జేసీ ప్రభాకర్‌రెడ్డికి చంద్రబాబు ఫోన్

ABN , First Publish Date - 2020-12-25T22:22:33+05:30 IST

మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ చేశారు. తాడిపత్రి ఘటన, పోలీసుల తీరుపై చంద్రబాబు ఆరా తీసినట్లు సమాచారం.

జేసీ ప్రభాకర్‌రెడ్డికి చంద్రబాబు ఫోన్

అనంతపురం: మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ చేశారు. తాడిపత్రి ఘటన, పోలీసుల తీరుపై చంద్రబాబు ఆరా తీసినట్లు సమాచారం. ప్రభాకర్‌రెడ్డి ఇంట్లోకి పెద్దారెడ్డి వెళ్లడం, దీనిపై ఇరువర్గాల మధ్య సాగిన భీకర రాళ్ల దాడులతో అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం గురువారం కొన్నిగంటలపాటు అట్టుడికిపోయింది. జేసీ ప్రభాకర్‌రెడ్డి లేని సమయంలో ఆయన ఇంట్లోకి  కేతిరెడ్డి తన అనుచరులతో దూసుకెళ్లారు. ఇళ్లంతా కలియతిరుగుతూ వీరంగం సృష్టించారు. అక్కడున్న జేసీ అనుచరుడు దాసరి కిరణ్‌పై ఎమ్మెల్యే అనుచరులు దాడిచేశారు. ఈ వ్యవహారమంతా సీసీ ఫుటేజీల్లో స్పష్టంగా రికార్డు అయింది. ఇంత జరిగినా చివరికి ప్రభాకర్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభాకర్‌రెడ్డితో పాటు అనుచరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు తోపాటు 307సెక్షన్ కింద తాడిపత్రి వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. 


జేసీ, కేతిరెడ్డి కుటుంబాల మధ్య పోరు దశాబ్దాలుగా సాగుతోంది. గత ఎన్నికల్లో పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందటంతో ఆ రెండు వర్గాలు రాజకీయ ప్రత్యర్థులుగా మారాయి. దీంతో కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్‌రెడ్డి ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలతో నిప్పులు చెరుగుతున్నారు. సందర్భమేదైనా.. సరే ఈ నేతలిద్దరరూ ఒకరికొకరు తారసపడ్డారంటే అక్కడ యుద్ధ వాతావరణమే ఏర్పడుతోందనటంలో సందేహం లేదు. వారి అనుచరుల్లోనూ అదే ఒరవడి కనిపిస్తోంది. ఒకరిపై ఒకరు దాడులకు తెగబడేందుకు వెనుకాడని పరిస్థితులు ఉన్నాయంటే అతిశయోక్తి కాదేమో. గురువారం జరిగిన ఘటన ఇందుకు అద్దం పడుతోంది. జేసీ, ఎమ్మెల్యే కేతిరెడ్డి వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకోవటం, వాహనాలు ధ్వంసం చేయటం ఆ వర్గాల మధ్య ఉన్న వైరానికి పరాకాష్ట. దశాబ్దాలుగా ఇలాంటి ఘటనలు ఆ ప్రాంతంలో నిత్యకృత్యమే అ యినప్పటికీ.. తాజా ఘటన కొత్త భాష్యానికి శ్రీకారం చుట్టినట్లయింది. కేతిరెడ్డి పెద్దారెడ్డి వ్యవహరించిన తీరు మరోసారి జేసీ వర్గంతో కయ్యానికి కాలు దువ్వినట్లయిందన్న అభిప్రాయం అక్కడి ప్రజల్లో వ్యక్తమవుతోంది.

Updated Date - 2020-12-25T22:22:33+05:30 IST