మానవత్వం చూపండి!

ABN , First Publish Date - 2020-03-16T09:11:30+05:30 IST

‘‘మా జీవితాలతో పాటు భావితరాలు బాగుంటాయని ఆశపడ్డాం. విశ్వనగరంగా అమరావతి ఏర్పడుతుందని ప్రభుత్వాన్ని నమ్మి భూములు ఇచ్చాం. నేడు నట్టేట మునిగాం. కాస్త మానవత్వంతో ఆలోచించండి.

మానవత్వం చూపండి!

  • నమ్మి భూములు ఇచ్చాం.. 
  • ఇప్పుడు నట్టేట ముంచుతారా?
  • అమరావతిని కొనసాగించండి
  • రైతులు, మహిళల వేడుకోలు
  • సుదర్శన యాగం చేసిన రైతులు
  • 89వ రోజు కొనసాగిన ఆందోళనలు


గుంటూరు, మార్చి 15(ఆంధ్రజ్యోతి): ‘‘మా జీవితాలతో పాటు భావితరాలు బాగుంటాయని ఆశపడ్డాం. విశ్వనగరంగా అమరావతి ఏర్పడుతుందని ప్రభుత్వాన్ని నమ్మి భూములు ఇచ్చాం. నేడు నట్టేట మునిగాం. కాస్త మానవత్వంతో ఆలోచించండి. అమరావతిని రాజధానిగా కొనసాగించండి’’ అంటూ రైతులు, మహిళలు ప్రభుత్వాన్ని వేడుకున్నారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలనే డిమాండ్‌తో రైతులు, కూలీలు, మహిళలు చేస్తున్న ఆందోళనలు 89వ రోజు ఆదివారం కొనసాగాయి. రాయపూడి, వెలగపూడి, ఎర్రబాలెం, పెదపరిమి తదితర ప్రాంతాలల్లో రిలే దీక్షలు, ఆందోళనలు కొనసాగించారు. ఉద్దండ్రాయునిపాలెంలోని అమరావతికి శంకుస్థాపన చేసినప్రాంతంలో రైతులు సుదర్శన హోమం నిర్వహించారు. ఉదయం 7.25 గంటలకు మొదలైన ఈ హోమం 4 గంటలవరకు కొనసాగింది. అమరావతి దేవతల రాజధానిగా ఉందని చరిత్ర చెబుతోందని.. కానీ, జగన్‌ ప్రభుత్వం రాజధాని విషయంలో అరాచకంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.


పంచెల వేడుకలో ‘జై అమరావతి’

మందడంలో ఆదివారం పెద్ది నరహరిసాయి పంచెల వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి ‘జై అమరావతి’ ప్లకార్డులు, మెడలో పచ్చ కండవాలతో గ్రామస్థులు హాజరయ్యారు. నరహరిసాయి కూడా ‘జై అమరావతి’ నినాదాలు చేశారు.


ఇది.. ఆంధ్రాను కదిలించడమే..: స్వామి కమలానంద భారతి

అమరావతిని కదిలించటం అంటే ఆంధ్రాని కదిలించటమేనని స్వామి కమలానంద భారతి అన్నారు. గుంటూరులో ఆదివారం ‘అమరావతి ఆవశ్యకత’ అనే అంశంపై జరిగిన కార్యక్రమంలో ప్రసంగించారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని ముక్కలు చేయాలన్న కుట్ర సాగుతోందన్నారు. గోదావరి నీరు తెలంగాణ మీదుగా సీమకు అందిస్తామన్నప్పుడు ఈ కుట్రకు బీజం పడిందని తెలిపారు. అలానే విశాఖ రాజధాని అంటే ‘జై కళింగ’ ఉద్యమం పురుడుపోసుకుంటుందని చెప్పారు. హైదరాబాదులో ఆస్తులు ఉన్ననేతలు ఆంధ్రా పాలకులుగా ఉన్నంత కాలం రాష్ట్రానికి అధోగతేనని చెప్పారు. అమరావతితోనే ఆంధ్రా భవిత అని స్వామి స్పష్టం చేశారు. 


పరీక్షల కాలం!

తమకు, తమ పిల్లలకు పరీక్షా కాలం నడుస్తోందంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం సెలవుదినం కావడంతో పిల్లలను శిబిరాలకు తీసుకొచ్చి చదివించుకున్నారు. తుళ్లూరు శిబిరంలో చిన్నారులు సీఎం ఫొటో ఉన్న వ్యక్తి వద్ద తమ భవిష్యత్తును నాశనం చేయవద్దంటూ నినాదాలు చేశారు. తణుకువాసి వట్టికూటి సత్యనారాయణ రూ.50వేలు, నరసాయిపాలేనికి చెందిన బసవపున్నమ్మ 2బంగారు గాజులు, గుంటూరుకు చెందిన ప్రొఫెసర్లు రూ.10వేలు విరాళం ఇచ్చారు. కాగా, ఎర్రబాలెం, నవులూరు, నిడమర్రు, కృష్ణాయపాలెం గ్రామాల్లో రిలేదీక్షలు 89వ రోజుకు చేరాయి. పెనుమాక, ఉండవల్లిలో నిరసనలు కొనసాగాయి. పెనుమాకలో సీపీఐ ఎంఎల్‌ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మయ్య, పీడీఎ్‌సయూ రాష్ట్ర కార్యదర్శి యు.గనిరాజు, ప్రగతి శీల న్యాయవాద జిల్లా కార్యదర్శి ఎస్‌.సురేష్‌లు మద్దతు తెలిపారు.



Updated Date - 2020-03-16T09:11:30+05:30 IST