాలెట్‌ బాక్సులు సిద్ధం చేసుకునేందుకూ సమయం లేదని, మరోవైపు మెజార్టీ స్థానాలు ఏకగ్రీవం అవుతాయని ఎన్నికల కమిషనర్‌ అంటున్నారని, అంటే గ్రామాల్లో ప్రజాస్వామ్యం అక్కర్లేదని భావిస్తున్నారా అని చంద్రబాబు ప్రశ్నించారు. 


యాప్‌కు, జగన్‌కు ఏం సంబంధం? 

‘డబ్బు, మద్యం పంపిణీ జరగకుండా ఉండేందుకంటూసీఎం నిఘా యాప్‌ను ప్రారంభించారు. ఆ పనిచేసేందుకు ఆయనెవరు? ఎన్నికల వేళ ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఎన్నికల కమిషన్‌ చేతిలో ఉంటుంది. సీఎంకి ఏం సంబంధం? ఈయనేమన్నా సూపర్‌ ఎన్నికల కమిషనరా?’ అని చంద్రబాబు ప్రశ్నించారు. సీఎంకి బుద్ధిలేదు... అధికారులైనా చెప్పాలి కదా! అన్నారు. ఎన్నికలప్పుడు  ముఖ్యమంత్రీ ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడే అవుతారని చంద్రబాబు అన్నారు. అంత చిత్తశుద్ధి ఉంటే ఎన్నికలు అయ్యే వరకూ మద్యాన్ని నిషేధించాలన్నారు. 

Updated Date - 2020-03-08T09:26:50+05:30 IST