మీరిచ్చినవి పేదలకు చేరట్లేదు

ABN , First Publish Date - 2020-04-05T09:10:13+05:30 IST

లాక్‌డౌన్‌ సమయంలో పేదలను ఆదుకోడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజి ఏపీలో పేదలకు అందడం లేదని కేంద్రానికి టీడీపీ ఫిర్యాదు చేసింది. పేదలకు నిత్యావసరాలు సరిగా అందేలా కేంద్రం చర్యలు

మీరిచ్చినవి పేదలకు చేరట్లేదు

  • ధరల అదుపులోనూ రాష్ట్ర ప్రభుత్వం విఫలం
  • కేంద్రానికి తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు


అమరావతి, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ సమయంలో పేదలను ఆదుకోడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజి ఏపీలో పేదలకు అందడం లేదని కేంద్రానికి టీడీపీ ఫిర్యాదు చేసింది. పేదలకు నిత్యావసరాలు సరిగా అందేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు శనివారం లేఖ రాశారు. ‘లాక్‌డౌన్‌ వల్ల పేదలు, రోజువారీ కూలీలు అవస్థలు పడకుండా చూడటానికి బియ్యం, పప్పు, ఒక గ్యాస్‌ సిలిండర్‌ ఉచితంగా ఇవ్వాలని కేంద్రం తీసుకొన్న నిర్ణయం అభినందనీయం. కానీ, కేంద్రం ప్రకటించిన సరుకుల్లో ఇప్పటివరకూ రాష్ట్రంలో ఒక్కరికి కూడా ఉచితంగా వాటిని ఇచ్చిన దాఖలాలు లేవు’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. అసంఘటిత కార్మికులు బాగా అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ ఒకటని, ఇటీవల ఇసుక కొరతతో 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడగా, ఇప్పుడు లాక్‌డౌన్‌ కారణంగా వారు మళ్లీ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, రెండు వారాల కిందట కంటే ధరలు విపరీతంగా పెరిగిపోయాయని పేర్కొన్నారు. పింఛన్లలోనూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేరుతో వలంటీర్లు కోత పెడుతున్నారని, రేషన్‌ కింద ఇవ్వాల్సిన బియ్యం, పప్పుల్లోనూ కోత విధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ప్రజల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకొని కేంద్ర ప్యాకేజీ రాష్ట్రంలోని ప్రతి పేదవాడికీ అందేలా చూడాలని కళా విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2020-04-05T09:10:13+05:30 IST