వివేకా ఇంటిని పరిశీలించిన సీబీఐ

ABN , First Publish Date - 2020-07-20T08:07:29+05:30 IST

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుపై రెండో రోజూ సీబీఐ అధికారులు విచారణ కొనసాగించారు.

వివేకా ఇంటిని పరిశీలించిన సీబీఐ

పులివెందుల పోలీస్‌ స్టేషన్లో రికార్డుల తనిఖీ 

రెండో రోజూ దర్యాప్తు..  త్వరలో అనుమానితుల విచారణ!


కడప, జూలై 19(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుపై రెండో రోజూ సీబీఐ అధికారులు విచారణ కొనసాగించారు. కేసు విచారణలో భాగంగా శనివారం జిల్లా కేంద్రానికి చేరుకుని.. కేసు దర్యాప్తు చేసిన సిట్‌ అధికారులతో మాట్లాడినట్లు సమాచారం. రెండోరోజు ఆదివారం.. వివేకా సొంత పట్టణం పులివెందులలో విచారణ చేశారు. 2019 మార్చి 14న అర్ధరాత్రి సొంత ఇంట్లోనే దారుణంగా హత్యకు గురైన వివేకానందరెడ్డి సీఎం వైఎస్‌ జగన్‌కు స్వయాన చిన్నాన్న. ఈ కేసులో సిట్‌ విచారణపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలంటూ వివేకా కుమార్తె డాక్టర్‌ సునీత హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.


హైకోర్టు ఆదేశంతో రంగంలోకి దిగిన సీబీఐ బృందం.. కేసు వివరాలతోపాటు సిట్‌ బృందాలు సాగించిన దర్యాప్తు సమాచారం సేకరిస్తున్నట్లు తెలిసింది. పులివెందుల డీఎస్పీ కార్యాలయంలో కేసు నమోదు, దర్యాప్తు వివరాలు తెలుసుకోవడమే కాకుండా అవసరమైన రికార్డులను కూడా ఆదివారం స్వాధీనం చేసుకున్నారని సమాచారం. అనంతరం వివేకానందరెడ్డి నివసించిన ఇల్లు, రింగ్‌ రోడ్డు పరిసరాలను పరిశీలించారని తెలిసింది. పూర్తి వివరాల సేకరణ తర్వాతకేసులో అనుమానితులను విచారించే అవకాశం ఉందని సమాచారం. 

Updated Date - 2020-07-20T08:07:29+05:30 IST