జగన్‌ అరాచకానికి వ్యవస్థలన్నీ బలి

ABN , First Publish Date - 2020-06-19T09:24:55+05:30 IST

ముఖ్యమంత్రి జగన్‌ అరాచకానికి రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు బలైపోతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు.

జగన్‌ అరాచకానికి వ్యవస్థలన్నీ బలి

అక్రమ కేసులతో వేధిస్తున్నారు

ఏడాదిలో 800 మంది కార్యకర్తలపై దాడులు

అచ్చెన్న సహా పలువురి అక్రమ అరెస్టులు

ప్రధాని మోదీకీ మెజారిటీ ఉంది..

కానీ అందరితో మాట్లాడే చేస్తున్నారు

ఇక్కడ దురుద్దేశంతోనే ఆ రెండు బిల్లులు

మాజీ సీఎం చంద్రబాబు ధ్వజం


అమరావతి/విజయవాడ, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి జగన్‌ అరాచకానికి రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు బలైపోతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై వైసీపీ ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతోందని విమర్శించారు. అక్రమ కేసులతో వేధిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన గురువారం రాత్రి రాజ్‌భవన్‌లో గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలిశారు. గంటా పది నిమిషాలపాటు చర్చలు జరిపారు. తమ పార్టీ నేతల అక్రమ అరెస్టులపై ఫిర్యాదు చేశారు. 14 పేజీలతో కూడిన లేఖను గవర్నర్‌కు అందజేశారు. టీడీపీకి చెందిన 33 మంది ప్రజాప్రతినిధులపై పెట్టిన కేసుల వివరాలను అందులో పొందుపరిచారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘శాసనమండలి సెలెక్ట్‌ కమిటీకి పంపిన బిల్లులను మళ్లీ దురాలోచనతో రెండోసారి ప్రవేశపెట్టారు. సదరు బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపామని ఏజీయే హైకోర్టులో చెప్పారు. మళ్లీ వాటిని సభలో ఎలా ప్రవేశపెడతారు? ఇక కార్యనిర్వాహక వ్యవస్థ తాము చెప్పినట్లు చేయకుంటే ఊరుకునేది లేదన్నట్లుగా బెదిరిస్తున్నారు. పోలీసులు విధుల్లో లేకుంటే 50 శాతమే జీతం ఇస్తామంటూ ఉత్తర్వులిచ్చారు.


అంతే తాము చెప్పినట్లు చేయనివారికి పోస్టింగ్‌ ఇవ్వకుండా సగం జీతమే ఇస్తారన్నమాట. న్యాయాన్ని నిలబెడుతున్న న్యాయవ్యవస్థపైనా విమర్శలు చేస్తున్నారు. మీడియా, సోషల్‌మీడియా, ప్రజల గొంతు నొక్కుతున్నారు. ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలుగా ఉన్న నాలుగు వ్యవస్థల్నీ భ్రష్టు పట్టించారు. తక్షణం గవర్నర్‌ జోక్యం చేసుకుని రాష్ట్రంలో చట్టబద్ద పాలన పునరుద్ధరించాలి’ అని విజ్ఞప్తి చేశారు. మాట్లాడితే తమకు 151 సీట్లు వచ్చాయంటున్నారని.. ప్రధానమంత్రి మోదీకి కూడా మెజారిటీ వచ్చిందని.. కానీ అందరితో మాట్లాడే చేస్తున్నారని గుర్తుచేశారు. ‘1994లో టీడీపీకి 17.5శాతం ఓట్లు ఎక్కువగా వచ్చాయి. అయినా ఇప్పటిలా చేయలేదు. జగన్‌ ఏడాది పాలనలో జరిగిన రాజ్యాంగ ఉల్లంఘన, ప్రాథమిక హక్కుల ఉల్లంఘన, చట్ట ఉల్లంఘన, బెదిరింపులు అన్నింటిపైనా గవర్నర్‌కు సాక్ష్యాధారాలతో నివేదికఇచ్చాం. తగు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం’ అని తెలిపారు. ఇంకా ఏమన్నారంటే..


మండలి అంటే సీఎం బ్రాంచ్‌ ఆఫీసా?

‘ముఖ్యమంత్రిలో ఉన్మాదం ముదిరింది. అన్నీ తన ఇష్టప్రకారమే జరగాలంటే జరగవు. దిగువ సభలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు వాటిలో తప్పులుంటే పెద్దల సభ సరిచేస్తుంది. కాలక్రమేణా దానిలో రాజకీయజోక్యం ఎక్కువైపోయింది. దేశంలో ఎన్ని బిల్లులు ఆగిపోలేదు..? ఎన్ని సెలెక్ట్‌ కమిటీకి పంపలేదు? మండలి అంటే ముఖ్యమంత్రి బ్రాంచ్‌ ఆఫీస్‌ అనుకుంటున్నారా? కరోనా భయంకరంగా ఉన్న సమయంలో అసెంబ్లీ నిర్వహించారు. గవర్నర్‌ ప్రసంగాన్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించారు కదా! అసెంబ్లీని అలా ఎందుకు నిర్వహించలేదు?


కేసులతో పైశాచికానందం..

‘అచ్చెన్నాయుడిని అక్రమంగా అరెస్టు చేశారు. ఏసీబీ కేసులున్నా ముందు విచారించాలి.. ఆ తర్వాతే అరెస్టు అని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. ఏదీ పాటించడం లేదు. ఆపరేషన్‌ అయిన అచ్చెన్నను 600 కిలోమీటర్లు ఏకబిగిన లాక్కెళ్లిపోయారు. గాయం పెరిగి రక్తం కారింది. మళ్లీ ఆపరేషన్‌ చేయాల్సి వచ్చింది. ఇది ముఖ్యమంత్రికి పైశాచికానందం. ఇలాంటివి వడ్డీతో సహా తీరతాయని గుర్తుపెట్టుకోవాలి. 43 వేల కోట్ల దోచేసినందుకు.. ఎర్రన్నాయుడు, అశోక్‌గజపతిరాజు కేసు వేశారని ఈరోజు అచ్చెన్నను అరెస్టు చేస్తారా? యనమల రామకృష్ణుడు, చినరాజప్ప ఒక పెళ్లికి వెళ్తే.. ఆ పెళ్లికొడుకు ఒక ఎస్సీ యువతిని మోసం చేశాడని.. పెళ్లికి వెళ్లిన వారందరిపైనా కేసులు పెడతారా? బీద రవిచంద్రపై కేసు పెడతారా?’ 


గనులన్నీ వాళ్లకే కావాలి

‘టీడీపీ నేతల ఆర్థిక మూలాలు సర్వనాశనం చేయాలని చూస్తున్నారు. గ్రానైట్‌ కంపెనీలపై వేలకోట్ల జరిమానా వేస్తారా? మొత్తం గనులన్నీ మీకే కావాలి. రాష్ట్రంలోఉండే గనులన్నీ మీరే తీసుకుంటున్నారు. వాటాలు తీసుకోవడం, ఎవరన్నా ఇవ్వనంటే నోటీసులిచ్చి హస్తగతం చేసుకోవడం చేస్తున్నారు. ఇసుకంతా బ్లాక్‌మార్కెట్‌. చెన్నారెడ్డి, కోట్ల, వైఎస్‌ అందరితో పోరాడాం. కానీ ఇంత దుర్మార్గంగా ఎవరూ లేరు. ప్రజల హక్కులు కాపాడడం కోసం, చట్టాన్ని గౌరవించడం కోసం గవర్నర్‌ చర్యలు తీసుకోవాలి.’


అయ్యన్నపై 6 కేసులా?

నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న సీనియర్‌ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై పోలీసులు నిర్భయ చట్టం కింద  కేసు నమోదు చేయడంపై చంద్రబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన ఈ మేరకు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు గురువారం లేఖ రాశారు. ‘‘అయ్యన్నపాత్రుడి తండ్రి లచ్చపాత్రుడు బలహీనవర్గాల హక్కుల కోసం పోరాడిన గౌరవనీయ నేత. మున్సిపల్‌ కార్యాలయంలో ఉన్న ఆయన ఫొటోను తొలగించడంపై జరిగిన నిరసనకు అయ్యన్న వెళ్లారు. దీనికి నిర్భయ చట్టం కింద ఆయనపై కేసు నమోదు చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆయనపై ఆరు తప్పుడు కేసులు పెట్టారు. కక్ష తీర్చుకోవడానికి, వేధించడానికి పెట్టిన ఈ కేసులన్నిటిలో ఆయన కోర్టులో పోరాడి విజయం సాధించారు. ఇప్పుడు కొత్తగా ఈ కేసు పెట్టారు.’ అని అందులో పేర్కొన్నారు. 


సంతో్‌షబాబు త్యాగం అజరామరం: చంద్రబాబు

చైనా సైన్యంతో జరిగిన ఘర్షణల్లో మరణించిన కర్నల్‌ సంతోష్‌ బాబు, ఇతర సైనికులు దేశ సరిహద్దులను కాపాడటానికి తమ ప్రాణాలను బలిదానం చేశారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కొనియాడారు. ‘తమ ప్రాణాలను పణంగాపెట్టి దేశాన్నీ, దేశ గౌరవాన్నీ కాపాడుతున్న సైన్యంలోని ప్రతి ఒక్కరికీనా శాల్యూట్‌. వారి త్యాగం అజరామరం. మనమందరం ఏకతాటిపైకి వచ్చి సైన్యానికి అండగా నిలవాలి. మద్దతివ్వాలి’ అని ట్విటర్‌లో పిలుపిచ్చారు.

Updated Date - 2020-06-19T09:24:55+05:30 IST