-
-
Home » Andhra Pradesh » capital amaravathi Farmers fight
-
ప్రకటన వచ్చేవరకు పోరు ఆపేది లేదు
ABN , First Publish Date - 2020-05-13T09:54:53+05:30 IST
అమరావతే రాష్ట్రానికి ఏకైక రాజధాని అని స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు తమ పోరు ఆపేది లేదని ఆ ప్రాంత రైతులు స్పష్టం చేశారు.

147వ రోజు అమరావతి రైతుల ఆందోళనలు
గుంటూరు, మే 12(ఆంధ్రజ్యోతి): అమరావతే రాష్ట్రానికి ఏకైక రాజధాని అని స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు తమ పోరు ఆపేది లేదని ఆ ప్రాంత రైతులు స్పష్టం చేశారు. రాష్ట్ర పాలనంతా అమరావతి నుంచే కొనసాగించాలనే డిమాండ్‌తో ఆ ప్రాంత రైతులు చేస్తోన్న ఆందోళనలు మంగళవారం 147వ రోజుకు చేరాయి. లాక్‌డౌన్ నేపథ్యంలో 29 గ్రామాల రైతులు, మహిళలు బృందాలుగా ఏర్పడి ఇళ్లలోనూ, రచ్చబండల వద్ద మూడు రాజధానులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కోర్టులు ఇచ్చిన తీర్పులకు వేరే భాష్యం చెబుతూ తామనుకున్న పనిని కొనసాగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మడం ఎలా? అంటూ నిలదీశారు.
దుర్ఘటనల్లో చనిపోయిన మనుషుల ప్రాణాలను డబ్బుతో లెక్కకడుతున్న ఈ ప్రభుత్వ చర్యలు దారుణమని వాపోయారు. తమతో చేసుకున్న ఒప్పందాల ప్రకారం అన్ని విధాలుగా తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అమరావతితోనే రాష్ట్రానికి వెలుగంటూ అమరావతి వెలుగు కార్యక్రమం కింద రాత్రి 7.30 గంటలకు 5 నిమిషాల పాటు ఇళ్లలో విద్యుత్‌ను ఆపి కొవ్వొత్తులు, దీపాలు వెలిగించి ‘జై అమరావతి.. సేవ్ అమరావతి’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాజధాని రైతులకు మద్దతుగా తాడికొండ మండలం పొన్నెకల్లు, మోతడక గ్రామాల్లో రైతులు, మహిళలు ఆందోళనలు కొనసాగించారు.