కరోనా 2.0

ABN , First Publish Date - 2020-12-28T07:47:39+05:30 IST

రాష్ట్రంలో కరోనా కొత్త స్ట్రెయిన్‌ కలకలం మొదలైంది. ఇప్పటికే బ్రిటన్‌ సహా పలు దేశాల్లో అలజడి రేపుతున్న ఈ కొత్త స్ట్రెయిన్‌ ఏపీలోనూ పాగా వేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కరోనా 2.0

  • రాష్ట్రంలో కొవిడ్‌ కొత్త రకం కలకలం!
  • మొత్తంగా 10 మంది అనుమానితులు 
  • యూకే నుంచి తిరిగి వచ్చిన ఆరుగురు 
  • వారి కాంటాక్ట్‌లుగా నలుగురి గుర్తింపు 
  • పుణె, బెంగళూరు ల్యాబ్‌లకు నమూనాలు 
  • రిపోర్టుల కోసం ఆరోగ్యశాఖ ఎదురుచూపు
  • అసాధ్యంగా మారిన కాంటాక్టుల ట్రేసింగ్‌ 
  • మళ్లీ నెల్లూరులోనే కొత్త కేసు నమోదు?


 ఆందోళన వద్దు: కాటంనేని భాస్కర్‌

కొత్తరకం కరోనాపై ప్రజలు ఆందోళన చెందవద్దని ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటంనేని భాస్కర్‌ విజ్ఞప్తి చేశారు. బ్రిటన్‌ నుంచి రాష్ట్రానికి తిరిగొచ్చిన వారిలో 1,187 మంది క్వారంటైన్‌లో ఉండగా, అందులో ఆరుగురికి పాజిటివ్‌ వచ్చిందని తెలిపారు. వారి కాంటాక్టులుగా 3,282 మందిని గుర్తించి, వారి నమూనాలు పరీక్షించగా, నలుగురికి వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయిందని వివరించారు. మరో 29 మంది జాడ తెలియాల్సి ఉందన్నారు. 


(అమరావతి-ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో కరోనా కొత్త స్ట్రెయిన్‌ కలకలం మొదలైంది. ఇప్పటికే బ్రిటన్‌ సహా పలు దేశాల్లో అలజడి రేపుతున్న ఈ కొత్త స్ట్రెయిన్‌ ఏపీలోనూ పాగా వేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొవిడ్‌ ప్రభావం తగ్గుముఖం పడుతున్న సమయంలో మళ్లీ ఈ తరహా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. శనివారం వరకూ యూకే నుంచి తిరిగొచ్చిన 1,216 మందిని ఆరోగ్యశాఖ గుర్తించింది. వీరిలో 1,187మంది ఆచూకీ లభించగా, ఆరుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరి నమూనాలను మరోసారి పుణె, బెంగళూరు ల్యాబ్‌లకు పంపారు. ఈ ఆరుగురిలో గుంటూరులో ఇద్దరు, తూర్పుగోదావరి, కృష్ణా, అనంతపురం, నెల్లూరు నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. వీరంతా యూకే నుంచి వచ్చి 10-12 రోజులు అవుతోంది. ఇన్నాళ్ల తర్వాత లక్షణాలు బయటపడటంతో వైద్యులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ ఆరుగురి కుటుంబసభ్యుల్లో మరో నలుగురికీ పాజిటివ్‌ వచ్చింది. ఇందులో ముగ్గురు గుంటూరులో, ఒకరు నెల్లూరులో ఉన్నారు. కొత్త స్ర్టెయిన్‌కు సంబంధించి రాష్ట్రంలో పదిమంది చికిత్స పొందుతున్నారు. అయితే లండన్‌ నుంచి నెల్లూరుకు వచ్చిన వ్యక్తికి కనిపిస్తున్న లక్షణాలు కొత్త రకానివేనని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్‌ కూడా ఈ విషయాన్ని దాదాపు ఖరారు చేశారు. అలాగే గుంటూరు జిల్లాలోనూ ముగ్గురికి ఇవే లక్షణాలు కనిపించాయి. అయితే ఇది కొత్త స్ట్రెయిన్‌ ద్వారా వచ్చిందా, ఇప్పటికే ఉన్నదేనా అనే విషయం సోమవారం వచ్చే రిపోర్టుల్లో తేలనుంది. కాగా, తొలి విడతలో బీభత్సం సృష్టించిన కరోనా మొదటి కేసు నెల్లూరులోనే నమోదయింది. మార్చి 12న ఆరోగ్యశాఖ ఆ జిల్లాలో తొలి కేసును గుర్తించింది. ఇప్పుడు కొత్త స్ర్టెయిన్‌కు సంబంధించిన తొలికేసు కూడా నెల్లూరులోనే నమోదయ్యే అవకాశం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు.


యూకే నుంచి వచ్చినవారిని గుర్తించడంతో పాటు వారి కాంటాక్ట్‌ల ట్రేసింగ్‌ ఆరోగ్యశాఖకు అత్యంత కష్టంగా మారింది. కరోనా కొత్త స్ర్టెయిన్‌ సమాచారం వెలుగు చూసిన తర్వాత కూడా విదేశాల నుంచి వచ్చేవారిని కేంద్రం దేశంలోకి అనుమతించింది. వేలాది మంది దేశంలోకి ప్రవేశించిన తర్వాత తర్వాత స్పందించిన కేంద్రం... యూకే నుంచి వచ్చిన వారంతా హోంక్వారంటైన్‌లో ఉండాలంటూ 20న మార్గదర్శకాలు జారీ చేసింది. అప్పటికే సొంత ప్రాంతాలకు చేరుకున్న వారంతా యథేచ్ఛగా బయట తిరిగారు. కుటుంబ సభ్యులు, బంధువులతో కలసి ఉన్నారు. ఇప్పుడు కాంటాక్టుల ట్రేసింగ్‌ అసాధ్యం గా మారింది. యూకే నుంచి 14న ఓ వ్యక్తి నెల్లూరు వచ్చారు. కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసే సమయానికే అందరితో కలసి మెలిసి తిరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయనతో పాటు తల్లి కూడా పాజిటివ్‌తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి నమూనాలు బెంగుళూరు ల్యాబ్‌కు పంపించారు. వారికి కొత్త స్ర్టెయిన్‌ సోకినట్లు నిర్ధారణ అయితే నెల్లూరు నగరం చాలావరకూ ప్రభావితమయ్యే ప్రమాదం ఉందని వైద్యవర్గాలు ఆందోళన చెందుతున్నాయి. 


8 ల్యాబ్‌ల్లో పరీక్షలు 

కరోనా పరీక్షలకు ఆరోగ్యశాఖ ప్రతి జిల్లాలోనూ ల్యాబ్‌లు ఏర్పాటు చేసుకున్నా కొత్త స్ర్టెయిన్‌ను నిర్ధారించే టెక్నాలజీ వాటి వద్ద లేకపోవడంతో నమూనాలను ఎన్‌ఐవీ/ సీసీఎంబీకి పంపించాల్సిన పరిస్థితి.. కొత్త రకం వ్యాధి నిర్ధారణకు కేంద్రం దేశవ్యాప్తంగా 8 ల్యాబ్‌లను గుర్తించింది. సీఎ్‌సఐఆర్‌(ఢిల్లీ), సీసీఎంబీ(హైదరాబాద్‌), డీబీటీ- ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ లైఫ్‌సైన్స్‌(భువనేశ్వర్‌), నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ అండ్‌ న్యూరోసైన్స్‌, డీబీటీ-ఎన్‌సీబీఎ్‌స(బెంగుళూరు), డీబీటీ-నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ బయోమెడికల్‌ జీనోమిక్స్‌(పశ్చిమబెంగాల్‌), నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (ఢిల్లీ), నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (పుణె) ల్యాబ్‌ల్లో మాత్రమే నిర్ధారణ పరీక్షలు చేయించాలని సూచించింది. 

Updated Date - 2020-12-28T07:47:39+05:30 IST