సీఎం జగన్ ఇలాకాలో సీబీఐ టెన్షన్.. వైసీపీ నేతల గడగడ

ABN , First Publish Date - 2020-06-19T16:43:26+05:30 IST

సీఎం జగన్ ఇలాకాలో సీబీఐ టెన్షన్.. వైసీపీ నేతల గడగడ

సీఎం జగన్ ఇలాకాలో సీబీఐ టెన్షన్.. వైసీపీ నేతల గడగడ

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ ఇలాకాలో ఎవరికి సీబీఐ టెన్షన్‌ పట్టుకుంది? లాక్‌డౌన్ సడలింపు తర్వాత కడపలోకి సీబీఐ అధికారులు అడుగుపెట్టబోతున్నారా? వివేకా హత్యకేసు విచారణపై ఎలాంటి చర్చ మొదలైంది? లోకల్‌గా ఎవరెవరు భయపడుతున్నారు? ఆసక్తికర కథనం మీకోసం!


     కడప జిల్లాలోని పులివెందులలో ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి సొంత చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి గత ఏడాది మార్చి 15 తేదీ అర్ధరాత్రి దారుణహత్యకు గురయ్యారు. ఆ సంఘటన తెలుగు రాష్ట్రాలలో తీవ్ర సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ హత్య జరిగి 15 నెలలు గడిచాయి. వివేకా హత్యకేసు విచారణ కోసం అతి త్వరలో సీబీఐ బృందం రంగంలోకి దిగబోతోంది. ఈ అంశమే జగన్‌ ఇలాకా అయిన కడప జిల్లాలో హాట్‌ టాఫిక్‌గా మారింది. 


    వివేకా హత్య తర్వాత అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆ సంఘటన జరిగే నాటికి విపక్ష నేతగా ఉన్నా వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. వివేకా హత్యకేసు విచారణను సీబీఐకి అప్పగించాలని డిమాండ్‌ చేశారు. సీబీఐ విచారణ కోరుతూ వివేకా కుటుంబ సభ్యులందరూ హైకోర్టులో విడివిడిగా పిటిషన్లు దాఖలుచేశారు. వీరితోపాటు మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి కూడా సీబీఐకి ఈ కేసును అప్పగించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఈ నేపథ్యంలో ఏపీలో ప్రభుత్వం మారింది. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చారు. అనంతర కాలంలో ఈ పిటిషన్‌లు అన్నింటినీ ఒకే కేసు కింద పరిగణించి హైకోర్టు విచారించింది. వివేకా హత్య జరిగి నెలలు గడుస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్ బృందం విచారణలో ఫలితం కనిపించలేదని కోర్టు అభిప్రాయపడింది. వివేకా హత్యకేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ అయిదు నెలల క్రితం రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది.


    వివేకా హత్యకేసు విచారణపై హైకోర్టు ఇచ్చిన తీర్పు చాలామంది వైసీపీ నేతలకు మింగుడుపడలేదు. ఈ నేపథ్యంలో కడప జిల్లాలోని కొందరు నేతల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయన్నది లోకల్‌ టాక్‌! వివేకా హత్యకేసులో సీబీఐ రంగంలోకి దిగితే కొందరు కీలక నేతలకి సమస్యలు తప్పవని అంటున్నారు. నాటి రాష్ట్రప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్ బృందం విచారణను పరిగణనలోకి తీసుకుంటే అమాయకులకు శిక్షపడే ప్రమాదముందని గతంలో కొందరు వాదిస్తూ వచ్చారు. మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి, మరి కొందరు నేతలయితే.. "ఇంటి దొంగలను ఈశ్వరుడు కూడా పట్టలేడు'' అని వ్యాఖ్యలు కూడా చేశారు. 


    వివేకా హత్యకేసుపై ఇలా పలు రకాల అనుమానాలు వ్యక్తంకావడాన్ని హైకోర్టు కూడా పరిగణనలోకి తీసుకుంది. అందుకే ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుందని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. కరోనా విజృంభణతో అన్ని రకాల కార్యకలాపాలు స్తంభించిపోయాయి. అందువల్ల నిన్నమొన్నటివరకు వివేకా హత్యకేసు విచారణ విషయం కూడా మరుగునపడిపోయింది. ఇప్పుడు లాక్‌డౌన్‌ సడలింపులు తుది దశకు చేరాయి. త్వరలోనే పూర్తిస్థాయిలో ఆంక్షలు ఎత్తివేసినా ఆశ్చర్యంలేదు. ఈ తరుణంలోనే తొందరలోనే వివేకా హత్యకేసుపై సీబీఐ దర్యాప్తు మొదలుపెడుతుందని అంటున్నారు. చూద్దాం.. ఈ పరిణామం ఎటు దారితీస్తుందో!

Updated Date - 2020-06-19T16:43:26+05:30 IST