కలివిడి ఉంటేగా..
ABN , First Publish Date - 2020-04-26T10:22:02+05:30 IST
కరోనా నియంత్రణ, ప్రజలను చైతన్యమంతం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విమర్శించారు.

- ఎవరినీ కలుపుకొనివెళ్లని జగన్.. ఆ అజ్ఞానంవల్లే ఇంతటి ఆపద
- వైరస్ వ్యాప్తి నిరోధంలో వైఫల్యం
- మోదీ నుంచి స్ఫూర్తి తీసుకోరేం?
- అధికార నేతల మాట వినలేదని వలంటీర్లను వేధించడం తగదు
- జనం డబ్బులిచ్చి నియమించింది
- వారితో దండం పెట్టించుకోడానికా?
- క్షేత్రస్థాయిలో టీడీపీ విస్తృత సేవలు
- 2.5లక్షల మాస్క్‌లు పంపిణీ చేశాం
- మండలస్థాయి టీడీపీ అధ్యక్షులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్
అమరావతి, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): కరోనా నియంత్రణ, ప్రజలను చైతన్యమంతం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష పార్టీలు, మేధావులను పరిగణనలోకి తీసుకుని ముందుకెళ్లాల్సిన సమయంలో ముఖ్యమంత్రి ఆ పని చేయడం లేదని, అజ్ఞానం, అనుభవలేమే దీనికి కారణమని ధ్వజమెత్తారు. శనివారం మండల పార్టీ అధ్యక్షులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘‘ప్రధాని మోదీ కరోనాను ఎదుర్కొనేందుకు, భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళిక విషయంలో అన్ని వర్గాలతో మాట్లాడి...దూరదృష్టితో వ్యవహరిస్తున్నారు. ప్రధాని నుంచి కొంచం స్ఫూర్తిని కూడా జగన్మోహన్‌రెడ్డి తీసుకోవడం లేదు. దీంతో ప్రజలు, వైద్యులు తమకుతాముగా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. కరోనాపై దీర్ఘకాల పోరాటం తప్పేలా లేదన్న ఆయన, టీడీపీ నేతలు ముందువరుసలో ఉండి ప్రజలను ఆదుకునేందుకు తమవంతు ప్రయత్నం చేస్తున్నారని, ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున 2.5లక్షల మందికి మాస్కులు పంపిణీ చేశారన్నారు.
మాట వినకపోతే తీసేస్తారా?
విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం గెడ్డతిరువాడకు చెందిన బొంగు కార్తీక్, గోపిశెట్టి ఝాన్సీ అనే వలంటీర్లను వైసీపీ నేతల మాట వినలేదని విధుల్లోంచి తొలగించారని చంద్రబాబు విమర్శించారు. ఈ బాధతో ఝాన్సీ ఆత్మహత్యాయత్నం చేసినట్టు ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘ఏమిటీ వేధింపులు? ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవే సేందుకు వలంటీర్లను పెట్టామని ప్రభుత్వం చెప్పింది. ప్రజాధనంతో వారికి జీతాలు ఇస్తున్నారు. అలాంటప్పుడు కరోనా సాయం కింద ఇచ్చే రూ. 1000ను వైసీపీ నాయకులు ఇస్తారనడం ఏంటీ? కాదన్న వలంటీర్లను విధుల్లోంచి తొలగించడం ఏంటి? వాళ్లున్నది ప్రజల కోసమా? వైసీపీ కోసమా? వలంటీర్లను నియమించింది అధికార నేతలకు వంగి వంగి దండాలు పెట్టడానికా?’’ అని చంద్రబాబు ఆగ్రహించారు.
రైతులు తమ బాధలను తమంతతామే వీడియో తీసుకుని పెట్టుకుంటున్నారని, అయినా ముఖ్యమంత్రి దగ్గర జరిగే సమావేశాల్లో మాత్రం రైతులంతా బాగానే ఉన్నారని మంత్రులు చెప్తున్నారని మండిపడ్డారు. ‘‘మామిడి, బత్తాయి, పుచ్చకాయ, బొప్పాయి, కర్బూజ రైతులు తీవ్ర నష్ట్టాల పాలయ్యారు. మంత్రులు చెప్పిన అసత్యాలను తిప్పికొట్టేందుకు రైతులే ఫోన్‌లలో వీడియోలు పంపిస్తున్నారు’’ అని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక రంజాన్ తోఫా ఇవ్వడం లేదని, గత 11నెలల నుంచి ఇమామ్‌లు, మౌజమ్‌లకు ఇవ్వాల్సిన గౌరవ వేతనాలను కూడా చెల్లించలేదని కొందరు మండల పార్టీ అధ్యక్షులు.. చంద్రబాబు వద్ద ప్రస్తావించారు.
కష్టకాలంలోనూ ‘రాజకీయాలు’
బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్
విశాఖపట్నం, ఏప్రిల్ 25(ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రంలో అధికార పార్టీ తీరు సరిగా లేదు. కరోనా కష్టకాలంలో కూడా రాజకీయాలు చేస్తోంది. విశాఖలో అనేక ప్రభుత్వ భూములు వివాదంలో ఉన్నాయి. 22-ఏ జాబితాలో వున్న వాటిని పలుకుబడి వున్న వారికి ధారాదత్తం చేస్తూ నిరభ్యంతర ధ్రువపత్రాలు (ఎన్‌ఓసీలు) కూడా ఇస్తున్నారు. అధికార పార్టీ నాయకుల బెదిరింపులకు లొంగని వారి భూములను లాక్కొంటున్నారు. వాటిపై జీఓలు ఇస్తున్నారు’’ అని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ఆరోపించారు. విశాఖలోని బీజేపీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..ఏపీలో కరోనా కేసులు పెరగడానికి వైసీపీ రాజకీయాలే కారణమని ఆరోపించారు. శ్రీకాళహస్తి, నెల్లూరుల్లో అక్కడి అధికార పార్టీ నాయకుల తీరువల్లే కేసుల సంఖ్య పెరిగిందన్నారు.