దేశ భద్రతకే ముప్పు!

ABN , First Publish Date - 2020-08-18T09:09:31+05:30 IST

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారికంగా... అనధికారికంగా చేయిస్తున్న ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారాలపై కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతో విచారణ

దేశ భద్రతకే ముప్పు!

  • రాష్ట్రంలో అధికారికంగా ఫోన్‌ ట్యాపింగ్‌
  • ప్రైవేటు వ్యక్తులతోనూ ప్రభుత్వం చేయిస్తోంది
  • విపక్షాలు, లాయర్లు, మీడియా, సామాజిక కార్యకర్తల ఫోన్లపై నిఘా
  • న్యాయవ్యవస్థనూ వదలడం లేదు
  • కేంద్ర సంస్థలతో దర్యాప్తు చేయించండి
  • ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ


అమరావతి, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారికంగా... అనధికారికంగా చేయిస్తున్న ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారాలపై కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని ప్రధాని నరేంద్ర మోదీకి టీడీపీ అధినేత చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. విదేశాల నుంచి దిగుమతి  చేసుకున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టి వారి ద్వారా ఫోన్లను ట్యాప్‌ చేయడం వల్ల దేశ భద్రతకు కూడా పెనుముప్పు ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధానికి సోమవారం లేఖ రాశారు. ప్రతిపక్షాల నాయకులు, న్యాయవాదులు, మీడియా ప్రతినిధులు, సామాజిక కార్యకర్తల ఫోన్లను చట్టవిరుద్ధంగా ట్యాప్‌ చేయడం అధికార పార్టీ దిన చర్యగా మారిందని.. చివరకు న్యాయ వ్యవస్థను కూడా వదిలిపెట్టడం లేదని విమర్శించారు. ‘భారత టెలిగ్రాఫ్‌ చట్టంలోని సెక్షన్‌ 5 (2), ఇన్ఫర్‌మేషన్‌ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్‌ 69 ప్రకారం జాతీయ భద్రతకు ముప్పున్న సందర్భాల్లో లేదా సార్వభౌమాధికారం, దేశ సమగ్రత ప్రయోజనాల కోసం లేదా విదేశాలతో స్నేహపూర్వక సంబంధాలకు ముప్పు వాటిల్లే సందర్భాల్లో ఫోన్‌ ట్యాపింగ్‌ చేయడానికి అవకాశం ఉంది.


కానీ వివిధ వర్గాల ప్రజల ఫోన్లను ట్యాప్‌ చేయడంలో వైసీపీ ప్రభుత్వం ఎటువంటి చట్టబద్ధమైన విధానాన్నీ పాటించడం లేదు. ప్రభుత్వ చర్యలు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులను, గోప్యత హక్కును కాలరాస్తున్నాయి. కేంద్ర చట్టాల్లోని నిబంధనలను కూడా దారుణంగా ఉల్లంఘిస్తోంది’ అని లేఖలో వివరించారు. అక్రమ సాఫ్ట్‌వేర్‌ ద్వారా చట్టవిరుద్ధంగా ఈ ట్యాపింగ్‌ జరగడం మరింత ఆందోళనకరమని తెలిపారు. ఇటువంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం దుండగుల చేతిలో ఉండటం వల్ల దీర్ఘకాలంలో జాతీయ భద్రతకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని చెప్పారు. ఫోన్ల ట్యాపింగ్‌తో అత్యున్నత స్ధానాల్లోని వ్యక్తులను తమ దారికి తెచ్చుకోవడానికి, బ్లాక్‌ మెయిలింగ్‌కు, బెదిరింపులకు అవకాశం ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.


తప్పుడు పనులపై గళమెత్తితే..

‘ప్రభుత్వ తప్పుడు పనులకు వ్యతిరేకంగా గళం వినిపించే ప్రతి వ్యక్తి.. ప్రతి సంస్థపైనా దాడులు చేస్తున్నారు. తమ చర్యలకు న్యాయ వ్యవస్ధ నుంచి అడ్డంకులు ఎదురవుతున్నాయన్న అభిప్రాయంతో ఆ వ్యవస్థను కూడా ప్రస్తుతం లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఇటువంటి చట్టవిరుద్ధ ఫోన్‌ ట్యాపింగ్‌లను కట్టడి చేయకపోతే ఎన్నో ఏళ్లు కష్టపడి నిర్మించుకున్న వ్యవస్థల విధ్వంసానికి దారితీస్తుంది’ అని చంద్రబాబు తెలిపారు.. ప్రజాస్వామ్య విలువల పతనానికి... భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలగడమే కాకుండా ఆటవిక రాజ్యంవైపు దారి తీసే ప్రమాదం ఉందన్నార.


వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలపై పద్ధతి ప్రకారం దాడికి పాల్పడుతున్నారని విమర్శించారు. గత ప్రభుత్వ పాలనలో వచ్చిన పెట్టుబడిదారులపై మొదట దాడి చేశారని, ఆ తర్వాత ఎన్నికల కమిషన్‌.. ఏపీపీఎ్‌ససీ వంటి రాజ్యాంగ సంస్థలపై పడ్డారని ఆరోపించారు. ఇందులో భాగంగానే ట్యాపింగ్‌ విస్తృత స్ధాయిలో జరుగుతోందని, ఇది పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. లేఖ ప్రతిని కేంద్ర ఐటీ , న్యాయ శాఖల మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌కు కూడా పంపించారు.

Updated Date - 2020-08-18T09:09:31+05:30 IST