వైఎస్ జగన్ బెంబేలెత్తుతున్నారేం..? : చంద్రబాబు

ABN , First Publish Date - 2020-10-13T22:25:32+05:30 IST

ఈ వ్యవహారం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

వైఎస్ జగన్ బెంబేలెత్తుతున్నారేం..? : చంద్రబాబు

అమరావతి : ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి అక్రమాస్తులపై నమోదైన కేసుల విచారణ ప్రారంభమైన విషయం తెలిసిందే. జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ మొత్తం 11 కేసులు నమోదు చేసింది. వీటిలో రాంకీ ఫార్మా, వాన్‌పిక్‌, పెన్నా సిమెంట్స్‌, భారతి సిమెంట్స్‌పై నమోదు చేసిన ఐదు కేసులు సోమవారం సీబీఐ కోర్టు ఎదుట విచారణకు వచ్చాయి. ఈ కేసులను విచారించే రెగ్యులర్‌ జడ్జి సెలవులో ఉండడంతో.. ఇన్‌చార్జి జడ్జి విచారణ చేపట్టారు. ఇవాళ కూడా విచారణ జరిగింది. ఇలా విచారణ జరుగుతున్న నేపథ్యంలో సడన్‌గా జగన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, సుప్రీం కోర్టు న్యాయమూర్తులపై సంచలన ఆరోపణలు చేస్తూ లేఖలు రాశారు. ఈ వ్యవహారం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.


బెంబేలెత్తుతున్నారేం..!?

తాజాగా ఈ కేసుల విచారణ విషయంపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. ప్రజాప్రతినిధులపై కేసుల విచారణ ఏడాది లోపు పూర్తి చేయాలన్నది ఇవాళ్లిదేం కాదని.. నాలుగేళ్ల క్రితమే సుప్రీంకోర్టు ఆదేశించిందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దేశంలో 4,500 మంది ప్రజా ప్రతినిధులపై రోజువారీ విచారణ చేపట్టారని.. అయితే జగన్ మాత్రం తన మీదే రోజువారీ విచారణ ప్రారంభమైనట్లు బెంబేలెత్తుతున్నారని చంద్రబాబు ఒకింత సెటైరేశారు. కాగా.. పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో భాగంగా జగన్ కేసుల విచారణ విషయం ప్రస్తావనకు రాగా.. చంద్రబాబు పై వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2020-10-13T22:25:32+05:30 IST