-
-
Home » Andhra Pradesh » chandrababu comments on jagan govt
-
సురక్షితమైన తాగునీరు ఇవ్వలేని జగన్‌రెడ్డి పాలన వల్ల...: బాబు
ABN , First Publish Date - 2020-12-06T17:15:23+05:30 IST
సురక్షితమైన తాగునీరు ఇవ్వలేని జగన్‌రెడ్డి పాలన వల్ల...150 మందికి పైగా పిల్లలు, పెద్దలు..

అమరావతి: సురక్షితమైన తాగునీరు ఇవ్వలేని జగన్‌రెడ్డి పాలన వల్ల...150 మందికి పైగా పిల్లలు, పెద్దలు తీవ్ర అస్వస్థతతో విలవిల్లాడుతున్నారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు ట్విట్టర్ వేదికగా విచారం వ్యక్తం చేశారు. ఏలూరు ఘటనపై స్పందించిన ఆయన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని సొంత నియోజకవర్గంలో నీరు కలుషితం అయిందంటే ఎంత బాధ్యతారాహిత్యమో అర్థం అవుతోందన్నారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలంటే లెక్కలేనితనం కనిపిస్తోందని చంద్రబాబు ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు.
ఏలూరులో ఉన్నవారు ఉన్నట్లే కిందపడిపోయారు. నోట్లో నురగలు కక్కుతూ స్పృహ కోల్పోయారు. చిన్నపిల్లలతో సహా సమారు వంద మంది వరకు అస్వస్థతకు గురయ్యారు. చూస్తుండగానే కళ్లు తిరిగిపడిపోతుండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
ఇంటి ముందు వాకిట్లో ఆడుకుంటున్న ఆరేళ్ల బాలిక అకస్మాత్తుగా నేలపై పడి నోటి వెంబడి నురుగులు కక్కుతూ మూర్చ వచ్చి కొట్టుకులాడి స్పృహ కోల్పోయింది. దీంతో బాలిక కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోయి ఆ బిడ్డను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వైద్యులు సెలైన్లు, ఇంజక్షన్లు ఇవ్వగా కొద్దిసేపటికి స్పృహలోకి వచ్చింది. మరో ఘటనలో రోడ్డుపై నడుస్తున్న 18 ఏళ్ల యువకుడు అకస్మాత్తుగా కిందపడిపోయి ఫిట్స్‌తో కొట్టుకులాడుతూ స్పృహ కోల్పోయాడు. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన కొందరు యువకుడి కుటుంబ సభ్యులకు చెప్పడంతో వెనువెంటనే ఆ యువకుడిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ఈలోపే సాధారణ స్థితికి చేరుకున్నాడు.
మరికొన్ని ఘటనల్లో యువతులు కూడా ఇలానే అకస్మాత్తుగా నేలపై పడి కొట్టుకులాడి, స్పృహ కోల్పోయారు. ఇలా.. ఆరేళ్ల పసిబిడ్డ నుంచి 60 ఏళ్ల వృద్ధురాలి వరకు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు. శనివారం ఉదయం ఏలూరు నగరంలోని దక్షిణపు వీధిలో మొదలైన ఈ అంతుపట్టని వ్యవహారం రాత్రికి నగరంలోని అన్ని ప్రాంతాలకు వ్యాపించింది. శనివారం ఉదయం ఒకొక్కరుగా ఆసుపత్రికి రావడంతో ఆసుపత్రి వైద్యులు సాధారణ ఫిట్స్‌గా భావించి సేవలు అందించారు. అయితే, సాయంత్రానికి వీరి సంఖ్య వంద దాటడడంతో వైద్యులు అప్రమత్తమయ్యారు. వ్యాధి ఏమిటనే దానిపై చర్చించారు. దాదాపు వంద మంది ఇలా పడిపోవడంతో ప్రతి ఒక్కరికీ సిటీస్కానింగ్ నిర్వహించారు. ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో అంతుపట్టని వ్యాధిగా వైద్యులు పేర్కొన్నారు. ఆసుపత్రిలో చేరిన ఆరేళ్ల ప్రభ అనే బాలిక పరిస్థితి విషమంగా ఉండడంతో విజయవాడ ప్రభుత్వాసుపత్రికి పంపారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఈ వ్యాధి నిర్ధారణపై ప్రత్యేక బృందాలను సిద్ధం చేశారు.
నగరంలోని దక్షిణపు వీధి ప్రాంతానికి ప్రత్యేక వైద్య బృందాలు వెళ్లి ఇంటింటి సర్వే చేపట్టారు. వారు తిన్న ఆహారం, తాగిన నీరు, పరిసరాలను పరిశీలించారు. శనివారం రాత్రికి నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి ఒకొక్కరుగా ఆసుపత్రికి రావడంతో నగరం అంతా వ్యాపించిందని గుర్తించారు. అయితే గాలి కాలుష్యమా, నీటి కాలుష్యమా, దోమల వలన వచ్చిందా అనేది అంతుచిక్కలేదు. ఆసుపత్రి చీఫ్ ఫిజీషియన్ డాక్టర్ పోతుమూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు వైద్య సేవలు అందిస్తున్నాయి.