పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై కేంద్రం కొత్త ట్విస్ట్!

ABN , First Publish Date - 2020-10-31T18:43:24+05:30 IST

పోలవరం సీమాంధ్రుల జల-జీవ నాడి.. అటు ఉత్తరాంధ్రకు, ఇటు రాయలసీమకూ

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై కేంద్రం కొత్త ట్విస్ట్!

అమరావతి : పోలవరం సీమాంధ్రుల జల-జీవ నాడి.. అటు ఉత్తరాంధ్రకు, ఇటు రాయలసీమకూ జలాధారం!. అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణం విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం నెలకొంది. దీంతో అసలు ఈ ప్రాజెక్టు ముందుకు కదులుతుందా..? లేదా..? అనే అనుమానాలు వస్తున్నాయి. మరోవైపు ఏపీలో ఇదే విషయమై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ పరిస్థితికి మీరే కారణమంటే.. కాదు కాదు మొత్తం మీరే చేశారంటూ అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శలు గుప్పించుకుంటున్నారు. అయితే తాజాగా.. అవసరమైతే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను కేంద్రానికే అప్పగిస్తామని.. నాడు కమీషన్లకోసమే చంద్రబాబు ఈ ప్రాజెక్టును తీసుకున్నారన్నట్లుగా వైసీపీ సర్కారు పెద్దల తాజా వైఖరి ఉంది.


ఇదీ కొత్త ట్విస్ట్!

ఇలాంటి తరుణంలో పోలవరం నిర్మాణంపై కేంద్రం మరో కొత్త ట్విస్ట్ ఇచ్చింది. ఈ ట్విస్ట్‌తో పోలవరం అసలుకే ఎసరు వచ్చే పరిస్థితులున్నాయి. లెక్కలు చెబితేనే మిగతా రూ.9,288 కోట్లు మాత్రమే చెల్లిస్తామని కేంద్రం తేల్చి చెప్పేసింది. పోలవరం కోసం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించినట్టు కేంద్రానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. అందుకే వీటన్నింటినీ పరిగణనలోనికి తీసుకున్న కేంద్రం తాజాగా ఈ ట్విస్ట్‌ను ఇచ్చింది. నవంబర్-02న సమావేశంలో కేంద్రం ఈ నిర్ణయాన్ని బహిర్గతం చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అయితే.. తక్షణమే ఇవ్వాల్సిన రూ.2,234 కోట్లపై కూడా షరతులతో మెలిక పడినట్లయ్యింది. ఈ మేరకు కేంద్ర జలశక్తిశాఖకు ఆర్థికశాఖ వర్తమానం కూడా పంపినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. కేంద్రం కాలయాపన కోసమే ఇలాంటి ఎత్తుగడలు వేస్తోందంటూ ఏపీ ప్రభుత్వం సందేహాలు వ్యక్తం చేస్తోంది. మరి ఇందులో నిజానిజాలెంత అనేది నవంబర్-02న తేలిపోనుంది.




అదే జరిగితే..!

పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అవసరమైతే కేంద్రానికే అప్పగించేస్తామని ఇటీవలే రాష్ట్ర పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పడం చర్చనీయాంశమైంది. అదే జరిగితే పోలవరం నిర్మాణం ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం ఉండదని సాగునీటి రంగ నిపుణులు చెబుతున్నారు. కేంద్రం సత్వర సాగునీటి పథకం (ఏఐబీపీ) కింద గతంలో గుర్తించిన 15 జాతీయ సాగునీటి, జలవిద్యుత్‌ ప్రాజెక్టుల నిర్మాణ దుస్థితిని గుర్తుచేస్తున్నారు. ఏఐబీపీ కింద గుర్తించిన జాతీయ ప్రాజెక్టులకు 90 శాతం నిధులను కేంద్రం భరిస్తే.. మిగిలిన పదిశాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చుచేయాలి. పోలవరం సహా.. దేశవ్యాప్తంగా 16 జాతీయ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చాలని కేంద్రం గతంలో నిర్ణయించింది.


షాకుల మీద షాక్‌లు!

మొన్నటికి మొన్న ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన నిధులను మాత్రమే ఇస్తామని చెప్పిన కేంద్రం.. పునరావాసంతో తమకు సంబంధం లేదని  తేల్చింది. అంతేకాదు.. 2013 -2014 అంచనా వ్యయం ప్రకారం మాత్రమే నిధులను ఇస్తామని కూడా స్పష్టం చేసేసింది. నిన్న ఏకంగా పోలవరం ప్రాజెక్టు విషయంలో నిధులకు కోత పెట్టే మరో నిర్ణయం తెరపైకి తీసుకువచ్చింది. ఇలా కేంద్రం తీసుకుంటున్న వరుస నిర్ణయాలతో ఏపీ సర్కార్‌కు గట్టి షాక్‌లు తగులుతున్నాయి. ఇవన్నీ అటుంచితే ఇప్పుడు ఏకంగా ఏపీ సర్కార్ ఊహించని విధంగా కేంద్రం ట్విస్ట్ ఇచ్చింది. అయితే ఇప్పటి వరకూ ఈ వివాదంపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించిన దాఖలాల్లేవ్. ఇంత జరిగిన తర్వాత కూడా కేంద్రం తీరుపై స్పందిస్తారా..? లేకుంటే మిన్నకుండిపోతారా..? అనేది తెలియాల్సి ఉంది.

Updated Date - 2020-10-31T18:43:24+05:30 IST