ఏపీకి కేంద్ర బృందాలు!

ABN , First Publish Date - 2020-04-24T07:46:44+05:30 IST

రాష్ట్రంలో కరోనా కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుండటాన్ని కేంద్రం సీరియ్‌సగా తీసుకుంది. వివిధ రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ అమలు తీరును సమీక్షించేందుకు నియమించిన ఐఎంసీటీ (ఇంటర్‌ మినిస్టీరియల్‌ సెంట్రల్‌ టీం)లను ఏపీకి పంపనున్నట్లు...

ఏపీకి కేంద్ర బృందాలు!

  • కేసులు భారీగా పెరగడంపై కేంద్రం సీరియస్‌ 
  • వైసీపీ ఎమ్మెల్యేల లాక్‌డౌన్‌ ఉల్లంఘనపై ఫిర్యాదులు 
  • ఐఎంసీటీ నివేదిక తర్వాత రంగంలోకి సీఆర్‌పీఎఫ్‌? 

అమరావతి, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుండటాన్ని కేంద్రం సీరియ్‌సగా తీసుకుంది. వివిధ రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ అమలు తీరును సమీక్షించేందుకు నియమించిన ఐఎంసీటీ (ఇంటర్‌ మినిస్టీరియల్‌ సెంట్రల్‌ టీం)లను ఏపీకి పంపనున్నట్లు తెలిసింది. ఈ బృందాలు ఇచ్చే నివేదిక ఆధారంగా సీఆర్‌పీఎ్‌ఫను రంగంలోకి దించే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాష్ట్రంలోని ఎక్కువ ప్రాంతాల్లో కరోనా ప్రభావం లేదంటూ ఇటీవల జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీకు సీఎం జగన్‌ వివరించారు. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. కర్నూలు, గుంటూరు జిల్లాల్లో కేసుల గ్రాఫ్‌ నానాటికీ దూసుకుపోతోంది. గురువారం ఒక్కరోజే 80 కొత్త కేసులు నమోదవడంతో కేంద్రం అప్రమత్తమైంది. ఇప్పటికే మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌కు పంపిన బృందాలను రాష్ట్రానికి కూడా పంపాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఆ బృందాలు ఇచ్చే సమాచారం ఆధారంగా ఇక్కడకు తరలించేందుకు సీఆర్‌పీఎఫ్‌ బలగాలను హైదరాబాద్‌లో సిద్ధం చేసింది. కరోనా విషయంలో మొదటి నుంచి తక్కువ తీవ్రత వైపు మొగ్గిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ అదే ధోరణిలో ఉన్నట్లు కేంద్రం అనుమానిస్తోంది.  .రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 900కు చేరువ కావడంతో పాటు కర్నూలులో కొన్ని మానవ తప్పిదాలపై ఆరోపణలు రావడాన్ని కూడా కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోంది. ప్రభుత్వం చెబుతున్న లెక్కలు సరైనవేనా అంటూ ఆరా తీయడంతో కొన్ని బులెటిన్లలో అంకెల వ్యత్యాసం కనిపించింది.


వాటిని ఎత్తిచూపుతూ బీజేపీ నేతలు అమిత్‌ షా కార్యాలయానికి ఈ-మెయిళ్లు పంపారు. వీటిపై మరింత కూపీ లాగిన కేంద్రం తమ బృందాలను పంపేందుకు సిద్ధమైంది. గుంటూరు, కర్నూలు, తిరుపతితో పాటు మరిన్ని ప్రాంతాల్లో పర్యటించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఈ బృందాలు ఇచ్చే నివేదిక ఆధారంగా సీఆర్‌పీఎ్‌ఫను రాష్ట్రంలోకి పంపనున్నట్లు సమాచారం. కాగా, స్థానిక పరిస్థితుల నేపథ్యంలో చాలాచోట్ల పోలీసులు చూసీ చూడనట్లు వదిలేస్తున్నారని, లాక్‌డౌన్‌ నిబంధనలను నిక్కచ్చిగా అమలు చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకోనుంది. 


Updated Date - 2020-04-24T07:46:44+05:30 IST