సవాళ్లు కొత్త కాదు

ABN , First Publish Date - 2020-05-29T09:01:55+05:30 IST

‘తెలుగుదేశం పార్టీ ఎవరికీ భయపడదు. టీడీపీకి సవాళ్లు కొత్త కాదు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కార్యకర్తలు పార్టీకి అండగా నిలబడతారు.

సవాళ్లు కొత్త కాదు

  • వైసీపీ బెదిరింపులకు భయపడం.. టీడీపీని ఎవరూ కదిలించలేరు
  • ఎన్టీఆర్‌ స్ఫూర్తితో పని చేద్దాం
  • ఆయనకు భారతరత్న ఇవ్వాలి: చంద్రబాబు


అమరావతి, మే 28(ఆంధ్రజ్యోతి): ‘తెలుగుదేశం పార్టీ ఎవరికీ భయపడదు. టీడీపీకి సవాళ్లు కొత్త కాదు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కార్యకర్తలు పార్టీకి అండగా నిలబడతారు. కార్యకర్తలే మన శక్తి. పార్టీని ఎవరూ కదిలించలేరు. టీడీపీ పెట్టిన శుభగడియలు అలాంటివి. వైసీపీ బెదిరింపులకు ఎవరూ భయపడరు. ధైర్యం, సాహసం ఎన్టీఆర్‌ నుంచి ప్రతి కార్యకర్తకు వచ్చాయి. ప్రాణం పోయినా పసుపు జెండా దించేదిలేదనే కార్యకర్తలు టీడీపీ సొంతం’ అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు స్పష్టం చేశారు. మహానాడు కార్యక్రమం రెండోరోజైన గురువారం ఎన్టీఆర్‌కు ఘన నివాళులతో ప్రారంభమైంది. ఎన్టీఆర్‌ భవన్‌కు చేరుకున్న చంద్రబాబు ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా తొలుత ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు.


పార్టీ సీనియర్‌ నేతలు యనమల రామకృష్ణుడు, అయ్యన్నపాత్రుడు, చిన్నరాజప్ప, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నారా లోకేశ్‌, బోండా ఉమామహేశ్వరరావు, వర్ల రామయ్య తదితరులు ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. అనంతరం చంద్రబాబు జ్యోతి ప్రజ్వలన చేసి మహానాడు రెండో రోజు కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలుగుజాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఎన్టీఆర్‌కు ‘భారతరత్న’ అవార్డు ఇవ్వాలని మహానాడు వేదికగా టీడీపీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ తీర్మానంపై చంద్రబాబు మాట్లాడుతూ.. ‘మే 28వ తేదీ టీడీపీకి ప్రత్యేకమైన రోజు. ఒక పండగరోజు. యుగపురుషుడు ఎన్టీఆర్‌ జన్మదినం. టీడీపీకే కాకుండా తెలుగు వారందరికీ పండగరోజు’ అన్నారు. కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, అంబేడ్కర్‌, జాతిపిత గాంధీజీలను ఆదర్శంగా తీసుకుని ఎన్టీఆర్‌ సమాజానికి సేవ చేశారని, ఆయన స్ఫూర్తితో మనం పని చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.


మహిళలు, బీసీలకు ఎన్టీఆర్‌ రాజకీయ రిజర్వేషన్లు కల్పించి రాజ్యాధికారంలో భాగస్వాములను చేశారని, విద్యాధికులను రాజకీయాల్లోకి ప్రోత్సహించారని గుర్తు చేశారు. పేదలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారని, వారికి పట్టెడన్నం పెట్టడమే తన సిద్ధాంతమని చెప్పేవారని కొనియాడారు. ఎన్టీఆర్‌ ఒక వ్యక్తి కాదు.. ఒక వ్యవస్థ అని అభివర్ణించారు. ‘సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు’ అని ఎన్టీఆర్‌ విశ్వసించారని గుర్తు చేశారు. హత్యా రాజకీయాలు టీడీపీకి అలవాటులేదన్నారు. డాక్టర్‌ సుధాకర్‌ విషయంలో వైసీపీ తీరు దుర్మార్గమనిఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. 


బతుకు.. బతికించు: సాయిబాబు

ఎన్టీఆర్‌ చనిపోయి 25 ఏళ్లు అయినా ప్రజల గుండెల్లో సజీవంగా ఉన్నారని టీడీపీ సీనియర్‌ నేత సాయిబాబు అన్నారు. ‘నువ్వు బతుకు -- పక్కవాడిని బతికించు’ అన్నదే ఎన్టీఆర్‌ సిద్ధాంతమన్నారు. దేశానికే ఎన్టీఆర్‌ గర్వకారణమని, ఆయనకు భారత రత్న ఇవ్వాలని వికలాంగుల సంక్షేమ సంస్థ మాజీ చైర్మన్‌  గోనుగుంట్ల కోటేశ్వరరావు కోరారు. శ్రీకాళహస్తిలో రోడ్ల వెంట తిరిగే తనను ఆదరించి ఎన్టీఆర్‌ దగ్గరకు తీశారని శాప్‌ మాజీ చైర్మన్‌ పీఆర్‌ మోహన్‌ గుర్తుచేసుకున్నారు. రాజకీయాలకు ఎన్టీఆర్‌ కొత్తభాష్యం చెప్పారని  అన్నారు.


ఆది నుంచీ అండగా ఉన్నాం: బుచ్చయ్య

ఎన్టీఆర్‌ నీతివంతమైన పాలన అందించారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఆయన వెంట పార్టీ రూపకల్పన నుంచీ నడిచామన్నారు. బడుగులకు అధికారాన్ని చేరువ చేశారని, ఎంతోమందిని నాయకులుగా తీర్చిదిద్దారని చెప్పారు. ఎన్టీఆర్‌ మీద ఆరోపణలు చేసిన వారికి ప్రజలే గుణపాఠం చెప్పారన్నారు. 


నల్ల.. తెల్లజుట్టుతోనూ.. : అశోక్‌ 

రాజకీయాలకు ఎన్టీఆర్‌ కొత్త నిర్వచనం ఇచ్చారని అశోక్‌ గజపతిరాజు అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు గురుకుల విద్యాబోధన చేరువ చేశారని కొనియాడారు. ఎన్టీఆర్‌తో కలిసి నల్లజుట్టుతో ప్రారంభించిన ప్రజాసేవ ఇప్పుడు తెల్లజుట్టుతో కూడా చేసే అవకాశం ఇచ్చిన నాయకత్వానికి, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - 2020-05-29T09:01:55+05:30 IST