అమరావతే రాజధానిగా ఉండాలి: చలసాని

ABN , First Publish Date - 2020-12-30T20:43:46+05:30 IST

రాష్ట్ర విభజనతో ఆంద్రప్రదేశ్‌కి అన్యాయం జరిగిందని ప్రత్యేక హోదా సాధన కమిటీ అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ అన్నారు

అమరావతే రాజధానిగా ఉండాలి: చలసాని

అమరావతి: రాష్ట్ర విభజనతో ఆంద్రప్రదేశ్‌కి అన్యాయం జరిగిందని ప్రత్యేక హోదా సాధన కమిటీ అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ అన్నారు. అమరావతిలో రైతులను కలిసి అమరావతి ఉద్యమానికి చలసాని శ్రీనివాస్ మద్దతు తెలిపారు. మందడంలో అమరావతి ఉద్యమకారులను పరామర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘రాష్ట్రం విడిపోయాక ఎన్నో ఇబ్బందుల్లో అమరావతి రాజధానిగా ప్రకటించారు. ఆనాడు ప్రతిపక్షంతో సహా అన్ని రాజకీయ పార్టీలు అమరావతి రాజధానిగా అంగీకరించాయి. నా లాంటి వాళ్ళు రాజమండ్రి రాజధానిగా ఉండాలని కోరుకున్నాం. వైసీపీ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులు, 13 రాజధానులు అని మాట్లాడటం సరికాదు. మాకు అభివృద్ధి వికేంద్రీకరణ ముఖ్యం. హిందూపురం నుంచి ఇచ్ఛాపురం వరకు అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి’ అని ఆకాంక్షించారు. 


‘అమరావతి ఒక గొప్ప నగరంగా అభివృద్ధి చెందుతుంది. ఆ నాడు 30 వేల ఎకరాలు కావాలని జగన్ అన్నారు. రాజధాని అనేది రాష్ట్రానికి మధ్యలో ఉండాలి అన్నారు. ఈనాడు ముఖ్యమంత్రి ఎందుకు వెనకడుగు వేస్తున్నారో తెలియడం లేదు. అమరావతిలో ప్రారంభమైన భవనాలకు మరో 10 వేల కోట్లు వెచ్చిస్తే అవి పూర్తి అవుతాయి. అమరావతి ఉద్యమంలో రైతులు చనిపోయినా జగన్ పట్టించుకోవడం లేదు. ఆత్మ క్షోభతో రైతులు చనిపోతే వారిని హేళన చెయ్యడం సరికాదు. అమరావతి స్మశానం, ఎడారి, ముంపు ప్రాంతం అన్నారు. ఇలాంటి చోట పేదలకి ఇళ్ల స్థలాలు ఎలా ఇవ్వాలనుకున్నారు..?’ అని చలసాని ప్రశ్నించారు.

Updated Date - 2020-12-30T20:43:46+05:30 IST