ఒంగోలు దివ్యాంగురాలు సజీవదహనంపై చంద్రబాబు దిగ్భ్రాంతి

ABN , First Publish Date - 2020-12-20T03:48:26+05:30 IST

ఒంగోలు దివ్యాంగురాలు సజీవదహనంపై మాజీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ దుర్ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని..

ఒంగోలు దివ్యాంగురాలు సజీవదహనంపై చంద్రబాబు దిగ్భ్రాంతి

అమరావతి: ఒంగోలు దివ్యాంగురాలు సజీవదహనంపై మాజీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ దుర్ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఆయన సూచించారు. హత్యలు, హత్యాచారాలు, అమానుష చర్యలు పేట్రేగడం ఆందోళనకరమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 


కాగా ఒంగోలు శివారు ప్రాంతంలో శుక్రవారం రాత్రి దారుణం జరిగింది. దశరాజుపల్లి రోడ్డులోని చిన్నవెంకన్న కుంట వద్ద దివ్యాంగురాలు సజీవ దహనమైంది. ఇది హత్యా, ఆత్మహత్యా.. అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతురాలి తల్లి మాత్రం ఇది హత్యేనని ఆరోపిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని కమ్మపాలెం మూడో లైన్‌లో నివాసం ఉండే ఉమ్మనేని భువనేశ్వరి (22) దివ్యాంగురాలు. ఆమె నగరంలోని 12వ వార్డు సచివాలయంలో వలంటీర్‌గా పని చేస్తోంది.  దూర విద్య ద్వారా నాగార్జున యూనివర్సిటీలో ఎంబీఏ చదువుతోంది. ఆమె చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు. అక్క  మానసిక వికలాంగురాలు. భువనేశ్వరి తల్లి జానకి ప్రకాశం భవన్‌ ఎదుట ఉన్న బుక్‌ డిపోలో పని చేస్తూ ఇద్దరు కూతుళ్లను పెంచింది. భువనేశ్వరి  రోజూమాదిరిగానే శుక్రవారం సచివాలయానికి వెళ్లింది. సాయంత్రం 6.49 గంటల సమయంలో తల్లితో ఫోన్‌లో మాట్లాడింది. ఆతర్వాత ఇంటికి రాలేదు. జానకి రాత్రి 8 గంటల సమయంలో కుమార్తెకు ఫోన్‌ చేయగా స్విచాఫ్‌ అని వచ్చింది. దీంతో ఆమె వెతుకులాడటం ప్రారంభించింది.


రాత్రి 8 గంటల తర్వాత దశరాజుపల్లి రోడ్డులోని చినవెంకన్న కుంట వద్ద మూడు చక్రాల సైకిల్‌పై ఓ యువతి తగులబడుతుందన్న సమాచారాన్ని కిమ్స్‌ ఆసుపత్రిలోని సెక్యూరిటీ ఆఫీసర్‌ తాలూకా పోలీసులకు ఫోన్‌ చేసి ఇచ్చారు. ఆ వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగా ఆమె మంటల్లో తగులబడుతూ కన్పించింది. వెంటనే ఫైరింజన్‌ను పిలిపించి మంటలు ఆర్పారు. విషయం తెలుసుకున్న మృతురాలి తల్లి  ఘటనా స్థలానికి చేరుకుంది. తన కుమార్తె ఎంతో ధైర్యవంతురాలని, ఆత్మహత్య చేసుకొని ఉండదని తెలిపింది. ఎవరో హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేసింది. కాలిపోయే సమయంలో భువనేశ్వరి శరీరం నుంచి ఎలాంటి కదలికలు లేకపోవడం కూడా అనుమానాలకు ఆస్కారం ఇస్తోంది. అదేసమయంలో  భువనేశ్వరి తన వాట్సాప్‌లో 6.50 గంటలకు ఒక పోస్టు పంపింది. ఇక తన వాట్సాప్‌ పని చేయదని, ఎవ్వరూ చూడవద్దని అందులో పేర్కొంది. తాలూకా సీఐ శివరామకృష్ణారెడ్డి, టూటౌన్‌ సీఐ రాజేష్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. 


Updated Date - 2020-12-20T03:48:26+05:30 IST