ఢిల్లీని దాటిన ఏపీ
ABN , First Publish Date - 2020-08-01T08:56:16+05:30 IST
రాష్ట్రంలో కరోనా విజృంభణ అడ్డుఅదుపు లేకుండా కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు కూడా పదివేలకు పైగా కేసులు నమోదయ్యాయి.

- కేసులు 10,376.. మృతులు 68
- 1,40,933కి చేరిన పాజిటివ్‌లు..
- జాతీయస్థాయిలో మూడో స్థానానికి
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
రాష్ట్రంలో కరోనా విజృంభణ అడ్డుఅదుపు లేకుండా కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు కూడా పదివేలకు పైగా కేసులు నమోదయ్యాయి. బుధవారం 10,093, గురువారం 10,167 కేసులు నమోదవగా శుక్రవారం కొత్తగా 10,376 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా 61,699 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 10,376 మందికి పాజిటివ్ వచ్చినట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఏపీలో కరోనా కేసుల సంఖ్య 1,40,933కి చేరింది. శుక్రవారం నమోదైన కొత్త కేసులతో కలిపి ఏపీ.. జాతీయ స్థాయిలో ఢిల్లీని దాటి మూడో స్థానానికి చేరింది. ఢిల్లీల్లో 1,34,403 మంది కరోనా బారిన పడగా, ఏపీలో ఆ సంఖ్య 1.40 లక్షలు దాటింది. తాజాగా అనంతపురంలో 1387, తూర్పుగోదావరిలో 1215, కర్నూలులో 1124, విశాఖలో 983, పశ్చిమగోదావరిలో 956, గుంటూరులో 906, నెల్లూరు 861 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.
శుక్రవారం 3,822 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరోవైపు రాష్ట్రంలో మరో 68 మంది మరణించారు. గుంటూరులో అత్యధికంగా 13 మంది ప్రాణాలు కోల్పోగా.. అనంతపురంలో 9, కర్నూలులో 8, చిత్తూరులో 7, తూర్పుగోదావరిలో 7, ప్రకాశంలో 6, విశాఖపట్నంలో 5, నెల్లూరులో 4, శ్రీకాకుళంలో 4, పశ్చిమగోదావరిలో 2, కడప, కృష్ణా, విజయనగరంలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో కరోనా మరణాల సంఖ్య 1349కి చేరింది.
ఏడు జిల్లాల్లో 10 వేలు
రాష్ట్రంలో 7 జిల్లాల్లో పదివేలకుపైనే కరోనా కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో ఏకంగా 20,395 పాజిటి వ్ కేసులు నమోదయ్యాయి. ఇక్కడ పదిరోజులగా వెయ్యి పై నే కేసులు నమోదవుతున్నాయి. కర్నూలులో మొదటి నుంచీ కేసుల తీవ్రత అధికంగా ఉంది. ప్రస్తుతం ఆ జిల్లాల్లో 16,847 పాజిటివ్‌లు నమోదయ్యాయి. అనంతపురంలో 14,699, గుం టూరులో 14,668, పశ్చిమగోదావరిలో 12,310 పాజిటివ్ కేసులున్నాయి. శుక్రవారం మరో 2 జిల్లాలు ఈ లిస్ట్‌లో చేరాయి. చిత్తూరులో కొత్తగా 789 పాజిటివ్ కేసులు నమోదుకావడం తో ఆ జిల్లాల్లో మొత్తం కేసుల సంఖ్య 10,378కి చేరాయి. ఇక విశాఖ జిల్లాలో అసలు కరోనా కేసులే లేవన్న విధంగా అధికారులు దాచిపెట్టే ప్రయత్నం చేశారు. కానీ జూలైలో విశాఖపట్నం బండారం బయటపడింది.
కేవలం 15 రోజుల వ్యవధిలోనే ఆ జిల్లాలో వేల కేసులు బయటపడ్డాయి. కృష్ణా, కడప కంటే విశాఖ జిల్లానే తొలుత 10 వేల మార్క్‌ను దాటింది. ప్రస్తుతం విశాఖలో 10,765 పాజిటివ్ కేలున్నాయి. అనంతపురం జిల్లాలో కరోనా ఉధృతి పెరిగిపోయింది. తాజాగా ఎన్నడూ లేని విధంగా 1387 కేసులు నమోదయ్యాయి. మరో 9 మంది మృతి చెందడంతో కరోనా మరణాల సంఖ్య 114కు చేరింది. శ్రీకాకుళం జిల్లాలో 402 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య 6,678కు చేరింది. కడపలో 646 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో జిల్లాలో బాఽధితుల సంఖ్య 8061కు చేరుకుంది. కర్నూలులో కొత్తగా 1124 మందికి పాజిటివ్‌గా నిర్ధారణైంది. 8 మంది మృతి చెందారు. తాజా కేసుల్లో కర్నూలు కలెక్టరేట్లోని ఓ ముఖ్య అధికారికి పాజిటివ్‌గా రావడం కలకలం రేపింది.
పశుసంవర్ధకశాఖ డైరెక్టర్‌కు కరోనా
రాష్ట్ర పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ డాక్టర్ ఎం శ్రీనివాసరావు కరోనా బారిన పడ్డారు. హోం క్వారంటైన్లో ఉండేందుకు ఆగ స్టు 1నుంచి 15వరకు ఆయన సెలవు పెట్టారు. కాగా, ప్రకాశం జిల్లా కురిచేడులో శానిటైజర్ తాగి మృతిచెందిన 11 మందిలో నలుగురికి కరోనా ఉన్నట్లు తేలింది.
రోజు వ్యవధిలో దంపతులు మృతి
వేంపల్లె: రోజు వ్యవధిలోనే భార్యాభర్తలను కరోనా బలితీసుకుంది. కడప జిల్లా వేంపల్లెకు చెందిన ప్రము ఖ హోంనీడ్స్ నిర్వాహకుడి(60)కి పది రోజుల క్రితం కరోనా పాజిటివ్ నిర్ధారణైంది. ఆయనను హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. తర్వాత మిగిలిన కుటుంబసభ్యులకూ కరోనా నిర్ధారణైంది. ఆయన భార్య(56) రెండు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆమెనూ హైదరాబాద్‌కు తరలించారు. గురువారం రాత్రి భార్య మృతి చెందగా, శుక్రవారం ఉదయం భర్త తుదిశ్వాస విడిచారు.