అభ్యర్థుల చూపు కంప్యూటర్‌ సైన్స్‌ వైపు!

ABN , First Publish Date - 2020-11-13T09:58:05+05:30 IST

ఎంసెట్‌-ఇంజనీరింగ్‌లో కీలక ర్యాంకులు పొందిన అభ్యర్థుల చూపు కంప్యూటర్‌ సైన్స్‌(సీఎ్‌సఈ)పైనే ఉంది. ఇక, రాష్ట్రంలోని ఏ ఇంజనీరింగ్‌ కాలేజీ మేనేజ్‌మెంట్‌ని

అభ్యర్థుల చూపు కంప్యూటర్‌ సైన్స్‌ వైపు!

రెండో ప్రాధాన్యంగా ఐటీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, డేటాసైన్స్‌, బిగ్‌డేటాల వైపు

మూడో ప్రాధాన్యం ఈసీఈ 

భవిష్యత్తుకు భరోసాతో ప్రణాళిక

ఎలక్ట్రికల్‌, సివిల్‌, మెకానికల్‌పై నిరాసక్తత

ఎంసెట్‌-ఇంజనీరింగ్‌ ర్యాంకర్ల ప్రాధాన్యమిదే


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఎంసెట్‌-ఇంజనీరింగ్‌లో కీలక ర్యాంకులు పొందిన అభ్యర్థుల చూపు కంప్యూటర్‌ సైన్స్‌(సీఎ్‌సఈ)పైనే ఉంది. ఇక, రాష్ట్రంలోని ఏ ఇంజనీరింగ్‌ కాలేజీ మేనేజ్‌మెంట్‌ని పలకరించినా సీఎ్‌సఈ బ్రాంచ్‌ గురించే చర్చ సాగుతోంది. జేఈఈ మెయిన్స్‌, అడ్వాన్స్‌డ్‌ ర్యాంకర్లు కూడా కంప్యూటర్‌ సైన్స్‌ వైపే మొగ్గు చూపుతున్నారు. గత కొన్నేళ్లుగా సీఎ్‌సఈ వైపు విద్యార్థులు మొగ్గు చూపుతున్నా.. ఇప్పుడు అది మరింత పెరిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు ఇంజనీరింగ్‌ ఆశావహుల దృష్టి అంతా కంప్యూటర్‌ సైన్స్‌ బ్రాంచ్‌పైనే ఉంది. రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ అడ్మిషన్ల కౌన్సెలింగ్‌ ఇంకా ప్రారంభం కానప్పటికీ మేనేజ్‌మెంట్‌ కోటా(కేటగిరి-బి) అడ్మిషన్‌ కోసం ఆరా తీస్తున్న, ఇప్పటికే అడ్మిషన్‌ ధ్రువీకరించుకున్న విద్యార్థులతో మాట్లాడగా సీఎస్‌ఈనే తాము కోరుకుంటున్నట్టు చెబుతున్నారు. రెండో ప్రాధాన్యంగా ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఐటీ) అదేవిధంగా కొత్త కోర్సులైన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌ (ఏఐ అండ్‌ ఎంఎల్‌), డేటా సైన్స్‌, బిగ్‌ డేటా, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌(ఐవోటీ), సైబర్‌ సెక్యూరిటీ, రోబోటిక్స్‌లను ఎంచుకుంటున్నారు. మొత్తం మీద అభ్యర్థులు కంప్యూటర్‌ సైన్స్‌కు మొదటి ప్రాధాన్యం ఇస్తూనే, అడ్మిషన్‌ అవకాశం లేకుంటే రెండో ప్రాధాన్యంగా ఐటీ, కొత్త కోర్సులను ఎంచుకుంటున్నారు. 


భవిష్యత్తుకు భరోసా ఉండడంతో..

కంప్యూటర్‌ సైన్స్‌ను తొలి ప్రాధాన్యంగా ఎంచుకోవడం వెనుక.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు వెంటనే లభిస్తుండడం, ప్రపంచ వ్యాప్తంగా భవిష్యత్తు కంప్యూటరీకరణ దిశగానే సాగుతుండడం వంటి కారణాలు కనిపిస్తున్నాయి. అమెరికా, జపాన్‌, చైనా తదితర అభివృద్ధి చెందిన దేశాలన్నీ ఆటోమేషన్‌ వైపు వెళ్తున్నాయి. దీంతో అభ్యర్థులు కంప్యూటర్‌ సైన్స్‌కు మొగ్గు చూపుతున్నారు. గత కొన్నేళ్లుగా క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లలో సింహభాగం సాఫ్ట్‌వేర్‌ కంపెనీల నుంచే వస్తున్నాయి.  గతంలో కొన్ని కోర్‌ కంపెనీలు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్ల కోసం వచ్చేవి. ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, సివిల్‌ బ్రాంచ్‌ల విద్యార్థులకూ ఉద్యోగాలు లభించేవి. కానీ, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆయా కంపెనీలు కూడా ఆటోమేషన్‌ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇక, మూడో ఫ్రిఫరెన్స్‌గా అభ్యర్థులు ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌(ఈసీఈ)ని ఎంచుకుంటున్నారు. కంప్యూటర్‌ రంగంతో పాటు ఎలకా్ట్రనిక్స్‌ రంగంలోనూ మంచి భవిష్యత్తు ఉండటమే కారణంగా తెలుస్తోంది. ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, సివిల్‌ వంటి కోర్‌ బ్రాంచ్‌లపై అభ్యర్థులు కన్నెత్తి చూడటం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని సింహభాగం ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలు సివిల్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌ విభాగపు ఫ్యాకల్టీని ఉద్యోగాల నుంచి తీసేస్తున్నారు. ముందుగా సీనియర్లను తీసేస్తున్నారు. వారికి ఎక్కువ జీతాలు ఇస్తుండడం, పని తక్కువ ఉండడంతో ఆర్థిక భారాన్ని తగ్గించుకుంటున్నారు. తక్కువ జీతంతో పనిచేసే జూనియర్‌ ఫ్యాకల్టీని కొనసాగిస్తున్నారు. 


డిమాండ్‌తో బాదేస్తున్నారు!

మేనేజ్‌మెంట్‌ కోటాలో సీఎ్‌సఈకి డిమాండ్‌ పెరగడంతో కాలేజీ యాజమాన్యాలు భారీ ఎత్తున ఫీజులు వసూలు చేస్తున్నాయి. విజయవాడ, గుంటూరు, చిత్తూరు, విశాఖ, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లోని ప్రముఖ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో రూ.4 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు డొనేషన్‌ డిమాండ్‌ చేస్తున్నట్లు సమాచారం. వీటిలో కొన్ని ఇప్పటికే బీ-కేటగిరికి సంబంధించి సీఎ్‌సఈ సీట్లను అనధికారికంగా భర్తీ చేసుకున్నట్లు తెలిసింది. ప్రతి జిల్లాలోనూ నాలుగైదు మధ్యస్థ ప్రమాణాలునన కాలేజీల మేనేజ్‌మెంట్లు ఈ కోర్సుకు రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. త్వరలో ప్రారంభం కానున్న కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీలోనూ కంప్యూటర్‌ సైన్స్‌కే తొలి ఆప్షన్‌ ఇచ్చేందుకు ర్యాంకర్లు ఆసక్తి చూపడం కాలేజీలకు కాసులు కురిపిస్తోంది. 

Updated Date - 2020-11-13T09:58:05+05:30 IST