కరోనా సమయంలోనూ.. కక్ష సాధింపేనా?

ABN , First Publish Date - 2020-04-14T09:20:31+05:30 IST

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న సమయంలోనూ వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపులకే ప్రాధాన్యమిస్తోందని తెలుగుదేశం పార్టీ విమర్శించింది.

కరోనా సమయంలోనూ.. కక్ష సాధింపేనా?

రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఖండించిన టీడీపీ

పార్టీ నేతలతో చంద్రబాబు వీడియోకాన్ఫరెన్స్‌

క్వారంటైన్‌ నిబంధన కాంట్రాక్టర్లకు వర్తించదా?

రాష్ట్రంలో ‘కరోనా’ను తక్కువగా చూపే యత్నం 

ప్రధానికి వీడియో కాన్ఫరెన్స్‌లోనూ తప్పులు చెప్పారు

రాజధానిలో వైరస్‌ విజృంభణ ప్రభుత్వ వైఫల్యమే

నిత్యావసరాల ధరలను అదుపు చేయాలి

ముస్లింలపై వైసీపీ నేతల వ్యాఖ్యలు హేయం

అంబేడ్కర్‌ జయంతిని ఇళ్లలో జరపాలి

పార్టీ నేతలకు చంద్రబాబు పిలుపు


అమరావతి, ఏప్రిల్‌ 13(ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న సమయంలోనూ వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపులకే ప్రాధాన్యమిస్తోందని తెలుగుదేశం పార్టీ విమర్శించింది. ప్రజల ప్రాణాలు కాపాడటం కంటే, తన రాజకీయ అవసరాలు, లాభాలే ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి ముఖ్యంగా మారాయని ఆరోపించింది. పార్టీ అధినేత చంద్రబాబు సోమవారం టీడీపీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అందులో అనేక వర్తమాన అంశాలు చర్చకు వచ్చాయి. ‘స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి ఎస్‌ఈసీ రమే్‌షకుమార్‌ ప్రజల ప్రాణాలను కాపాడారు. అటువంటి వ్యక్తిని ఆ పదవి నుంచి అప్రజాస్వామికంగా తొలగించారు. ప్రజల ప్రాణాల కన్నా తన అహం కాపాడుకోవడమే ముఖ్యంగా సీఎం భావిస్తున్నారు. మాస్కులు అడిగినందుకు వైద్యుడిని, నిధులు లేవని చెప్పినందుకు మునిసిపల్‌ కమిషనర్‌ను సస్పెండ్‌ చేశారు. సమస్యలు చెప్పినవారిపై కక్ష సాధింపునకు దిగుతున్నారు. కరోనాపై పోరాడుతూ ముందు వరుసలో నిలిచిన వైద్యులు, వైద్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ పరికరాలు ఇవ్వలేకపోవడం దారుణం’ అని టీడీపీ నేతలు విమర్శించారు. గత పది రోజుల్లో వైరస్‌ వ్యాప్తి కర్నూలులో 8300 శాతంపెరిగిందని, దాన్ని తక్కువ చేసి చూపించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.


దేశమంతా రెడ్‌ జోన్లను జిల్లాల వారీగా చూపిస్తుంటే, ఏపీలో మాత్రం మండలాల వారీగా చూపిస్తూ సమస్యను తక్కువ చేసి చూపించేందుకు ప్రయత్నిస్తున్నారని, ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌లోనూ సీఎం అదే ప్రయత్నం చేశారని విమర్శించారు. విజయవాడలో కరోనా మరణాలను దాచిపెట్టడం వల్లే, తర్వాత దాని ఉధృతి పెరిగిందని, రాజధాని ప్రాంతంలో ఉన్న గుంటూరులోనూ వైరస్‌ వ్యాప్తికి ప్రభుత్వ వైఫల్యం కారణమని విమర్శించారు. క్వారంటైన్‌ ఒక ఫార్సుగా మారిందని, తమకు నచ్చిన వారిని స్వేచ్ఛగా తిరగనిస్తూ మిగిలిన వారిని ఇబ్బంది పెడుతున్నారన్నారు. సామాన్య ప్రజలు, వలస కార్మికులను రాష్ట్ర సరిహద్దుల వద్ద ఆపి, అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని, కొత్త ఎన్నికల కమిషనర్‌ కనగరాజ్‌ చెన్నై నుంచి, కంట్రాక్టర్లు హైదరాబాద్‌ నుంచి రావడానికి లేని అభ్యంతరం సామాన్యులకు ఎందుకని వారు ప్రశ్నించారు. 


ఐదుగురికి అన్నం పెట్టాలంటే ఉన్నవి మూసేశారు 

ప్రతి కుటుంబం తమతోపాటు ఐదుగురికి అన్నం పెట్టాలని ప్రధాని మోదీ పిలుపునిస్తే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అన్న క్యాంటీన్లు మూసివేసి పేదల నోటికాడ భోజనాన్ని పోగొట్టిందని టీడీపీ నేతలు విమర్శించారు. పేదలకు రూ.5 వేలు సాయం చేయాలని తన నివాసంలో దీక్ష చేపట్టిన టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు, ఆయన సతీమణి అనురాధలను చంద్రబాబు అభినందించారు. రాజధాని రైతులు, మహిళలపై అక్రమ కేసులను నిరసిస్తూ దీక్ష చేపట్టిన నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను కూడా ప్రశంసించారు. అన్ని జిల్లాల్లోనూ పేదలు, కార్మికులు, రైతులకు సంఘీభావంగా పార్టీ నేతలు నిలవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. 


ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిని బర్తరఫ్‌ చేయాలి

ముస్లింలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిని బర్తరఫ్‌ చేయాలని సమావేశం డిమాండ్‌ చేసింది. ప్లేట్లు, స్పూన్లు నాకడం వల్లే కరోనా వ్యాపిస్తోందంటూ సంబంధం లేని ఘటనను వారికి పూశారని నేతలు విమర్శించారు. మర్కజ్‌ వల్లే ఏపీలో కరోనా వ్యాపించిందని సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధానికి ఫిర్యాదు చేశారని ఖండించింది. 2-3 ఎకరాల భూమి ఉందనే నెపంతో తెల్లకార్డుదారులకు వెయ్యి సాయం, రేషన్‌ సరుకులు ఇవ్వకుండా ఎగ్గొట్టడం శోచనీయమని పేర్కొంది. ఇటీవల తొలగించిన 18 లక్షల మంది కార్డుదారులకు కూడా ఈ సాయం అందించాలని కోరింది. నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడంతోపాటు బ్లాక్‌ మార్కెటింగ్‌కు అడ్డుకట్ట వేయాలని విజ్ఞప్తి చేసింది. లాక్‌డౌన్‌లోనూ అనేక జిల్లాల్లో అధికార పార్టీ నేతలు వందల ట్రాక్టర్లు, లారీల్లో అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నా, ఆ ట్రాక్టర్లను స్వాధీనం చేసుకోకుండా, సోడియం హైపో క్లోరైడ్‌ ద్రావణం పిచికారి చేసే ట్రాక్టర్లను స్వాధీనం చేసుకోవడం హేయమని పేర్కొన్నారు.


మంగళవారం అంబేడ్కర్‌ జయంతిని ఇళ్లలోనే ఘనంగా జరపాలని, చిత్రపటాలకు దండలు వేసి నివాళులర్పించాలని చంద్రబాబు సూచించారు. వైసీపీ దళిత వ్యతిరేక చర్యలను నిరసించాలని, దళితుల ఎసైన్‌మెంట్‌ భూములను లాక్కోవడం... దళిత వైద్యుడిని సస్పెండ్‌ చేయడం... ఎస్సీ నిధులు దారి మళ్లించి స్వాహా చేయడంపై గళమెత్తాలని కోరారు. సమావేశంలో ఎంపీ కేశినేని నాని, టీడీఎల్పీ ఉప నేతలు అచ్చెన్నాయుడు, రామానాయుడు, మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి, జవహర్‌, కొల్లు రవీంద్ర, లోకేశ్‌, దేవినేని ఉమా మహేశ్వరరావు, ఎమ్మెల్సీలు అశోక్‌ బాబు, బుద్ధా వెంకన్న, పార్టీ నేతలు వంగలపూడి అనిత, మాల్యాద్రి, పీలా గోవిందు, బీటీ నాయుడు, వర్మ, పట్టాభి  పాల్గొన్నారు. 

Updated Date - 2020-04-14T09:20:31+05:30 IST