‘చలో మదనపల్లె’ భగ్నం

ABN , First Publish Date - 2020-10-03T07:23:35+05:30 IST

వైసీపీ ప్రభుత్వంలో దళితులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ దళిత సంఘాలు, వామపక్షాలు, టీడీపీ పిలుపు మేరకు శుక్రవారం జరగాల్సిన

‘చలో మదనపల్లె’  భగ్నం

ఎక్కడికక్కడ నేతల అడ్డగింత

టీడీపీ, లెఫ్ట్‌, దళిత నేతల 

అరెస్టు, గృహ నిర్బంధాలు

తిరుపతిలో శ్రావణ్‌ కుమార్‌,

జడ్జి రామకృష్ణల నిర్బంధం

  


తిరుపతి, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వంలో దళితులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ దళిత సంఘాలు, వామపక్షాలు, టీడీపీ పిలుపు మేరకు శుక్రవారం జరగాల్సిన ‘చలో మదనపల్లె’ కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. చిత్తూరు జిల్లావ్యాప్తంగా టీడీపీ, వామపక్షాలు, దళిత సంఘాల నేతలను అడ్డుకున్నారు. నేతలను అరెస్టు చేయడంతోపాటు కొందరిని గృహ నిర్బంధం చేశారు. దీంతో జిల్లాలోని పలు చోట్ల నుంచి బయలుదేరిన నాయకులు మదనపల్లెకు  చేరుకోలేకపోయారు. చలో మదనపల్లె కార్యక్రమంలో పాల్గొనేందుకు గురువారం రాత్రే తిరుపతి నగరానికి చేరుకున్న న్యాయవాది శ్రావణ్‌కుమార్‌ స్థానిక గ్రాండ్‌ రిడ్జ్‌ హోటల్‌లో దిగారు.


 శుక్రవారం ఉదయం ఆయన్ను కలసి మదనపల్లె వెళ్లేందుకు జడ్జి రామకృష్ణ అక్కడికి వచ్చారు. సత్యవేడు టీడీపీ ఇన్‌చార్జి జేడీ రాజశేఖర్‌తో పాటు వారిరువురూ కలసి మదనపల్లె వెళ్లేందుకు బయల్దేరుతుండగా భారీ సంఖ్యలో వచ్చిన పోలీసులు వారిని హోటల్‌ నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఏఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారులు హోటల్‌ వద్దకు చేరుకుని బ్యారికేడ్లు ఏర్పాటు చేయిం చి రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. సమాచారం అందుకున్న మాజీ మంత్రి పరసా రత్నం, తుడా మాజీ చైర్మన్‌ నరసింహయాదవ్‌ సహా టీడీపీ నేతలు ఆర్‌సీ మునికృష్ణ, శ్రీధరవర్మ, దళిత సంఘాల నేతలు హోటల్‌ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు.


మరోవైపు రిపబ్లికన్‌ పార్టీ సహా దళిత సంఘాల నేతలు ఆర్టీసీ బస్టాండు ఎదుట అంబేడ్కర్‌ విగ్రహం కూడలిలో ధర్నా చేపట్టారు. ఎట్టకేలకు మధ్యాహ్నం 2 గంటల తర్వాత పోలీసులు జడ్జి రామకృష్ణ, న్యాయవాది శ్రావణ్‌కుమార్‌లను హోటల్‌ నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతించారు. అప్పటికే మదనపల్లెలో నిరసన కార్యక్రమానికి సమయం దాటిపోయింది.


30 మంది అరెస్టు.. విడుదల

మదనపల్లెలో సీపీఐ, బీఎ్‌సపీ, మాలమహానాడులకు చెందిన ఆందోళనకారులు ఉదయం ఆర్టీసీ బస్టాం డు సమీపంలోని అంబేడ్కర్‌ విగ్రహం కూడలికి చేరుకుని నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సమయంలో పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. 30 మందిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. అక్రమ నిర్బంధాన్ని నిరసిస్తూ ఆందోళనకారులు నినాదాలు చేస్తూ స్టేషన్‌లో బైఠాయించారు.


డీఎస్పీ రవి మనోహరాచారి వారితో చర్చించారు. అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించేందుకు అనుమతించారు. అయితే, సబ్‌ కలెక్టరేట్‌కు ర్యాలీగా వెళ్లేందుకు ఆందోళనకారులు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. తర్వాత పోలీసులే వారిని వాహనాల్లో సబ్‌ కలెక్టరేట్‌కు చేర్చారు. అక్కడ సబ్‌ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. తర్వాత పోలీసులు వారిని ఇళ్ల వద్ద విడిచిపెట్టారు. 



పోలీసులది ఏకపక్షం: జడ్జి రామకృష్ణ

దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టే క్రమంలో తాము చేపట్టిన ‘చలో మదనపల్లె’ న్యాయా న్ని పోలీసులకు గుర్తుచేయడం కోసమే నిర్వహించామని జడ్జి రామకృష్ణ అన్నారు. పోలీసులు చట్టాన్ని, న్యాయాన్ని తుంగలో తొక్కి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.   

పెద్దిరెడ్డి దగ్గరకు వస్తే న్యాయం: ఎంపీ రెడ్డప్ప

‘‘మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై అనవసరంగా ఆరోపణలు చేయడం జడ్జి రామకృష్ణకు తగదు. ఆయన పెద్దరెడ్డి దగ్గరకు వస్తే న్యాయం జరిగేలా చూస్తా’’ అని చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప సూచించారు. దళితులపై జరుగుతున్న దాడులకు మంత్రి పెద్దిరెడ్డికి సంబంధం ఉందని నిరూపిస్తే తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానన్నారు. 


Updated Date - 2020-10-03T07:23:35+05:30 IST