రాజధానికి సొమ్ములేదు..రంగులు వేసేందుకుందా?

ABN , First Publish Date - 2020-03-24T09:17:16+05:30 IST

‘‘రాజధాని నిర్మాణానికి సొమ్ములేదు.. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులేసేందుకు మాత్రం సొమ్ములున్నాయా?’’ అంటూ రాజధాని

రాజధానికి సొమ్ములేదు..రంగులు వేసేందుకుందా?

97వ రోజు కొనసాగిన రాజధాని ఆందోళన

వెయ్యి కోట్లు ఖర్చు పెట్టండి

అద్భుత నగరం సాక్షాత్కారం

ప్రభుత్వానికి రైతుల విన్నపం

రచ్చబండలే వేదికగా దీక్షా శిబిరాలు

వంతుల వారీగా రైతుల నిరసన వాడవాడలా 

‘జై అమరావతి’ నినాదాలు

గుంటూరు, మార్చి 23(ఆంధ్రజ్యోతి): ‘‘రాజధాని నిర్మాణానికి సొమ్ములేదు.. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులేసేందుకు మాత్రం సొమ్ములున్నాయా?’’ అంటూ రాజధాని రైతులు ప్రభుత్వాన్ని నిలదీశారు. రాజధాని గ్రామాల్లో ఉన్న రచ్చబండలే సోమవారం దీక్షా శిబిరాలయ్యాయి. రైతులు, మహిళలు వంతుల వారీగా వచ్చి దీక్షల్లో కూర్చున్నారు. రాజధానికి మద్దతుగా నినాదాలు చేశారు. ‘‘వెయ్యి కోట్లు ఖర్చు పెడితే అమరావతిలో 80ు పెండింగ్‌లో ఉన్న నిర్మాణాలు పూర్తయ్యేవి. ప్రభుత్వ భవనాలకు రూ.1,300 కోట్లు ఖర్చు చేసి మీ పార్టీ రంగులు వేశారు. కోర్టు మొట్టికాయలతో మరో రూ.వెయ్యి కోట్లతో ఆ రంగులు మార్చాలి. ఇదంతా ప్రజాధనం కాదా? అమరావతిపై కుంటి సాకులు చెబుతూ ఎందుకంత కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు?’’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలు సోమవారానికి 97వ రోజుకు చేరాయి. 3 రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 29 గ్రామాల్లో రైతులు, మహిళలు, కూలీలు ఉద్యమాన్ని హోరెత్తించారు. ‘జై అమరావతి’ నినాదాలతో మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతికేరించారు. 


 దూరం.. దూరం!

కరోనా ఎఫెక్ట్‌ను తగ్గించేందుకు తమ వంతు బాధ్యతగా వ్యవహరిస్తున్నట్టు రాజధాని రైతులు చెప్పారు. సామాజిక దూరం పాటిస్తూ నిరసనలు తెలిపారు. గ్రామాల్లోని ప్రధాన సెంటర్లు, రేడియో రూమ్‌లు, రచ్చబండలు, పాఠశాల ఆవరణలు దీక్షా శిబిరాలుగా మారాయి. విడతల వారీగా రైతులు, మహిళలు శిబిరాల వద్ద నిరసనలు తెలిపారు.    కోర్టుల తీర్పులతోనైనా తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. 


గ్రామ, గ్రామాన శిబిరాలు

నిన్నటి వరకు మందడం, తుళ్లూరు, వెలగపూడి, కృష్ణాయపాలెం, పెదపరిమి, ఎర్రబాలెం, తాడేపల్లి, మంగళగిరి ఇలా ముఖ్యమైన సెంటర్లలో దీక్షా శిబిరాలను నిర్వహించిన రైతులు కరోనా ఎఫెక్ట్‌తో ఉద్యమం తీరు మార్చారు. 29 గ్రామాల్లో ఎక్కడికక్కడ శిబిరాలను ఏర్పాటు చేశారు. వాటిలో పదుల సంఖ్యలో ఆందోళనకారులు దూరం దూరంగా కూర్చొని నిరసనలు తెలిపారు.  వంటా వార్పును కరోనా దృష్ట్యా రైతులు సోమవారం నిలిపివేశారు. 


 కొనసాగిన ‘అమరావతి వెలుగు’

రాజధానిపై ప్రభుత్వతీరు మారాలనే డిమాండ్‌తో ‘అమరావతి వెలుగు’ కార్యక్రమం కొనసాగింది. సోమవారం రాత్రి 7.30కు విద్యుత్‌ నిలిపివేసి కొవ్వొత్తులు వెలిగించి మహిళలు నిరసన తెలిపారు. ఇళ్ల ముందు చేపట్టిన ‘సేవ్‌ అమరావతి’ ముగ్గుల నిరసన కొనసాగించారు. 

Read more