చస్తూ బతుకుతున్నాం!

ABN , First Publish Date - 2020-03-15T08:10:49+05:30 IST

‘నేతి బీరకాయలో నెయ్యి చందాన, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోంది. మా ఇళ్ల చుట్టూ తిరిగి రాష్ట్ర భవిష్యత్తు కోసం అంటూ గడ్డాలు పట్టుకొని బతిమాలి భూములు...

చస్తూ బతుకుతున్నాం!

  • ప్రభుత్వాన్ని నమ్మడమే పాపమైంది
  • 88వ రోజూ సాగిన ఆందోళన
  • నేడు చండీయాగం: జేఏసీ నేతలు

గుంటూరు, మార్చి 14(ఆంధ్రజ్యోతి): ‘నేతి బీరకాయలో నెయ్యి చందాన, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోంది. మా ఇళ్ల చుట్టూ తిరిగి రాష్ట్ర భవిష్యత్తు కోసం అంటూ గడ్డాలు పట్టుకొని బతిమాలి భూములు తీసుకొన్న అధికారులు... ఇప్పుడు మా మోహం చూసి చీదరించుకుంటున్నారు. ప్రభుత్వాన్ని నమ్మడమే పాపమైంది. ఎప్పుడు ఎమవుతోందన్న అన్న భయంతో చస్తూ బతుకుతున్నాం’ అంటూ రాజధాని ప్రాంత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజధానిగా అమరాతినే కొనసాగిచాలని డిమాండ్‌ చేస్తూ శనివారం 88వ రోజు అమరావతిలో ఆందోళనలు, నిరసన దీక్షలు కొనసాగించారు. తుళ్లూరు, మందడంలో మహాధర్నా నిర్వహించగా, వెలగపూడి, రాయపూడి, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం,  తాడికొండ అడ్డరోడ్డు, పెదపరిమి, తాడేపల్లి, నవులూరు, తదితర ప్రాంతాల్లో రిలే దీక్షలు, ఆందోళనలు కొనసాగించారు.


అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించే వరకు గాంధేయ మార్గంలో పోరు అపబోమని తెల్చిచెప్పారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు రివర్స్‌లో నడుస్తున్నాయని.. 9నెలల్లోనే మా బతుకులు తలకిందులయ్యాయంటూ తుళ్లూరు రైతులు, మహిళలు, రైతు కూలీలు రివర్స్‌లో దండం పెడుతూ నిరసన తెలిపారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాయపూడి రైతులు, మహిళలు రోడ్లు ఊడ్చారు. ,రైతుల ఆందోళనకు టీడీపీ మహిళా నేత గద్దె అనురాధ మద్దతు తెలిపారు. ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ఎస్పీ సాహేబ్‌, జేఏసీ నేత పాతర్ల రమేశ్‌ రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో ప్రవాసాంధ్రుల సౌజన్యంతో ఆదివారం ఉదయం 6నుంచి సాయంత్రం 6గంటల వరకు చండీయాగం నిర్వహిస్తున్నట్లు జేఏసీ నేతలు తెలిపారు.


అమరావతి కోసం నేను సైతం!

88రోజులుగా దీక్షా శిబిరంలో దివ్యాంగుడి సేవ

అమరావతి పరిరక్షణ ఉద్యమంలో ఓ దివ్యాంగుడు అందరినీ ఆకట్టుకుంటున్నాడు. 88 రోజులుగా రాయపూడి దీక్షా శిబిరానికి హాజరవుతున్న అంకరాజు అందరి తలలో నాలుకలా నిలుస్తున్నాడు. ఉదయం 9గంటలకు అందరికంటే ముందుగా వచ్చి టెంటుల్లో కుర్చీలు, మైకులు సిద్ధం చేస్తున్నాడు. తానే నినాదాలు చేస్తున్నాడు. ‘అమరావతిని కొనసాగేలా చూడమ్మా’ అంటూ శిబిరం పక్కనున్న పోలేరమ్మకు 88రోజులుగా స్వయంగా నైవేద్యం పెడుతున్నాడు. చదువు లేకపోయినా అతడి చొరవ, తెలివితేటలు, మాటలకు అందరూ ముగ్ధులవుతున్నారు. పేద కుటుంబంలో పుట్టిన అంకరాజుకు చదువుకునే అవకాశం కల్పిస్తామంటున్నా.. అమరావతి తరువాతే ఏదైనా అని చెబుతున్నాడు. 10నెలల క్రితం పోలీసులు వస్తున్నారంటే ఇంటినుంచి బయటకు కూడా వచ్చేవాడు కాదని.. అలాంటివాడు ఇప్పుడు పోలీసు అధికారులతో ధైర్యంగా మాట్లాడుతున్నాడని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చే పింఛన్‌ను కూడా నిరాకరించాడంటున్నారు.

Updated Date - 2020-03-15T08:10:49+05:30 IST