ఆన్‌లైన్‌పై ఏ లైన్?
ABN , First Publish Date - 2020-07-10T08:11:31+05:30 IST
కరోనా సమయంలో తరగతి గదుల తలుపులు మూసుకుపోయాయి. ఇప్పట్లో తెరుచుకునే అవకాశాలు కనిపించడంలేదు. మరి....

- చదువులు చెప్పాలా.. వద్దా!
- ఆన్లైన్ బోధనకు కేంద్రర ఓకే
- డిస్టెన్స్ లెర్నింగ్ ప్రోత్సహించాలని
- ‘అన్‌లాక్-2’ మార్గదర్శకాలు
- ఆ మేరకు రాష్ట్రంలోనూ ఆదేశాలు
- జిల్లాల్లో మాత్రం భిన్నమైన వైఖరి
- ఆన్లైన్ పాఠాలు చెబితే కొరడా!
- ‘సవరణ’తో తాజా ఉత్తర్వులు
- డిస్టెన్స్ లెర్నింగ్‌కు ఆమోదం
- పరీక్షలు, ర్యాంకులు మాత్రం వద్దు
(అమరావతి/తిరుపతి - ఆంధ్రజ్యోతి)
కరోనా సమయంలో తరగతి గదుల తలుపులు మూసుకుపోయాయి. ఇప్పట్లో తెరుచుకునే అవకాశాలు కనిపించడంలేదు. మరి.... పిల్లలకు ఆన్లైన్లోనైనా చదువులు చెప్పాలా? చెప్పొద్దా? ప్రశ్న ఒక్కటే! కానీ... సమాధానాలు మాత్రం పలురకాలు! ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు ఒక రకమైన బోధన, ప్రైవేట్ స్కూళ్ల విద్యార్థులకు మరో రకమైన బోధన నడుస్తోంది. కరోనా నేపథ్యంలో.... ఆన్లైన్ బోధనను ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అన్‌లాక్-2 గైడ్‌లైన్స్‌ను అనుసరించి జూలై 31 దాకా అన్ని బడులు, కాలేజీలు, విద్యాసంస్థలు మూసేయాలని... వీటిల్లో ఆన్లైన్ బోధన కొనసాగేలా ప్రోత్సహించాలని సోమవారం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ఫోన్, రేడియో, ఎస్ఎంఎస్, టీవీ సహా ఇతర సోషల్ మీడియా ద్వారా టీచర్లు విద్యార్థులను గైడ్ చేయవచ్చని తెలిపింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విద్యాసంస్థలు ప్రత్యామ్నాయంగా ఆన్లైన్ విద్యాబోధన మార్గాన్ని అనుసరించాలని యునిసెఫ్ కూడా గతంలోనే సూచించింది. కానీ, రాష్ట్రంలో మాత్రం జిల్లాల్లో ఇందుకు భిన్నమైన ఆదేశాలు వెలువడుతున్నాయి. ఆన్లైన్లో తరగతులు నిర్వహించరాదని, నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని, గుర్తింపు రద్దు చేస్తామని పలు జిల్లాల విద్యాఽధికారులు హెచ్చరికలు జారీచేశారు. అటు మంత్రులు కూడా ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దీంతో చాలాచోట్ల ప్రైవేట్ స్కూళ్ల మేనేజ్మెంట్లు విద్యార్థులకు ఆన్లైన్ తరగతులను నిలిపేశాయి. విచిత్రం ఏమిటంటే... ఈ నెల 5న పాఠశాల విద్య కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు పేరుతో ఒక ఉత్తర్వు వెలువడింది. ప్రభుత్వ బడులు తిరిగి తెరిచే దాకా బ్రిడ్జ్ కోర్సులు నిర్వహించాలని, సాంకేతిక సదుపాయం ఉన్న విద్యార్థులకు ఆన్లైన్లో క్లాసులు ఉండాలని, లేని వారిని బృందాలుగా ఏర్పరిచి టీచర్లకు బాధ్యత అప్పగించాలని అందులో సూచించారు. ప్రభుత్వ బడుల్లో ఆన్లైన్ చదువులను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం... ప్రైవేటు బడుల విషయంలో మాత్రం భిన్నమైన ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.
మరో ఉత్తర్వు...
ఆన్లైన్ చదువులపై గందరగోళం కొనసాగుతుండగా... గురువారం పాఠశాల విద్య కమిషనర్ మరో ఉత్తర్వు జారీ చేశారు. ‘ఆన్లైన్ విధానంలో విద్యార్థులకు ఎలాంటి టెస్ట్‌లు పెట్టరాదు. ర్యాంకులు ఇవ్వరాదు. ప్రభుత్వం తరహాలో దూరవిద్యా బోధన చేపట్టాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతో స్మార్ట్ ఫోన్ల ద్వారా సంక్షిప్త సందేశాలు, సామాజిక మాధ్యమాలు, రేడియో, టీవీ, ఇతర సాధనాల ద్వారా విద్యా కార్యక్రమాలు నిర్వహించాలి’ అని ప్రైవేట్ పాఠశాలలకు స్పష్టం చేశారు. కొవిడ్ మహమ్మారి వల్ల పాఠశాలల పున: ప్రారంభం వాయిదా పడిన నేపథ్యంలో.. అప్పటి వరకు అనుసరించాల్సిన ప్రత్యామ్నాయ విద్యా క్యాలెండర్‌ను ఆయన గురువారం విడుదల చేశారు. ఇందులో భాగంగా 1 నుంచి 10 తరగతుల విద్యార్థులకు దూరదర్శన్ ద్వారా విద్యా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఆదేశాలను పరిశీలిస్తే... ఆన్లైన్ తరగతుల నిర్వహణకు ప్రభుత్వం అంగీకరించిందనే భావించాలి.