కరోనాపై కేంద్రం ఆరా

ABN , First Publish Date - 2020-05-09T09:55:57+05:30 IST

కరోనా వైరస్‌ పరిస్థితిని అంచనా వేయడానికి కేంద్ర బృందం రాష్ట్రంలో అడుగుపెట్టింది.

కరోనాపై కేంద్రం ఆరా

రాష్ర్టానికి చేరిన బృందం.. పరిస్థితిపై అధికారులతో చర్చలు

నేటి నుంచి జిల్లాల్లో పర్యటన


అమరావతి, మే 8(ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ పరిస్థితిని అంచనా వేయడానికి కేంద్ర బృందం రాష్ట్రంలో అడుగుపెట్టింది. అత్యధిక కేసులు నమోదవుతున్న కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఈ బృందం సభ్యులు ఇద్దరు చొప్పున పర్యటించి కేంద్రానికి నివేదిక సమర్పిస్తారు. గుంటూరు, కర్నూలు జిల్లాల్లో పర్యటించే నలుగురు సభ్యుల బృందం గురువారం రాత్రి ఏపీకి చేరుకుంది. కృష్ణాజిల్లాలో పర్యటించే సభ్యులు రావాల్సి ఉంది. మొత్తంగా ఐదు రోజులపాటు ఈ బృందాలు ఆయా జిల్లాల్లో పర్యటిస్తాయి. కర్నూలుకు డా.మధుమిత దూబే, డా.సంజయ్‌ సాధుఖాన్‌ వెళ్లనున్నారు. గుంటూరు జిల్లాలో డా.బాబీ పాల్‌, డా.నందిని భట్టాచార్య పర్యటిస్తారు. కృష్ణాలో డా.వివేక్‌ అధీష్‌, డా.రుచిగాయలాంగ్‌ పర్యటించనున్నారు.


కాగా ఢిల్లీ నుంచి వచ్చిన నలుగురు సభ్యులు శుక్రవారం ఉదయం ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ఎ్‌స.జవహర్‌రెడ్డితో సమావేశమయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలోని పరిస్థితులు, ఎక్కువ కేసులు నమోదువుతున్న జిల్లాలపై ఈ భేటీలో చర్చించారు. అనంతరం ఆరోగ్యశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌, ఇతర ఉన్నతాధికారులు కేంద్ర బృందంతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమయంలో రాష్ట్రంలో తొలి నుంచీ కరోనా నివారణకు చేపడుతున్న చర్యలు, అమలు చేస్తున్న విధానాలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వారికి వివరించారు. 

Updated Date - 2020-05-09T09:55:57+05:30 IST