ఎన్నడూ చూడని దుర్మార్గ పాలన ఏపీలో చూస్తున్నాం : చంద్రబాబు

ABN , First Publish Date - 2020-10-13T22:39:29+05:30 IST

దేశంలో ఎన్నడూ చూడని దుర్మార్గ పాలనను ఏడాదిన్నరగా ఆంధ్రప్రదేశ్‌లో చూస్తున్నామని

ఎన్నడూ చూడని దుర్మార్గ పాలన ఏపీలో చూస్తున్నాం : చంద్రబాబు

అమరావతి : దేశంలో ఎన్నడూ చూడని దుర్మార్గ పాలనను ఏడాదిన్నరగా ఆంధ్రప్రదేశ్‌లో చూస్తున్నామని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలు ప్రస్తావనకు వచ్చాయి. నేరచరిత్రగల వాళ్లు అధికారంలోకి వస్తే వాటిల్లే ఉపద్రవాలకు ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ అని బాబు చెప్పుకొచ్చారు. ఒక తప్పు చేయడం, ఆ తప్పును కప్పిపుచ్చకోడానికి ఇంకా పెద్దతప్పు చేయడం జగన్మోహన్ రెడ్డికి నిత్యకృత్యం అయ్యిందని మండిపడ్డారు.


ఇచ్చిన అధికారం ప్రజలను చంపడానికి లైసెన్స్ అనుకుంటున్నారా..? అని బాబు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. తన అవినీతి బురద ఇతరులకు అంటించడం, తప్పుడు వార్తలతో ప్రజల్లో అపోహలు పెంచడం జగన్ నైజం అని.. ప్రశ్నించిన వాళ్లపై దాడులు చేయడం, బెదిరించి భయపెట్టి లోబర్చుకోవడం ఆయన రాజకీయమని మాజీ ముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.


చంద్రబాబు పిలుపు..

గత 2 రోజులుగా భారీ వర్షాలతో 5జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో పంటలు నీట మునిగి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. చేతివృత్తులవారు ఉపాధి కోల్పోయారు. అటు కరోనా బాధితులను, ఇటు వరద బాధితులను ఆదుకునేలా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. గిట్టుబాటు ధర, విపత్తు సాయం ఏదీ లేదు. రైతులను రెండు విధాలా నష్టాల్లో ముంచారు. మోటార్లకు మీటర్లు పెట్టడాన్ని రైతులంతా వ్యతిరేకిస్తున్నారు. రైతులకు అండగా ఉండాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీపై ఉంది. వైసీపీ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక చర్యలను అడ్డుకోవాలి అని చంద్రబాబు పిలుపునిచ్చారు.

Updated Date - 2020-10-13T22:39:29+05:30 IST