కాన్వాయ్‌కు పోలీసులు అడ్డంకి.. కాలినడకన వెళ్లిన చంద్రబాబు

ABN , First Publish Date - 2020-12-17T18:09:13+05:30 IST

నవ్యాంధ్ర రాజధాని అమరావతి రక్షణకు

కాన్వాయ్‌కు పోలీసులు అడ్డంకి.. కాలినడకన వెళ్లిన చంద్రబాబు

అమరావతి : నవ్యాంధ్ర రాజధాని అమరావతి రక్షణకు రైతులు చేపట్టిన ఉద్యమానికి ఏడాది పూర్తయిన సందర్భంగా ‘జనరణభేరి’ పేరిట భారీ బహిరంగ సభ జరుగుతోంది. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వెళ్తున్నారు. అయితే ఇవాళ ఉదయం నుంచి చంద్రబాబును అడుగడుగునా పోలీసులు అడ్డుకుంటున్నారు. సభా ప్రాంగణానికి వెళ్లకుండా ముందుగా అనుకున్న రూట్ కాకుండా సడన్‌గా పోలీసులు మార్చేశారు. జనభేరి సభకు కొద్ది దూరంలో కాన్వాయ్ నిలిపివేశారు. ఈ క్రమంలో పోలీసులతో ఏపీటీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వాగ్వాదానికి దిగారు. మరోవైపు.. చంద్రబాబు వెళ్లే మార్గంలో పోలీసుల ప్రత్యేక పహారా నిర్వహించారు. ప్రధాన కూడళ్లలో అదనపు బందోబస్త్ ఏర్పాటు చేశారు.


పోలీసులు అడ్డుకోవడంతో..

చంద్రబాబు కాన్వాయ్‌ను వెలగపూడి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రాజధాని శంకుస్థాపన ప్రదేశానికి కాలినడకనే చంద్రబాబు వెళ్లారు. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ సభకు అనుమతి ఉన్నా పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారంటూ తెలుగు తమ్ముళ్లు కన్నెర్రజేస్తున్నారు. కాలినడకనే వెళ్లిన చంద్రబాబు.. శంకుస్థాపన ప్రదేశానికి శిరస్సు వంచి నమస్కరించారు. శంకుస్థాపన ప్రదేశంలో ‘జై అమరావతి’ అంటూ రాజధాని రైతులు, జేఏసీ నేతలు నినాదాలు చేశారు. కాసేపట్లో జనభేరి మహాసభకు చంద్రబాబు చేరుకోనున్నారు. ఈ సభకు వేల సంఖ్యలో రాజధాని గ్రామాల రైతులు, మహిళలు, నేతలు హాజరయ్యారు. ఆకుపచ్చ కండువా, ఆకుపచ్చ వస్త్రాలు ధరించి రైతులు, మహిళలు సభకు విచ్చేశారు. మొత్తం 30వేల మంది దాకా హాజరవుతారని జేఏసీ నేతలు ఇంకా అంచనా వేస్తున్నారు.


పసుపు-కుంకుమ తీసుకురానివ్వకుండా..

అంతకుముందు విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. న్యాయం, ధర్మాన్ని కాపాడాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. దుర్గమ్మ దర్శనానికి వెళ్తుంటే అవాంతరాలు సృష్టించారు. పసుపు-కుంకుమ తీసుకురానివ్వకుండా అడ్డుకున్నారు. ఏడాది కాలంగా అమరావతి కోసం రైతులు పోరాటం చేస్తున్నారు. రైతులు, మహిళలపై దాడులకు పాల్పడ్డారు. అమరావతి రైతులు ఎన్నో అవమానాలు భరించారు. దేవతల రాజధాని అమరావతిని విధ్వంసం చేస్తున్నారు. మీ బిడ్డలకు న్యాయం చేయాలని దుర్గమ్మను కోరుకున్నాను. ప్రజా రాజధానికి దుర్గమ్మే రక్షణగా నిలవాలిఅని చంద్రబాబు తెలిపారు.

Updated Date - 2020-12-17T18:09:13+05:30 IST