కేంద్రం మార్గదర్శకాల ప్రకారమే ఆ నిబంధన
ABN , First Publish Date - 2020-10-21T08:12:05+05:30 IST
వరదపీడిత ప్రాంతాల్లోని బాధితులకు మానవతా దృక్పథంతో ఆర్థిక సహాయంతోపాటు నిత్యావసరాలను అందిస్తున్నామని రెవెన్యూ, విపత్తు శాఖ ముఖ్యకార్యదర్శి వి.ఉషారాణి తెలిపారు.

‘వారం ముంపు’పై విపత్తుశాఖ వివరణ
అమరావతి, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): వరదపీడిత ప్రాంతాల్లోని బాధితులకు మానవతా దృక్పథంతో ఆర్థిక సహాయంతోపాటు నిత్యావసరాలను అందిస్తున్నామని రెవెన్యూ, విపత్తు శాఖ ముఖ్యకార్యదర్శి వి.ఉషారాణి తెలిపారు. ‘వారం ముంపులో ఉంటేనే బియ్యం, పప్పులు’ శీర్షికన మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’లో వార్త ప్రచురితమైన సంగతి తెలిసిందే. జీవో 19లో పేర్కొన్న అంశాలపై విమర్శలు వస్తుండటంతో ఆమె ‘ఆంధ్రజ్యోతి’కి వివరణ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రకటించిన మార్గదర్శకాలకు అనుగుణంగానే వారంపైనే నీటిలో మునిగి ఉండాలన్న నిబంధనను ఉత్తర్వుల్లో చేర్చామని ఆమె తెలిపారు. ‘వరద, విపత్తుల సమయంలో బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వు జారీ చేసినా, అది కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగానే ఉంటుంది.
వారం నిబంధన కూడా కేంద్రం ఇచ్చిన మార్గదర్శకమే. కేంద్రం నుంచి సహాయం పొందాలంటే.. తమ మార్గదర్శకాలను అమలు చేశారా? లేదా? అన్నది పరిశీలన చేస్తారు. అందుకే ఈ నిబంధనను జీవో 19లో పేర్కొన్నాం’ అని వివరించారు. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఇప్పటికే అనేక రకాల సహాయాలు అందిస్తోందని, వీటికి అదనంగా బాధితులకు తక్షణ అవసరాల కింద రూ. 500 ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఆమె తెలిపారు.
నాలుగు జిల్లాల్లో కేజీ ఉల్లి.. కేజీ దుంపలు..
ఇదిలా ఉండగా, కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లోని వరద బాధితులకు కేజీ ఉల్లి, కేజీ బంగాళదుంపలు అందించే ందుకు పౌరసరఫరాల శాఖకు వెంటనే వాటిని సరఫరా చేయాలని మార్కెటింగ్ శాఖను విపత్తు శాఖ ఆదేశించింది. ఈ మేరకు నాలుగు జిల్లాల కలెక్టర్ల నుంచి వచ్చే ఇండెంట్లకు తగినట్లుగా సరుకులు అందించాలని ఆదే శిస్తూ విపత్తు శాఖ ఉత్తర్వులు ఇచ్చింది.