‘వైసీపీ ఎంపీ ప్రాణాలకే రక్షణ లేదు.. ఇక..’

ABN , First Publish Date - 2020-06-23T22:30:07+05:30 IST

టీడీపీ సీనియర్ నాయకులతో చంద్రబాబు ఆన్‌లైన్‌లో సమావేశం నిర్వహించారు. కరోనా సంక్షోభంలోనూ వైసీపీ నేతల కుంభకోణాలు, ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు దారుణం అని

‘వైసీపీ ఎంపీ ప్రాణాలకే రక్షణ లేదు.. ఇక..’

అమరావతి: టీడీపీ సీనియర్ నాయకులతో చంద్రబాబు ఆన్‌లైన్‌లో సమావేశం నిర్వహించారు. కరోనా సంక్షోభంలోనూ వైసీపీ నేతల కుంభకోణాలు, ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు దారుణం అని చంద్రబాబు మండిపడ్డారు. చివరికి అంబులెన్స్‌ల వ్యవహారంలోనూ రూ.408 కోట్ల కుంభకోణానికి పాల్పడటం దారుణం అన్నారు. అంబులెన్స్‌ల కాంట్రాక్ట్ విజయసాయిరెడ్డి అల్లుడికి కట్టబెట్టారని చంద్రబాబు ఆరోపించారు. అవినీతిపై ప్రశ్నిస్తే వేధిస్తారా? అని ప్రభుత్వం తీరుపై ఆయన నిప్పులు చెరిగారు. సరస్వతి పవర్‌కు నీళ్లు, గనుల కేటాయింపును ప్రశ్నిస్తే నోటీసులు ఇస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.


రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని, కేసులు పెట్టి వేధిస్తున్నారని, అధికార పార్టీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని సాక్షాత్తు కేంద్రమంత్రి కిషన్ రెడ్డే వ్యాఖ్యానించారని ఉటంకిస్తూ వైసీపీ ప్రభుత్వం తీరును చంద్రబాబు తూర్పారబట్టారు. వైసీపీ ఎంపీ ప్రాణాలకే రాష్ట్రంలో భద్రత లేదని, ఇక సామాన్యుల పరిస్థితిని అర్థం చేసుకోవచ్చునని అన్నారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని స్పీకర్‌కు రఘురామ కృష్ణంరాజు లేఖ రాయడాన్ని ఆయన గుర్తుచేశారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని దళిత యువకులను అరెస్ట్ చేశారని విమర్శించారు. సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చంద్రబాబు ప్రకటించారు.

Updated Date - 2020-06-23T22:30:07+05:30 IST