మద్యం దుకాణాలు తెరవడం వల్ల సమస్య పెరిగింది: చంద్రబాబు

ABN , First Publish Date - 2020-05-13T21:20:24+05:30 IST

మద్యం దుకాణాలు తెరవడం వల్ల సమస్య పెరిగింది: చంద్రబాబు

మద్యం దుకాణాలు తెరవడం వల్ల సమస్య పెరిగింది: చంద్రబాబు

అమరావతి: నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో వ్యవస్థలను నిర్మిస్తే, గత ఏడాదిలోనే  వైసీపీ ప్రభుత్వం వాటిని ధ్వంసం చేసిందని ఆరోపించారు. కరెంటు బిల్లులు 4 రెట్లు పెరిగాయని పేదలు ఆవేదన చెందుతున్నారని చంద్రబాబు అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లేదని, మద్యం దుకాణాలు తెరవడం తప్పిదంగా మారిందన్నారు.  జూన్, జులైలో కేసులు మరింత పెరుగుతాయనే అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు. పాలకులు అసమర్ధులు అయితే ప్రజలు తీవ్రంగా నష్టపోతారని చంద్రబాబు అన్నారు. దేశంలో ఇప్పుడు  లాక్ డౌన్ -4లోకి రాబోతున్నామని, లాక్ డౌన్ 1 నుంచి 4 వరకు ఆంక్షలు సడలిస్తూ వస్తున్నారని చెప్పారు. కరోనా నియంత్రణలో మొదట్లో క్వారంటైన్ సక్రమంగా చేయలేక పోయారని విమర్శించారు. నిబంధనల అమలులోనే కొన్ని రాష్ట్రాలలో పొరబాట్లు జరిగాయని, జోన్లుగా విభజించినా సక్రమంగా పర్యవేక్షించడంలో విఫలం అయ్యారని చెప్పారు. మద్యం దుకాణాలు తెరవడం వల్ల సమస్య పెరిగిందని మండిపడ్డారు.  ఏపీలో మద్యం మూడందాలా నష్టం చేసిందని, నాసిరకం బ్రాండ్లతో ఆరోగ్యం దెబ్బతిందని, గుంపులుగా చేరడం వల్ల కరోనా కేసులు పెరిగాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. నరేంద్రమోదీ రూ. 20లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించడం పట్ల చంద్రబాబు హర్షం  వ్యక్తం చేశారు.ముందు, కరోనా సమయంలో, కరోనా తర్వాత’’ అనే విధంగా ఇకపై ప్రపంచవ్యాప్త అధ్యయనాలు ఉంటాయన్నారు. ఆర్థిక వ్యవస్థతో పాటు జీవన విధానంలో పెనుమార్పులు. నిరుద్యోగం, ఆహార సమస్య, ఆర్థిక వ్యవస్థ తలకిందులు, రైతులు దెబ్బతినడం, పరిశ్రమలు సిక్ కావడం, ఉపాధి కోల్పోవడం, అనేక సమస్యలు చుట్టుముట్టాయన్నారు. కరోనా నియంత్రణలో విఫలమైతే జరిగే నష్టం అపారమన్నారు. ప్రజలను మానసికంగా సిద్దం చేయడం ముఖ్యమని, బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా తెలుగుదేశం పని చేస్తోందని, తెలుగుదేశం పార్టీ గత 4 దశాబ్దాలుగా ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తోందని చంద్రబాబు అన్నారు.

Updated Date - 2020-05-13T21:20:24+05:30 IST