మంత్రులు ఏం చేసినా..కేసులు ఉండవా?

ABN , First Publish Date - 2020-07-22T08:16:41+05:30 IST

రాష్ట్రంలో మంత్రులు ఎన్ని తప్పులు చేసినా వారిపై చర్యలు ఉండవా అని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నిలదీశారు.

మంత్రులు ఏం చేసినా..కేసులు ఉండవా?

 ‘తమిళనాడులో వాహనాల తనిఖీలో దొరికిన రూ.5 కోట్ల నగదు మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డిదేనని తమిళ మీడియా ఘోషించింది. అంత నగదుతో చేసే వ్యాపారం.. ఒంగోలు బంగారం వ్యాపారికి ఉందా? సంఘటన స్ధలం నుంచి పారిపోయిన వారిలో మంత్రి కొడుకు కూడా ఉన్నారా? బంగారం వ్యాపారంలో బాలినేని భాగస్తుడా?’


‘దాడికి గురైన దళిత మేజిస్ట్రేట్‌కు న్యాయం చేయాల్సింది పోయి వాడెవడని దూషించిన మంత్రి  పెద్దిరెడ్డిని బర్తరఫ్‌ చేయాలి.’


‘అన్న క్యాంటీన్లలో మనం రూ.5కే నాణ్యమైన భోజనం పెట్టాం. ఇప్పుడు రూ.500 ఇస్తున్నా క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉడికీ ఉడకని అన్నం, నీళ్ల సాంబారు ఇస్తున్నారు.’


బాలినేని, పెద్దిరెడ్డిని బర్తరఫ్‌ చేయాలి: చంద్రబాబు

తమిళనాడులో దొరికిన నగదుపై ఈడీ దర్యాప్తు చేయాలి

మా వాళ్ల అరెస్టుకైతే పరుగులు.. వైసీపీ నేతలైతే చచ్చుబడతారా?

వేల సంఖ్యలో కరోనా కేసులు.. అయినా ఆస్పత్రుల్లో సన్నద్ధత శూన్యం

క్వారంటైన్‌ కేంద్రాల్లో నాసిరకం తిండి.. బాధితులు అల్లాడుతున్నారు

మహిళలు, దళితులపై ఎన్నో దాడులు..  సీఎం జగన్‌ స్పందించరేం?

కష్టకాలంలో ప్రజలపై 50 వేల కోట్ల భారం

ఉన్న కార్పొరేషన్లకే దిక్కు లేదు..కొత్తవి పెట్టి ఏం చేస్తారు: టీడీపీ అధినేత


అమరావతి, జూలై 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మంత్రులు ఎన్ని తప్పులు చేసినా వారిపై చర్యలు ఉండవా అని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నిలదీశారు. టీడీపీ నేతలను అరెస్టు చేయడానికి, జైళ్లకు పంపడానికి పరుగులు తీసే ప్రభుత్వ యంత్రాంగం.. అధికార పార్టీ నేతల విషయంలో చచ్చుబడినట్లు వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల టీడీపీ ఇన్‌చార్జులు, ముఖ్య నేతలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ‘తమిళనాడులో వాహనాల తనిఖీలో దొరికిన రూ. ఐదు కోట్ల నగదు మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డిదేనని తమిళ మీడియా ఘోషించింది. అది హవాలా డబ్బని... ఎర్ర చందనం స్మగ్లర్ల డబ్బని తమిళ ఛానళ్ళు వార్తలు ప్రసారం చేశాయి. కరోనా సమయంలో అంత డబ్బు ఎక్కడిది? ఇంత నగదుతో  చేసే వ్యాపారం ఒంగోలు బంగారం వ్యాపారికి ఉందా? పట్టుబడ్డ వారు దుకాణం ఉద్యోగులా లేక మంత్రి బాలినేని అనుచరులా? సంఘటన స్ధలంలో పారిపోయిన వారు ఎవరు? వారిలో మంత్రి కొడుకు కూడా ఉన్నారా? బంగారం వ్యాపారంలో బాలినేని భాగస్తుడా? ఈ ప్రశ్నలకు ముఖ్యమంత్రి జగన్‌ సమాధానం చెప్పాలి. ఈ హవాలా బాగోతంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణ జరపాలి.


ఈ 14 నెలల్లో జరిగిన హవాలా వ్యవహారాలపై కూడా లోతుపాతులు తెలుసుకోవాలి. బాలినేనిని బర్తరఫ్‌ చేయాలి’ అని డిమాండ్‌ చేశారు. దాడికి గురైన దళిత మేజిస్ట్రేట్‌కు న్యాయం చేయాల్సింది పోయి.. వాడెవడని దూషించిన మంత్రి పెద్దిరెడ్డిపై కూడా ఏ కేసూ పెట్టలేదని ఆక్షేపించారు. పెద్దిరెడ్డిని కూడా మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేయాలన్నారు. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆధారాలు తుడిచేసిన వారిని... మృతదేహానికి కట్లు కట్టిన వారిని అరెస్టు చేయలేదని, కావలిలో ఎన్టీఆర్‌ విగ్రహ తొలగింపును ప్రశ్నించిన ఒక వృద్ధురాలిపై మాత్రం కేసు పెట్టారని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ కట్టడికి ప్రభుత్వం ఒక వ్యూహమంటూ లేకుండా పనిచేస్తోందని, దీంతో మూడు రోజుల్లోనే 13 వేలకు పైగా కేసులు వచ్చాయని చంద్రబాబు తెలిపారు. ‘రోగులను ఆస్పత్రుల్లో చేర్చుకోవడం లేదు. చేర్చుకున్నవారికి సరైన ఆహారం ఇవ్వలేకపోతున్నారు. ఆక్సిజన్‌ సరఫరా సవ్యంగా లేదు. అంబులెన్సుల నిర్వహణ అధ్వానంగా ఉంది. ఒక్కో అంబులెన్సులో డజన్ల కొద్దీ కుక్కుతున్నారు.


అన్న క్యాంటీన్లలో మనం రూ.5కే నాణ్యమైన భోజనం పెట్టాం. ఇప్పుడు రూ.500 ఇస్తున్నా క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉడికీ ఉడకని అన్నం, నీళ్ల సాంబారు ఇస్తున్నారని రోగులు ఫిర్యాదు చేస్తున్నారు. డిశ్చార్జి అయి వెళ్లిపోయే సమయంలో ఒక్కొక్కరికీ రూ.2 వేలు ఇస్తామని.. ఇప్పుడు యాభయ్యో, వందో చేతిలో పెట్టి పంపిస్తున్నారు. ఇంత పెద్ద అనారోగ్య సమస్యలో అనుసరించాల్సిన వైఖరి ఇది కాదు’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో దళితులు, మహిళలపై దాడులు, అత్యాచార ఘటనలు పెచ్చుమీరిపోతుండడంపై టీడీపీ  సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. కష్టాల్లో ఉన్నవారికి నేతలు అండగా నిలిచి ధైర్యం చెప్పాలని, అధికార యంత్రాంగాన్ని నిలదీయాలని చంద్రబాబు పిలుపిచ్చారు.

Updated Date - 2020-07-22T08:16:41+05:30 IST