రాజధానిపై కేంద్రానిది అదే పాట!

ABN , First Publish Date - 2020-08-20T08:21:05+05:30 IST

రాష్ట్ర రాజధానిపై కేంద్ర పభుత్వం పాతపాటే పాడింది. రాజధానిని సంబంధిత రాష్ట్రప్రభుత్వమే నిర్ణయిస్తుందని, ఈ విషయంలో తమ పాత్ర లేదని మరోసారి హైకోర్టుకు నివేదించింది. అదే విధంగా ఏపీసీఆర్‌డీఏను రద్దు చేస్తూ కొత్తం చట్టానికి రూపకల్పన చేసేటప్పుడు రాష్ట్రప్రభుత్వం తమను సంప్రదించలేదని స్పష్టం చేసింది...

రాజధానిపై కేంద్రానిది అదే పాట!

  • రాజధానిపై నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదే.. ఇందులో మా పాత్ర లేదు
  • సీఆర్‌డీఏ రద్దు చట్టం చేసేటప్పుడు మమ్మల్ని సంప్రదించలేదు
  • ఈ వ్యవహారం పూర్తిగా రాష్ట్రానిదే.. ఇందులో మాకు భాగం లేదు
  • హైకోర్టుకు మరోమారు కేంద్రం నివేదన.. హోం శాఖ అఫిడవిట్‌

అమరావతి, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజధానిపై కేంద్ర పభుత్వం పాతపాటే పాడింది. రాజధానిని సంబంధిత రాష్ట్రప్రభుత్వమే నిర్ణయిస్తుందని, ఈ విషయంలో తమ పాత్ర లేదని  మరోసారి హైకోర్టుకు నివేదించింది. అదే విధంగా ఏపీసీఆర్‌డీఏను రద్దు చేస్తూ కొత్తం చట్టానికి రూపకల్పన చేసేటప్పుడు రాష్ట్రప్రభుత్వం తమను సంప్రదించలేదని స్పష్టం చేసింది. ఈ వ్యవహారం పూర్తిగా రాష్ట్రప్రభుత్వానికి చెందినదని, అందులో కేంద్రం భాగం కాలేదని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన సీఆర్‌డీఏ రద్దు చట్టం, పాలనా వికేంద్రీకరణ చట్టాన్ని సవాల్‌ చేస్తూ గుంటూరు జిల్లా యర్రబాలెం గ్రామానికి చెందిన డి.సాంబశివరావు, ఐనవోలుకు చెందిన టి.శ్రీనివాసరావు పిటిషన్‌ దాఖలు చేయగా.. హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర హోం శాఖ అండర్‌ సెక్రటరీ లలిత టి.హెడావు పై అంశాలతో బుధవారం కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేయాలని అభ్యర్థిస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై కేంద్రం ఇటీవల దాఖలు చేసిన కౌంటర్‌లోనూ.. రాష్ట్ర రాజధాని నిర్ణయంలో తమకెలాంటి ప్రమేయం ఉండదని పేర్కొన్న విషయం తెలిసిందే.


Read more