జగన్‌ది రివర్స్‌ మంత్ర

ABN , First Publish Date - 2020-06-11T09:37:42+05:30 IST

ప్రధాని మోదీ నేతృత్వంలో దేశంలో అవినీతి రహిత పాలన నడుస్తుంటే, ఏపీలో అందుకు భిన్నమైన పాలన నడుస్తోందని బీజేపీ నేత రాంమాధవ్‌ ఆక్షేపించారు.

జగన్‌ది రివర్స్‌ మంత్ర

  • రాజధాని.. పోలవరం.. ఎస్‌ఈసీ.. అన్నిట్లోనూ వెనక్కే
  • ఏపీలో అవినీతి పాలన నడుస్తోంది
  • వారానికోసారి హైకోర్టుతో మొట్టికాయలు
  • ఏడాదిలో ఆదాయం గణనీయంగా తగ్గింది
  • అధికారంలోకొస్తే మద్య నిషేధం అన్నారు
  • కొత్త కొత్త బ్రాండ్లతో దోచుకుంటున్నారు
  • ఇలాంటి ప్రభుత్వం ఎక్కడా లేదు: రాంమాధవ్‌
  • ఎస్‌ఈసీ విషయంలో తప్పు దిద్దుకోవాలి: కన్నా

విజయవాడ, జూన్‌ 10: ప్రధాని మోదీ నేతృత్వంలో దేశంలో అవినీతి రహిత పాలన నడుస్తుంటే, ఏపీలో అందుకు భిన్నమైన పాలన నడుస్తోందని బీజేపీ నేత రాంమాధవ్‌ ఆక్షేపించారు. ‘మోదీది ప్రోగ్రెస్‌ మంత్ర.. జగన్‌ది అంతా రివర్స్‌ మంత్ర’ అని విమర్శించారు. బీజేపీ ఏడాది పాలన సందర్భంగా బుధవారం విజయవాడలో వర్చువల్‌ ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ‘వైసీపీ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకుంది. పుట్టిన రోజున కనిపిస్తే నూరేళ్లు చల్లగా ఉండవయ్యా అంటాం. అంటే ఏడాది మొత్తం చేసిన పాపాలను మర్చిపోయామని కాదు. వైసీపీ పాలన విషయంలోనూ అంతే. ప్రొటోకాల్‌, పాలసీ రెండూ వేర్వేరు. ఏపీలో రివర్స్‌ మంత్రం నడుస్తోంది.


అన్నీ రివర్సే. రాజధాని రివర్స్‌. పోలవరం ప్రాజెక్టు టెండర్లు రివర్స్‌. ఎలక్షన్‌ కమిషన్‌లో రివర్స్‌’ అని విమర్శించారు. ఏపీలో ఒకరు బెయిల్‌పై బయట ఉంటే, మరొకరు లోపలకు వెళ్లకుండా బెయిల్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని, ఇక పాలనపై ఎక్కడ దృష్టి పెడతారన్నారని రాంమాధవ్‌ ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే మద్య నిషేధం అన్న వ్యక్తి ఇప్పుడు ఏపీ ప్రజలకు కొత్త కొత్త బ్రాండ్లు పరిచయం చేస్తూ దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. తిరుమల భూములనూ అమ్మే ప్రయత్నం చేశారని, ప్రజలు రివర్స్‌ కావడంతో వెనక్కి తగ్గారని ఎద్దేవా చేశారు. వారానికోసారి హైకోర్టు నుంచి మొట్టికాయలు తిన్న ప్రభుత్వం దేశంలో మరొకటి లేదన్నారు. కాగా, మరో ప్రత్యామ్నాయం లేకే వైసీపీకి ప్రజలు అధికారం కట్టబెట్టారని రాంమాధవ్‌ ఆక్షేపించారు. 


రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించాలి: కన్నా

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కేసులో హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా తప్పును సరిచేసుకుని రాజ్యాంగ వ్యవస్థలతో గౌరవంగా వ్యవహరించాలని హితవు పలికారు. మోదీ పాలనలో దేశప్రజల్లో భరోసా, భద్రత ఏర్పడ్డాయన్నారు. పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను కేంద్రం అమలు చేస్తోందని, ప్రపంచ దేశాలు సైతం మోదీ పాలనను మెచ్చుకుంటున్నాయని చెప్పారు.

Updated Date - 2020-06-11T09:37:42+05:30 IST