రాక్షస రాజ్యం కంటే ఘోరం!

ABN , First Publish Date - 2020-03-12T08:54:48+05:30 IST

ఇంత దుర్మార్గాన్ని ఎక్కడా చూడలేదు..రాక్షస రాజ్యం కూడా ఇలా ఉండదని టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తమ పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, అధికార ప్రతినిధి

రాక్షస రాజ్యం కంటే ఘోరం!

  • మా వాళ్ల హత్యకు ప్రయత్నం
  • బొండా, బుద్దా, కిశోర్‌ చనిపోయి ఉంటే పరిస్థితి ఏంటి?
  • కశ్మీర్‌, బిహారుల్లోనూ చూడలేదు
  • రాష్ట్రాన్ని వల్లకాడు చేస్తారా?
  • డీజీపీ ఏం చేస్తున్నారు?.. బాబు ఆగ్రహం



అమరావతి, మార్చి 11, (ఆంధ్రజ్యోతి): ఇంత దుర్మార్గాన్ని ఎక్కడా చూడలేదు..రాక్షస రాజ్యం కూడా ఇలా ఉండదని టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తమ పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, అధికార ప్రతినిధి బొండా ఉమామహేశ్వరరావు, న్యాయవాది కిశోర్‌లను హత్య చేసేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించారని మండిపడ్డారు. మాచర్లలో పై ముగ్గురిపై వైసీపీ నేతల దాడి ఘటన అనంతరం చంద్రబాబు బుధవారమిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘పల్నాడులోనే కాదు. రాష్ట్రమంతా ఇలాగే జరుగుతోంది. ప్రజాస్వామ్యాన్ని బతికించేందుకు వెళ్లిన వీళ్లు ముగ్గురూ చనిపోయి ఉంటే పరిస్థితి ఏంటి? భగవంతుడే కాపాడాడు. కశ్మీర్‌, బిహారుల్లో కూడా ఇలాంటి దుర్మార్గాలు చూడలేదు.  పరిస్థితులు ఇలా ఉంటే డీజీపీ ఏం చేస్తున్నారని నిలదీశారు. ‘వాళ్లు ప్రజా ప్రతినిధులు. మాచర్లకు సొంత పనులకు వెళ్లారా? భూ తగాదాకు పోయారా? ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు వెళ్లారు. వెళ్తే దాడి చేస్తారా? మాచర్ల పులి బోనని వైసీపీ వాళ్లు అంటున్నారు. రాబోయే రోజుల్లో ఏ ఊరికా ఊరిని ఇలా పులిబోను చేస్తే ఏమవుతుంది’ అని ప్రశ్నించారు. ఇంకా ఏమన్నారంటే..


పక్కా స్కెచ్‌తోనే జరిగింది..! 

‘జరిగింది చాలా దారుణం. మాచర్లలో నామినేషన్లు వేయనివ్వడం లేదని సమాచారం ఉండడంతో మంగళవారం రాత్రి సమీక్ష చేశాం. అక్కడికి ఒకరిద్దరి నాయకుల్ని, న్యాయవాదుల్ని పంపించాలని నిర్ణయించాం. బొండాఉమ, బుద్దా వెంకన్నలకు మాచర్ల వెళ్లాలని చెప్పా. వారిపై మాచర్లలో దాడి చేసింది మామూలు నేరస్థులు కాదు. కరుడుగట్టిన నేరస్థులు. నేరాలు చేయడం తెలియకపోతే ఇలా చేయలేరు. కర్రలు, కత్తులు, గొడ్డళ్లతో హత్యాయత్నానికి తెగబడ్డారు. ఒకచోట తప్పించుకున్నా ఇంకోచోట దాడిచేయాలని పక్కాగా స్కెచ్‌ వేశారు. మాచర్ల  నడిబొడ్డులో చేశారు. ప్రజలు నిర్వీర్యంగా చూస్తున్నారు తప్ప ఏమీ చేయలేకపోయారు. ఒక రౌడీ పట్టపగలు హత్య చేసినా ఏమీ చేయలేని భయం అది. మూడు కార్లలో తెలుగుదేశం నేతలు వెళ్లారు. మొదటి కారులో న్యాయవాది కిశోర్‌ ఉన్నారు. రెండో కారులో బొండా, బుద్దా.. మూడో కారులో వారి పీఏలు ఉన్నారు. మొదటి కారులో ఉన్న అడ్వకేట్‌పై దాడి చేశారు. ఆయన్ను రక్తం వచ్చేలా కొట్టారు. ఆయన తప్పించుకునేందుకు నాగార్జునసాగర్‌ డ్యామ్‌ దాటి తెలంగాణకు వెళ్లారు. రెండో కారులో ఉన్న నేతలపై దాడి చేశారు. ఆ కారు అద్దాలు చుట్టూ పగిలిపోయాయి. ఇవన్నీ ఆధునిక అద్దాలు కాబట్టి సరిపోయింది కానీ.. లేకుంటే ఆ అద్దాల ముక్కలు వీళ్ల ముఖాలపై పడి చనిపోయేవారు. కర్రలతో లోపలున్నవారిని కొట్టారు. డ్రైవరు ఏసు వీళ్లను కాపాడాడు. అతడిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మూడోకారులో ఉన్న పీఏలు తప్పించుకుని వెనక్కి వచ్చేశారు. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. 10 కార్లలో వచ్చారు.. ఎవరినో గుద్దారు.. వాళ్లు రెచ్చిపోయి ఇదంతా చేశారని అంటున్నారు. వెళ్లింది మూడు కార్లు, ఇద్దరు నేతలు, ఒక అడ్వకేటు. ఇటీవల అవినాశ్‌ అనే వ్యక్తిని పోలీ్‌సస్టేషన్‌లోనే కొట్టి.. ఆ ఆర్తనాదాలను ఫోన్లో ఎమ్మెల్యేకు వినిపించారు. మొన్న చలో ఆత్మకూరు పెడితే.. అక్కడా ఇంతే. మానవ హక్కుల సంఘం వచ్చి తప్పని ఎండగట్టినా సిగ్గురాలేదు. మరోపక్క బాబాయి హత్య. మనిషిని చంపేసి సహజ మరణం అన్నారు. ఆ హత్య జరిగి ఏడాదైంది. వారెంత నేరస్థులు, కరడుగట్టిన దుర్మార్గులో అర్థమవుతోంది. ఇలాంటి హత్యలు, అరాచకాలు చేయడానికి వీళ్లకు అధికారంఇచ్చారా? ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఉదయం నుంచీ అడుగడుగునా వెంటాడి, వేటాడి సినిమా ఫక్కీలో.. దాని కంటే ఘోరంగా వెంటాడుతుంటే ఎంత మానసిక వేదన అనుభవించారో ఆలోచించండి. ప్రజాప్రతినిధి, అడ్వకేట్‌ ఎంత భయబ్రాంతులకు లోనై ఉంటారు? దేవుడిమీద భారం వేశారంతే. ఒకవేళ ఆ కారు డోర్‌ వచ్చి ఉంటే లోపలున్నవారిని ఏం చేసేవారు? చాలా నేరాలు, దాడులు చూశా. పథకం ప్రకారం ఇంత దారుణమైన దాడిని ఇప్పుడే చూస్తున్నా. ఇప్పటికైనా పోలీసులు సమాధానం చెప్పితీరాలి. ఎన్నికల సంఘం చెప్పాలి. నెల్లూరు జిల్లాలో మా పరసా రత్నంపైనా దాడి చేశారు.’


డీజీపీ, ఎస్పీలకు బాధ్యత లేదా?

మాచర్లలో దాడి జరగకముందే గుంటూరు ఎస్పీతో మాట్లాడాను. మాచర్లలో చాలా దారుణంగా ఉంది. నామినేషన్లు లేవు.. మీరు చర్యలు తీసుకోవాలని చెప్పాను. కానీ ఆయనేం చర్యలు తీసుకోలేదు. ఆయనతో మాట్లాడిన రెండు గంటలకే దాడి జరిగింది. కనీసం అప్పుడైనా ఫోన్‌చేసి.. ఇలా జరిగినందుకు బాధపడుతున్నాను.. రక్షణ కల్పిస్తానని కూడా చెప్పలేదు. రెండు, మూడు సార్లు ఫోన్‌ చేస్తే తప్ప లైన్‌లోకి రాలేదు. మరోవైపు డీజీపీకి కూడా ఫిర్యాదు చేశాం. కనీసం మర్యాదగానైనా ఈ సంఘటన పట్ల బాధపడుతున్నామని చెప్పలేదు. ఇదేనా దుండగులను శిక్షించే విధానం? ఇదేనా జనాన్ని రక్షించే పద్ధతి? ప్రజాస్వామ్యం అంటే ఇదేనా? ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి వెళ్లిన వాళ్లు చనిపోవాలా? ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఈ రాష్ట్రాన్ని? రాష్ట్రాన్ని వల్లకాడు చేస్తారా? అడ్డం వచ్చినవాళ్లపై దాడులు చేస్తారా? పోలీసు వాహనాలపై దాడిచేసే ధైర్యం వచ్చిందంటే ఏం చేయాలి? నేను ప్రతి నిమిషం పిటిషన్లు పెట్టుకుని ఈ ఎన్నికల్లో పోటీ చేయాలా? నామినేషన్లు వేయడానికి స్వేచ్ఛ లేదా? నా జీవితంలో ఈ తరహా ఎప్పుడూ చూడలేదు. ఇది చూశాకైనా ప్రజల్లో కనువిప్పు కలగాలి. రాజకీయ పార్టీలు ఆలోచించాలి. రాష్ట్రాన్ని కాపాడుకుంటారా? శాశ్వతంగా తాకట్టు పెట్టేస్తారా? ఈ సమస్యను ప్రజల కోర్టులో పెడుతున్నాం’

Updated Date - 2020-03-12T08:54:48+05:30 IST