బస్సులకు కోత
ABN , First Publish Date - 2020-11-03T09:10:40+05:30 IST
తెలంగాణ పంతం నెగ్గించుకుంది. బస్సులూ.. రూట్లూ.. కిలోమీటర్లలో పైచేయి సాధించింది. రెండు రాష్ట్రాల మధ్య ప్రధానమైన విజయవాడ- హైదరాబాద్
తెలంగాణ డిమాండ్లకు తలొగ్గిన ఏపీ
371 సర్వీసులు కోల్పోయిన ఏపీఎస్‌ఆర్టీసీ
1,04,348 కిలోమీటర్ల ప్రయాణానికీ కోత
రెండు రాష్ట్రాల మధ్య బస్సులు ప్రారంభం
అమరావతి, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): తెలంగాణ పంతం నెగ్గించుకుంది. బస్సులూ.. రూట్లూ.. కిలోమీటర్లలో పైచేయి సాధించింది. రెండు రాష్ట్రాల మధ్య ప్రధానమైన విజయవాడ- హైదరాబాద్, కర్నూలు- హైదరాబాద్ రూట్లలో వారి బస్సులే అధికంగా తిరగనున్నాయి. ఇక శ్రీశైలం-హైదరాబాద్ రూట్లో ఏపీఎస్ ఆర్టీసీ బస్సు ఒక్కటీ కనపడదు. తెలుగు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు నడిపేందుకు సోమవారం ఒప్పందం జరిగింది. ఈమేరకు సాయంత్రం నుంచే సర్వీసులు ప్రారంభమయ్యాయి. లాక్‌డౌన్ కారణంగా తెలుగు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. ఆతర్వాత అన్‌లాగ్ మొదలై.. రవాణా సౌకర్యాలు ప్రారంభమైనా.. రెండు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు మాత్రం ప్రారంభం కాలేదు. రెండు రాష్ట్రాల మధ్య సమాన స్థాయిలో బస్సు సర్వీసులు నడపాలని తెలంగాణ పట్టుపట్టింది. అందుకు తగ్గట్టుగా మీరు కూడా కిలోమీటర్లు పెంచుకోవాలని చెప్పినా..మేం పెంచం.. మీరే తగ్గించుకోండి అని పట్టుపట్టింది. తొలుత కిలోమీటర్లు తగ్గించుకోవాలంటూ ఒత్తిడితెచ్చి.. ఆపై రూట్ల విషయంలోనూ మెలికపెట్టి తమ పంతం నెగ్గించుకుంది. ఈ విషయంలో తెలంగాణ అధికారులు, ప్రభుత్వం ఒక్కమాటపై నిలిచి ఏపీపై ఒత్తిడి తేగా.. మన అధికారుల కృషికి ప్రభుత్వ సహకారం ఆశించినంతగా లేకపోయింది. ఏపీఎస్‌ఆర్టీసీ ప్రభుత్వ మద్దతు కోరినా మంత్రుల కమిటీ పట్టించుకోలేదు. ఎండీ కృష్ణబాబు స్వయంగా లేఖ రాసినా స్పందనే లేదు. పొరుగు రాష్ట్రానికి బస్సులు నడపాలన్న ప్రయత్నంలో చర్చలు జరిపిన ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులు.. టీఎస్ అధికారులను బతిమాలుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది.
షరతులన్నింటికీ తలొగ్గి ఒప్పందం చేసుకోవల్సి వచ్చింది. లాక్‌డౌన్‌కు ముందు తెలంగాణ రాష్ట్రానికి 13 రూట్లలో 1,009 బస్సులు నడిపిన ఏపీఎస్‌ఆర్టీసీ తాజాఒప్పందంతో 371 సర్వీసులు తగ్గించుకుంది. ఉమ్మడిరాజధానికి బస్సులు తిరిగే ప్రధానమైన రూట్లలో టీఎస్‌ఆర్టీసీ పైచేయి సాధించింది. లాక్‌డౌన్‌కు ముందు హైదరాబాద్‌సహా తెలంగాణలోని పలు ప్రాంతాలకు 2,65,347 కిలోమీటర్ల దూరం బస్సులు తిప్పిన ఏపీఎస్‌ఆర్టీసీ ఇకపై 1,60,999 కిలోమీటర్లకు పరిమితం కానుంది. అంటే ఏకంగా 1,04,348 కిలోమీటర్లు తగ్గించుకోవల్సి వచ్చింది. గతంలో లక్ష కిలోమీటర్లు వెనుకబడ్డ తెలంగాణ.. ఇప్పుడు 259 కిలోమీటర్లు ఎక్కువ దూరమే బస్సులు నడపనుంది. ఇక లాక్‌డౌన్ ముందు 746 బస్సులు తిప్పిన టీఎస్.. తాజాగా వాటి సంఖ్యను 826కు పెంచుకుంది.
హైదరాబాద్ రూట్లో వారివే ఎక్కువ
తెలుగురాష్ట్రాలమధ్య రవాణాలో హైదరాబాద్- విజయవాడ మార్గం ప్రధానమైనది. ఈ రూట్లో ఏపీఎస్‌ఆర్టీసీ 182 బస్సులు తగ్గించుకోగా తెలంగాణ ఏకంగా 80 బస్సులు పెంచుకుంది. మొత్తం టీఎస్ సర్వీసుల సంఖ్య 111కు పెరిగింది. అత్యంత లాభదాయకమైన ఈ రూట్లో తెలంగాణ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇక రెండో అతిపెద్ద మార్గమైన పంచలింగాల రూట్లో 86, మాచర్ల మార్గంలో 38, కర్నూలు రూట్లో 48, సత్తుపల్లి-జంగారెడ్డిగూడెం మార్గంలో 6 బస్సులను ఏపీ తగ్గించుకుంది. అయితే విజయవాడ తప్ప మిగిలిన అన్ని మార్గాల్లో తెలంగాణ బస్సులు పెరిగింది తక్కువే. కర్నూలుకు 10, మాచర్ల మార్గంలో 14, వాడపల్లి మీదుగా 21 పెంచారు. దీంతో కర్నూలు, వాడపల్లి, మాచర్ల మార్గాల్లో పొరుగు రాష్ట్రానికి ప్రయాణించే వారికి ఇబ్బందులు తప్పకపోవచ్చు.
ఆన్‌లైన్‌లో 15 బస్సులే
విజయవాడ నుంచి తెలంగాణవైపు వెళ్లేందుకు ఆన్‌లైన్‌లో కేవలం 15 బస్సులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. నవంబరు 8వరకూ కూడా ఇదే సంఖ్యలో బస్సులు ఉన్నాయి. అది కూడా వేకువజామున 4.45 గంటల తర్వాత. పగలంగా బస్సులే వేవు. రాత్రి 10గంటల తర్వాతే ఆన్‌లైన్ టికెట్లు అందుబాటులో ఉండటంతో ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే పగలు కూడా బస్సులు అందుబాటులో ఉంటాయని, ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పెంచుతామని ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు.
